Begin typing your search above and press return to search.

వైసీపీలో మ‌రో ముస‌లం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌న్న ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   5 Feb 2023 8:55 PM IST
వైసీపీలో మ‌రో ముస‌లం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌న్న ఎమ్మెల్యే!
X
ఏపీ అధికార పార్టీ వైసీపీలో వివాదాలు.. విభేదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. నెల్లూరు పొలిటిక‌ల్ సీన్ ఇంకా మ‌రిచిపోక‌ముందే.. తాజాగా ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో పార్టీ ప‌రిస్థితి గాడి త‌ప్పుతోంద‌నే సంకేతాలు వ‌స్తు న్నాయి. జిల్లాలోని కోడుమూరు ఎమ్మెల్యే సుధాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేసేది లేద‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. ప్ర‌జ‌ల్లో పార్టీకి గ్రాఫ్ త‌గ్గిపోయింద‌ని.. దీనిలో త‌న ప్ర‌మేయం ఏమీలేద‌ని అన్నారు. అందుకే తాను పోటీ నుంచి విర‌మించుకుంటాన‌ని చెప్పారు.

ఏం జ‌రిగింది..?

కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గంలోని రూర‌ల్‌ మండలం ఉల్చాలలో ‘గడపగడపకు మ‌న ప్ర‌భుత్వం’ కార్యక్ర మం నిర్వ‌హించారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే సుధాక‌ర్ అక్క‌డ ప‌ర్య‌టించారు. ప్ర‌జ‌ల‌ను స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకుంటున్న క్ర‌మంలో.. మాజీ మండల అధ్యక్షుడు బుర్ర పెద్ద వెంకటేశ్‌నాయుడు ఆయన్ను తీవ్ర పదజాలంతో ప్రశ్నించారు.

‘మీరో నమ్మకద్రోహి. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వాళ్లను పక్కనపెట్టారు. మీకు టిక్కెట్‌ రావడానికి కష్టపడిన వారిని మరిచిపోయారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన రౌడీమూకలను అందలం ఎక్కించారు. ఇంతటి నమ్మక ద్రోహం చూడలేదు. తగిన మూల్యం చెల్లించుకోక తప్ప‌దు`` అని హెచ్చరించారు.

దీనికి సుధాకర్‌ స్పందిస్తూ రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని, మీకు న‌చ్చిన వారికి టికెట్ ఇచ్చుకోవ‌చ్చ‌ని తెలిపారు. ఇదేస‌మ‌యంలో మ‌రో గ్రామస్థుడు బోయ శివ మాట్లాడుతూ ‘గ్రామంలో కక్షపూరిత రాజకీయాలు పెరిగాయి. టీడీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారు. వీటిపై ఫిర్యాదు చేసినా చర్యల్లేవు. మీ ఆదేశాలతో చేస్తున్న బెదిరింపులకు మేం భయపడం’ అని స్పష్టంచేశారు. మొత్తానికి ఎమ్మెల్యేపై వ్య‌తిరేక‌త‌.. దీనికి తోడు సొంత పార్టీ నేత‌లే త‌న‌కు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నార‌నే వాద‌నల నేప‌థ్యంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.