Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ ప్లీన‌రీనా మ‌జాకా.. వివాహాన్ని మించిన విందు!

By:  Tupaki Desk   |   27 April 2022 9:30 AM GMT
టీఆర్ ఎస్ ప్లీన‌రీనా మ‌జాకా.. వివాహాన్ని మించిన విందు!
X
టీఆర్ ఎస్ ప్లీన‌రీనా మ‌జాకా.. వివాహాన్ని మించిపోయిన విందుతో ఘుమ ఘుమ‌లు.. కిలో మీట‌ర్ దూరం వ‌ర‌కు భోజ‌న ప్రియుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఓ వైపు నాటుకోడి పులుసు, మరోవైపు మటన్ వెరైటీలు.. ఇంకో వైపు వెజ్ వంటకాలు.. టీఆర్ ఎస్ ప్లీన‌రీ వేదిక‌గా అతిథుల‌కు వ‌డ్డించేందుకు రెడీ అయ్యాయి.

నాటు కోడి పులుసంటే ఎంతో ఇష్టపడే టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. టీఆర్ ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో 10 నుంచి 12 వేల మందికి పైగా అతిథులు.. పార్టీ నాయ‌కులు కార్య‌క‌ర్త‌ల‌కు ప్ర‌త్యేక వంట‌కాల‌ను రెడీ చేయించారు. వెజ్, నాన్వెజ్, స్వీట్లు ఇలా మొత్తంగా 33 రకాల వంటకాలను విందు కోసం ఏర్పాటు చేయించారు.

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా.. అతిధులకు నచ్చేలా, వారు మెచ్చేలా ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు. వెజ్‌, నాన్‌వెజ్‌ వెరైటీలు ప్రత్యేకం. రోటి పచ్చళ్లతో ఘుమఘుమలాడించే వంటకాలు మెనూలో ఉన్నాయి. రాయలసీమ రాగి సంకటి కూడా ఏర్పాటు చేశారు.

మాంసాహార ప్రియుల కోసం 9 రకాల వంటకాలు సిద్ధం చేశారు. చికెన్ ధమ్ బిర్యాని, మటన్ కర్రీ, నాటు కోడి పులుసు, ఎగ్ మసాలా, మటన్ నల్లపొడి ఫ్రై, మటన్ దాల్చా, బోటి ఫ్రై, పాయా సూప్, తలకాయ పులుసు ప్రత్యేకంగా తయారుచేశారు. అందుకోసం 10 క్వింటాళ్ల మటన్, 10 క్వింటాళ్ల చికెన్, బిర్యానీ కోసం 10 క్వింటాళ్ల చికెన్, 6 క్వింటాళ్ల నాటు కోడి కూర, 10 వేల కోడిగుడ్లు తెప్పించారు.

రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోద‌రుల‌కు ప్రత్యేకంగా హలీమ్ సైతం సిద్ధం చేశారు. వెజ్ వంటకాల్లో రోటీ పచ్చళ్లు, మూడు రకాల స్పెషల్‌ స్వీట్లు, గుత్తి వంకాయ కూర, జీడిపప్పు దట్టంగా జోడించిన బెండకాయ ఫ్రై.. వంటి కూరలతో ఘుమఘుమలాడించేలా వంటలు వండించారు.

ప్రత్యేక వంటకంగా రాగి సంకటితో పాటు రుమాల్ రోటీ, ఆలూ క్యాప్సికం, బగారా రైస్, వెజ్ బిర్యానీ, వైట్ రైస్, చామగడ్డ పులుసు, మామిడికాయ పప్పు, పచ్చిపులుసు, ముద్దపప్పు, సాంబారు, ఉలవచారు వంటలు సిద్ధం చేశారు. రోటీ పచ్చళ్లుగా వంకాయ చట్నీ, బీరకాయ టమోటా చట్నీ, వెల్లుల్లి జీడిగుల్ల ఆవకాయ తయారు చేశారు.

పెరుగు, పెరుగు చట్నీ, అందులో నంజుకోవడానికి వడియాలు, మిర్చి బజ్జీ చేయించారు. స్వీట్స్‌లో భాగంగా జిలేబీ, డబుల్‌కా మీటా, గులాబ్ జామ్ను ప్రత్యేకంగా తయారుచేశారు. భోజనం ముగిసిన తర్వాత చివరిగా ఐస్‌క్రీం అందించనున్నారు. అదేవిధంగా.. వివిధ ర‌కాల పండ్ల‌ను కూడా సిద్ధం చేశారు.