Begin typing your search above and press return to search.

గోదావరి సాక్షిగా బాబు : పొత్తులకు సై ...?

By:  Tupaki Desk   |   6 May 2022 9:17 AM GMT
గోదావరి సాక్షిగా బాబు : పొత్తులకు సై ...?
X
పొత్తులు ఎత్తులు అంటేనే చంద్రబాబు. ఆయనకు అన్నీ తెలుసు. కలిస్తే బలమనీ తెలుసు. అది విపక్షంలో ఉన్నపుడు. విడిపోతేనే గెలుపు అని కూడాతెలుసు. అది అధికారంలో ఉన్నపుడు. అందుకే 2019లో విపక్షాలు అన్నీ విడివిడిగా పోటీ చేయడం వెనక బాబు మాస్టర్ స్కెచ్ ఉందని అంతా అంటారు. ఇపుడు చూస్తే అందరూ కలసిరావాలి అని బాబు అంటున్నారు. భేషజాలు వీడి ఒక్కటిగా అధికార పక్షం మీద దాడి చేయాలి. ఓడించాలి అని పిలుపు ఇస్తున్నారు.

ఇక చంద్రబాబు పొత్తుల మీద ఆ మధ్య కుప్పం గడ్డ మీద నుంచి ఒక సంకేతాన్ని జనసేనకు పంపించారు. ఇపుడు అటు నుంచి ఇటు తిరిగి గోదావరి తల్లి సాక్షిగా మరో మారు పొత్తుల మీద కీలకమైన కామెంట్స్ చేశారు. అంతా కలిస్తేనే ఏపీలో అరాచకపాలనను అంతమొందించగలమని బాబు తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో నినదిస్తున్నారు.

అంటే ఇక్కడ నుంచి ఆయన పిలుపు ఇవ్వడం వెనక రాజకీయ వ్యూహంతో పాటు ఒక సెంటిమెంట్ కూడా ఉంది. గోదావరి జిల్లాలలో జనసేనకు బలం ఉంది. పైగా ఈ జిల్లాలు నిన్నటిదాకా టీడీపీకి బలమైన కోటలుగా ఉన్నాయి. ఇక ఏపీ రాజకీయాలను మార్చే జిల్లాలుగా వాటికి పేరు. దాంతో బాబు ఎంచుకుని మరీ ఇక్కడే బిగ్ సౌండ్ చేశారు అంటున్నారు. అయితే ఇక్కడ చీలి 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

ఇపుడు చూస్తే అలాంటి పరిస్థితి రాకుండానే బాబు పక్కా ప్లాన్ తోనే ఈ పిలుపు ఇచ్చారు అని అంటున్నారు. ఒక విధంగా పవన్ నోట వచ్చిన మాటనే బాబు కూడా తన మాటగా చెప్పారు అని అంటున్నారు. అంతా కలవాలి, అందరూ ఒక్కటి కావాలీ అని జనసేన ఆవిర్భావ సభలో పవన్ చెప్పిన మాట. ఇపుడు బాబు కూడా గోదావరి జిల్లా టూర్లో అదే మాట వల్లించారు.

అదే టైమ్ లో తమ్ముళ్ళకు కూడా ఆయన సూచనలు చేశారు. ఏపీలో అరాచక పాలన పోవాలీ అంటే తమ్ముళ్ళు కూడా కొన్ని త్యాగాలు చేయాలన్నది బాబు విన్నపం ఆ విధంగా ఆయన కోరడం ద్వారా గోదావరి జిల్లాల్లో బలం ఉన్న జనసేనకు అడిగినన్ని సీట్లు ఇస్తామన్న సంకేతాలను పంపించారు అని అంటున్నారు.

ఇక అన్ని పార్టీలు కలవాలి అని బాబు అనడం వెనక బీజేపీకి కూడా ఘనమైన ఆహ్వానం ఉందని అంటున్నారు. అంటే 2014 నాటి పొత్తులను రిపీట్ చేయడం అన్న మాట. ఇప్పటికైతే జనసేన టీడీపీ పొత్తు ఖాయమని అంతా అనుకుంటున్నారు. బీజేపీ పొత్తు అన్నది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు, కేంద్రంలో ప్రభుత్వానికి వైసీపీ మద్దతు కావాలి. అంటే చివరాఖరులోనే కమలనాధులు బాబు పిలుపునకు స్పందించే పరిస్థితి ఉంటుంది.

మొత్తానికి చంద్రబాబు ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పేశారు. పొత్తులతోనే వెళ్తున్నామని. అలా క్యాడర్ కి చెప్పి వారిని ఆ దిశగా సిద్ధం చేయడంతో పాటు, సీట్ల త్యాగాలని చేయాల్సి వస్తుందన్న దాన్ని కూడా ఆశలు పెట్టుకున్న వారికే చెప్పేశారు. అదే విధంగా అన్ని పార్టీలు కలవాలని అభిలషించడం ద్వారా బీజేపీని వదిలే ప్రసక్తి లేదని కూడా చాటారు అని అంటున్నారు. చూడాలి మరి బాబు పిలుపునకు విపక్షాల నుంచి రియాక్షన్ ఎలా వస్తుందో.