Begin typing your search above and press return to search.

అవంతికి అనకాపల్లేనట....భీమిలీలో నో చాన్స్...?

By:  Tupaki Desk   |   28 Nov 2022 1:30 AM GMT
అవంతికి అనకాపల్లేనట....భీమిలీలో నో చాన్స్...?
X
మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అవంతి శ్రీనివాసరావు పరిస్థితి వైసీపీలో ఇపుడు ఇబ్బందికరంగా తయారైంది అంటున్నారు. సరిగ్గా 2019 ఎన్నికల ముందు ఆయన టీడీపీలో ఏ రకమైన వాతావరణాన్ని చూశారో సేం టూ సేం ఇపుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కోబోతున్నారు అని చెబుతున్నారు. ఆనాడు ఆయన భీమిలీ సీటు కోసం టీడీపీలో బిగ్ ఫైట్ చేశారు. అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రిగా గంటా శ్రీనివాసరావు ఉండడంతో అవంతికి టీడీపీ హై కమాండ్ హామీ ఇవ్వలేకపోయింది.

పైగా మరోసారి అనకాపల్ల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. తాను ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలనుకున్న అవంతికి మాత్రం ఆ పరిణామాలు రుచించక వైసీపీలోకి జంప్ చేశారు. అక్కడ ముందే మాట్లాడుకుని పార్టీ గెలిచాక మంత్రి అయ్యారు. అంతవరకూ బాగానే ఉన్నా మూడేళ్ళు తిరగకుండానే మంత్రి యోగం పోయింది. ఆరు నెలలు తిరగకుండానే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవీ పోయింది.

ఇపుడు చూస్తే భీమిలీ సీటు కూడా పోయేలా ఉంది అని అంటున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తొందరలోనే వైసీపీలో చేరుతారు అని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్న నేపధ్యంలో అవంతి వర్గీయులు టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఏరి కోరి గంటాను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్న హై కమాండ్ ఆయన కోరుకున్నట్లుగా భీమిలీ సీటు ఇవ్వడం ఖాయమని కూడా వారు అనుమానిస్తున్నారు. దీంతో తమ బాస్ కి టికెట్ దక్కదా అన్న బెంగ అయితే పట్టిపీడిస్తోందిట.

ఇదిలా ఉంటే భీమిలీలో అవంతికి తిరిగి టికెట్ ఇచ్చినా ఈసారి ఓడిపోతారు అని సర్వే నివేదికలు ఉండడంతోనే ఆయన ప్లేస్ లోకి గంటాను తెస్తున్నారు అని అంటున్నారు. 2014 ఎన్నికల్లో నలభై వేల ఓట్ల భారీ ఆధిక్యతతో గంటా గెలిస్తే జగన్ వేవ్ బలంగా ఉన్నా కూడా అవంతి 2019 ఎన్నికల్లో కేవలం పది వేల ఓట్ల లోపు ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు.అని అంటున్నారు.

ఇక మూడున్నరేళ్ళలో ఆయన మీద వ్యతిరేకత కూడా బాగా పెరిగిందని, లోకల్ బాడీ ఎన్నికల్లోనే అది రుజువు అయిందని, భీమిలీ మండలం, మునిసిపాలిటీలలో టీడీపీ తన సత్తా చాటుకుంది అని గుర్తు చేస్తున్నారు. అలాగే జనసేన, కూడా భీమిలీలో చాలా బలంగా ఉంది. ఈ రెండు పార్టీలను తట్టుకుని గెలవడం అవంతితో అయ్యేది కాదని అంచనాలు వేసుకున్న అధినాయకత్వం ఆయనకు టికెట్ ఇవ్వదు అని ప్రచారం అయితే ఉంది. ఇపుడు సడెన్ గా గంటా వైసీపీలోకి వస్తారు అని వార్తలు వస్తున్న క్రమంలో అవంతి సీటుకే ఎసరు పెడతారు అని అంటున్నారు.

ఆయనను అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయమని అధినాయకత్వం కోరుతుంది అని ప్రచారం సాగుతోంది. 2014లో అవంతి శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచారు. దాంతో ఆయనకు అక్కడ మంచి పరిచయాలు ఉన్నాయి. పైగా బలమైన కాపు సామాజికవర్గం కూడా కలసివస్తుంది. ఇక వైసీపీ రూరల్ జిల్లాలో బలంగా ఉంది. దీంతో గంటాను భీమిలీకి తెచ్చి ఆయన ద్వారా ఆ సీటుని కూడా కొట్టుకుని రావచ్చు అని డబుల్ విన్నింగ్ ప్లాన్ తోనే వైసీపీ ఈ రకమైన ఆలోచన చేసింది అని అంటున్నారు. మరి అవంతి ఈ ప్రతిపాదనకు ఏమంటారో అన్న ఆసక్తి ఉంది.

నిజానికి అవంతి అయితే అసలు ఒప్పుకోరు అనే అంటున్నారు. ఆయన మరోసారి ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని చూస్తున్నారు. మరి వైసీపీ కాదు అంటే ఆయన ఆ పార్టీలో ఉంటారా అన్న చర్చ కూడా ఉంది. ఇదిలా ఉంటే విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి విశాఖ పర్యటనకు వస్త అవంతి గైర్ హాజర్ కావడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక వైవీ మాట్లాడుతూ పార్టీ అవసరాన్ని బట్టి ఎవరిని అయినా చేర్చుకుంటుందని వ్యాఖ్యలు చేశారు. అలాగే పార్టీ పదవుల్లో కొందరిని తప్పించారు అంటే వారిని చిన్నబుచ్చినట్లు కానే కాదని కూడా ఆయన వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా అలకపానుపు అవంతి ఎక్కారని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.