Begin typing your search above and press return to search.

నిర్మ‌ల‌మ్మా.. ఇప్పుడేమంటారు?.. జారుడు బండ‌పై రూపాయి విన్యాసం

By:  Tupaki Desk   |   19 Oct 2022 11:30 PM GMT
నిర్మ‌ల‌మ్మా.. ఇప్పుడేమంటారు?.. జారుడు బండ‌పై రూపాయి విన్యాసం
X
డాల‌రు బ‌ల‌ప‌డుతోంది కానీ.. రూపాయి బ‌ల‌హీన ప‌డ‌డం లేద‌ని.. మంత్రి నిర్మలాసీతారామ‌న్ చేసిన వ్యాఖ్య‌లు గుర్తున్నాయా? అయితే.. ఆమె చెప్పిన‌ట్టుగా అయితే.. ప‌రిస్థితి ఏమాత్రం క‌నిపించ‌డం లేదు. తాజాగా బుధ‌వారం రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. డాలరుతో పోలిస్తే 61 పైసలు క్షీణించి రూ.83.01కి చేరుకుంది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగోరోజు లాభాల్ని నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడమే రూపాయి పతనానికి కారణమని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మ‌రోవైపు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సానుకూలంగా ప్రారంభమైన సూచీలకు తర్వాత అమ్మకాల సెగ తగిలింది. అయినప్పటికీ లాభాలను మాత్రం నిలబెట్టుకోగలిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీలకు మద్దతుగా నిలిచాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు దిగిరావడం కూడా సెంటిమెంటును పెంచింది. అయితే, రూపాయి విలువ మరోసారి క్షీణించడం సూచీల లాభాలను కట్టడి చేసింది.

సెన్సెక్స్‌ 59,196.96 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 59,399.69 - 58,961.77 మధ్య కదలాడింది. చివరకు 146.59 పాయింట్లు ఎగబాకి 59,107.19 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25.30 పాయింట్ల లాభంతో 17,512.25 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి 82.91 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌30 సూచీలో 10 షేర్లు లాభపడ్డాయి.

నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌ గ్రిడ్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, టైటన్‌ షేర్లు లాభపడ్డ జాబితాలో ఉన్నాయి. ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, మారుతీ, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, ఎల్అండ్‌టీ, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ అత్యధికంగా నష్టపోయాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.