Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రా సైకిల్ కి బ్రేకులేస్తున్న ఆ ఇద్దరూ...?

By:  Tupaki Desk   |   16 Jan 2023 2:40 PM GMT
ఉత్తరాంధ్రా సైకిల్ కి బ్రేకులేస్తున్న ఆ ఇద్దరూ...?
X
ఆ ఇద్దరూ చిన్న నాయకులు కాదు, అత్యంత సీనియర్ నేతలు. పైగా అధినాయకత్వానికి సన్నిహితంగా ఉండే నాయకులు. వారి వల్ల ఒకప్పుడు పార్టీ వెలిగింది. ఇపుడు వారి వైఖరి వల్ల ఇబ్బందులు పడుతోంది అని అంటున్నారు. తమ మధ్య ఆధిపత్య పోరు కోసం పార్టీని ఇక్కట్ల పాలు చేస్తున్నారు అని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు సీనియర్ నేతలే ప్రస్తుత ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడు. మాజీ ప్రెసిడెంట్ కిమిడి కళా వెంకటరావు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ ఇద్దరి మధ్య అసలు పొసగడంలేదు. ఆ మాటకు వస్తే దివంగత నేత ఎర్రన్నాయుడు ఉన్న కాలం నుంచే కిమిడీ కింజరాపు కుటుంబాల మధ్య గ్యాప్ ఉండేది అని చెబుతారు. ఎర్రన్నాయుడు చంద్రబాబు శిబిరంలో ఉంటే కళా వెంకటరావు పెద్దల్లుడు దగ్గుబాటి శిబిరంలో ఉండేవారు. అలా మంత్రి పదవుల నుంచి జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ల దాకా ఆ రెండు కుటుంబాల మధ్య పోటీ నడిచేది.

ఇక కింజరాపు వారసత్వాన్ని అచ్చెన్నాయుడు తీసుకున్నారు. దాంతో తెలుగుదేశంలో ఒక దశలో అలిగి ప్రజారాజ్యం వైపు వెళ్ళినా మళ్లీ సైకిల్ ఎక్కాల్సి వచ్చింది కళా వెంకటరావుకు. ఇక చంద్రబాబు సైతం ఆయనకు సముచిత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నా జిల్లాలో మాత్రం అచ్చెన్నాయుడు హవా ఎక్కువగా ఉంది. దాంతో కళా ఆయనతో ప్రచ్చన్న యుద్ధమే చేస్తున్నారు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరు నాయకులు తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడానికి పోటీలు పడడంతో ప్రతీ నియోజకవర్గంలో రెండేసి గ్రూపులు తయారయ్యాయని అంటున్నారు.

ఈ వర్గపోరు కాస్తా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది అని అంటున్నారు. అంటే మొత్తం 19 సీట్లు అన్న మాట. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చంద్రబాబు టికెట్లు కన్ ఫర్మ్ చేశారు. కానీ మిగిలిన 17 చోట్ల మాత్రం గ్రూపుల గోల మామూలుగా లేదు. ప్రతీ నియోజకవర్గంలో ఎవరికి వారు తమకే టికెట్ అని గట్టిగా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. రేపటి రోజున ఒక వర్గానికి టికెట్ ఇస్తే రెండవ వారు కచ్చితంగా యాంటీ చేస్తారు అని తమ్ముళ్ళు బెంగ పడుతున్నారు.

ఈ పరిస్థితిని సరిచేయాల్సిన అధినాయకత్వం కూడా పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అలాగే వర్గ పోరు ఒక స్థాయిలో సాగుతోంది అని అంటున్నారు. ఇక ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ హోదాలో అచ్చెన్నాయుడు శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, నరసన్నపేటలలో కొత్త నేతలను తయారు చేసి రెడీగా ఉంచారు. దాంతో పాత కాపులు అంతా కళాను ఆశ్రయించి గగ్గోలు పెడుతున్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలో రెండు కీలకమైన జిల్లాలలో పార్టీకి ఈ మధ్యనే ఆదరణ పెరుగొతోందని, అలాంటిది సొమ్ము చేసుకోకుండా ఈ గ్రూపుల గోల ఏంటి అని తమ్ముళ్ళు అంటున్నారు. వైసీపీలో గతంలో తీవ్ర విభేదాలతో ఉన్నా అధినాయకత్వం వారిని దగ్గరకు పిలిచి సరిచేసి పంపుతోంది. అదే సీన్ తెలుగుదేశంలో లేకపోవడం వల్ల ఈ వర్గ పోరు చివరికి విజయావకాశాలను దెబ్బ తీసే ప్రమాదం ఉంది అని అంటున్నారు. మరి అధినాయకత్వం పట్టించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.