Begin typing your search above and press return to search.

ఆ ఉక్రెయిన్ దేవదూత.. అమెరికా

By:  Tupaki Desk   |   5 May 2022 11:30 AM GMT
ఆ ఉక్రెయిన్ దేవదూత.. అమెరికా
X
ఆయుధాలు, సైనిక సంపత్తిలో అమేయ శక్తి అయిన రష్యా ఓవైపు.. తక్కువ ఆయుధాలు.. స్వల్ప సైనిక శక్తి ఉన్న ఉక్రెయిన్ మరోవైపు.. కానీ, యుద్ధం రెండున్నర నెలలుగా సాగుతోంది. పదులకొద్దీ రష్యన్ జనరల్స్ నేలకొరుగుతున్నారు. వందలకొద్దీ ఆ దేశ సైనిక ట్యాంకులు ధ్వంసం అవుతున్నాయి. ఉక్రెయిన్ ఎంతకూ లొంగడం లేదు. దీంతో రష్యాలో అసహనం పెరిగిపోతోంది. మరి.. ఉక్రెయిన్ ఇంతకాలం నిలిచేందుకు కారణమేంటి? రెండు లేదా మూడు రోజుల్లో తమ వశం అవుతుందనుకున్న ఉక్రెయిన్.. రష్యా కంటిలో నలుసులా ఎందుకు మారింది...? అమెరికా సహా పాశ్చాత్య దేశాల ఆయుధ సాయమే ఇందుకు కారణం. అన్నిటికి మించి అమెరికా అందించిన ఆ చిన్న ఆయుధం ఎక్కువ మేలు చేసింది.

ఏమిటా ఆయుధం..?

ఏటీజీఎం (యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్‌). యుధ్దం మొదలైన తొలి రోజుల్లో ఈ ఆయుధాన్ని అమెరికా ఉక్రెయిన్ కు ఇస్తుంటే ఏమీ పెద్దగా అనిపించలేదు. ఏదో సాధారణ ఆయుధం అనుకున్నారు. కానీ, అది ఎంత ప్రభావవంతమైనదో ఇప్పుడు తెలిసొస్తోంది. ఉక్రెయిన్‌ ప్రజలు ఈ ఆయుధాన్ని ''సెయింట్ (దేవ దూత)''గా పిలుస్తున్నారంటేనే ఏటీజీఎం ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవచ్చు. పిల్లలకు 'జావెలిన్'‌,'జావెలినా' అనే పేర్లు పెడుతున్నారని బైడెన్‌ వ్యాఖ్యానించారంటే అర్థం చేసుకోవచ్చు.

ట్యాంక్‌ విధ్వంసక క్షిపణి అయిన ఏటీజీఎంను భుజంపై నుంచి శత్రు ట్యాంకులపైకి గురిపెట్టి ప్రయోగించవచ్చు. 3.7 అడుగుల క్షిపణి, డిస్పోజబుల్‌ లాంఛ్‌ ట్యూబ్‌, కమాండ్‌ కంట్రోల్‌ యూనిట్‌ ఉంటాయి. ఇలాంటి ఆయుధాన్ని ప్రయోగించిన ప్రదేశం నుంచి పొగ, వేడి వెలువడతాయి.

ప్రత్యర్థులు వాటిని గుర్తిస్తారు. కానీ, ఏటీజీఎంలో అలా కాదు. జావెలిన్‌లో తొలుత ట్యూబ్‌ నుంచి మోటార్‌ క్షిపణిని కొంతదూరం విసురుతుంది. తర్వాత క్షిపణి మోటార్‌ పనిచేయడం మొదలుపెట్టి లక్ష్యం చేరుతుంది. దీనిని కంప్యూటర్‌తో నియంత్రిస్తారు. దీంతో కచ్చితంగా జావెలిన్‌ను ఎక్కడి నుంచి ప్రయోగించారో శత్రువుకు అర్థంకాదు. ఈ లోపు ప్రయోగించిన వారు సురక్షిత ప్రదేశంలో దాక్కోవచ్చు.

ప్రత్యర్థి ట్యాంకులను కచ్చితంగా ధ్వంసం చేసేలా ఏటీజీఎంను డిజైన్‌ చేశారు. నేరుగా రెండున్నర మైళ్లలోపు దూరంలోని శత్రువు ట్యాంక్‌ పక్కభాగంపై లేదా పైభాగంపై దాడి చేసేలా ఏర్పాట్లు చేశారు. పైభాగంపై దాడి చేస్తుంది కాబట్టే దీనికి జావెలిన్‌ అనే పేరు పెట్టారు. రీయాక్టీవ్‌ ఆర్మర్‌ రక్షణ కవచాలను ఛేదించి.. ట్యాంకును ధ్వంసం చేసేలా దీనిలో రెండు దశల్లో పేలుడు పదార్థాలను అమర్చారు.

తొలిదశలో కవచాన్ని ఛేదించి.. ఆ తర్వాతి దశలో వార్‌హెడ్‌ ట్యాంక్‌ను ధ్వంసం చేస్తుంది. వీటిని అమెరికా సంస్థలు రేథియాన్‌, లాక్‌హీడ్‌ మార్టీన్‌ సంస్థలు అభివృద్ధి చేశాయి. ఏటీజీఎం ధర 80వేల డాలర్ల నుంచి 2లక్షల డాలర్ల వరకు ఉంటుంది. అమెరికాలో ఏటా 6,500 తయారు చేయగలరు. కానీ, ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టుల ప్రకారం 2,100 మాత్రమే ఉత్పత్తి చేయగలరు. ఉక్రెయిన్‌కు ఇచ్చిన జావెలిన్లు పోనూ.. అమెరికా గోదాముల్లో దాదాపు 20వేలు ఉండవచ్చని అంచనా. తాజాగా అమెరికా మరో 5వేల జావెలిన్లను ఉక్రెయిన్‌ తరలిస్తోంది. వీటికి ఉక్రెయిన్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉంది.