Begin typing your search above and press return to search.

మరీ ఇన్ని అబద్ధాలా ?

By:  Tupaki Desk   |   28 April 2022 12:05 PM IST
మరీ ఇన్ని అబద్ధాలా ?
X
రాష్ట్రానికి చేయాల్సింది చేయకపోగా మరోవైపు ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తోంది నరేంద్ర మోడీ సర్కార్. అందుకనే జనాలంతా బీజేపీపై మండిపోతున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ నేతలు నోటికొచ్చినట్లుగా అబద్ధాలు చెప్పుస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. విశాఖపట్నంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ విభజన చట్టాన్ని తూచా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేసేసినట్లు చెప్పారు.

విభజన చట్టాన్ని అమలు చేయటం కోసమే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. నిజానికి పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది యూపీఏ ప్రభుత్వం.

ఎందుకంటే యూపీఏ హయాంలోనే రాష్ట్ర విభజన జరిగింది. ఈ సందర్భంలోనే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అందరికీ తెలిసిన వాస్తవాన్ని కూడా పురందేశ్వరి అబద్ధం చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

ఇక విభజన చట్టంలో కీలకమైన ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ హామీలను నరేంద్ర మోడీ సర్కార్ తుంగలో తొక్కేసింది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు ఏమైందో తెలీదు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం ఎప్పుడో నిధులను ఆపేసింది.

ఏ రూపంలో తీసుకున్నా విభజన హామీలను తుంగలో తొక్కేసిన కేంద్రం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేస్తోంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు, ప్రజా సంఘాలు ఎంతగా గోల చేస్తున్న కేంద్రం ఏమాత్రం లెక్కచేయటం లేదు.

అడుగడుగునా ఒకవైపు రాష్ట్రాన్ని దెబ్బకొడుతునే మరోవైపు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పటం పురందేశ్వరి కే చెల్లింది. నిజంగానే రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇంత చేస్తుంటే మరి పార్టీని జనాలు ఎందుకు ఆదరించటం లేదు ? తిరుపతి లోక్ సభ, బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా ఎందుకు రాలేదో బీజేపీ నేతలు ఆలోచించారా ? సమావేశాల్లో కథలు చెబితే జనాలు తెలుసుకోలేనంత అమాయకులు కారని ముందు పురందేశ్వరి గ్రహించాలి. ముందు జనాలకు కావాల్సింది చేసి తర్వాత తాము అంత చేశాం ఇంత చేశామని చెబితే నమ్ముతారు. అంతేకానీ నోటికొచ్చినట్లు అబద్ధాలు చెబితే అందరూ నవ్వుతారు.