Begin typing your search above and press return to search.

'పాల్' పాచిక.. చీలికలో ఉప చీలిక.. టీఆర్ఎస్ ఎత్తుగడేనా?

By:  Tupaki Desk   |   3 May 2022 11:30 AM GMT
పాల్ పాచిక.. చీలికలో ఉప చీలిక.. టీఆర్ఎస్ ఎత్తుగడేనా?
X
ఏమైనా అనుకోండి.. ఎన్నయినా చెప్పండి.. తెలంగాణలో కేఏ పాల్ సందడి మొదలైంది. 2019 ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో పూర్తిగా ఏపీకే పరిమితమై.. తన హావభావాలతో ఓవిధంగా విపరీతమైన పాపులారిటీ సంపాదించారు పాల్. అయితే, తీరా ఎన్నికల సమయానికి తన ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల బీఫామ్ లు అన్నిటినీ ఎవరో ఎత్తుకెళ్లారంటూ ఆరోపించారు. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా అటు రఘురామ క్రిష్ణంరాజు (వైసీపీ), ఇటు నాగబాబు (జన సేన) ప్రముఖులైన ఇద్దరి మధ్యలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా పాల్ నిలిచి చేసిన హంగామా అంతాఇంతా కాదు. అయితే, ఆ ఎన్నికల తర్వాత పాల్ కనిపించకుండా పోయారు. కొన్నాళ్లు అమెరికాలో ఉన్నట్లు కూడా చెబుతారు. ఇప్పుడు మళ్లీ పాల్ కాలం నడుస్తోంది. కానీ, ఏపీ తెరపై కాదు.

అనూహ్యంగా తెలంగాణ తెరపై..

వాస్తవానికి కేఎల్ పాల్ నేపథ్యం అంతా ఏపీనే. ఆయన సొంతూరు ఏపీలోని విజయనగరం జిల్లా. అక్కడే పుట్టి పెరిగి స్థానికంగా మత ప్రచారానికి వచ్చినవారి ద్వారా క్రైస్తవం స్వీకరించి.. మత ప్రబోధకుడిగా మారారని కథనం. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. పాల్ మత ప్రబోధకుడిగా చాలా ఉన్నత స్థాయికి ఎదిగారు. ఓ దశలో ప్రపంచ వ్యాప్తంగా ఆయన మత ప్రచారం సాగించారు. తన బోధనలతో ఎంతోమందిని ఆకట్టుకున్నారు. సొంతంగా భారీ విమానాలు కూడా ఉండేవి. కానీ, ఏమైందో ఏమో 2004 తర్వాత పాల్ ప్రవర్తనలో తేడా వచ్చింది. 2009 ఎన్నికలకు ముందు నాటి ఉమ్మడి ఏపీలోనూ ఆయన తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. అప్పటి సీఎం వైఎస్, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు చేసేవారు. నాడు కొత్తగా వచ్చిన ప్రజా రాజ్యం పార్టీనీ వదల్లేదు. ఇప్పట్లానే.. 2009 ఎన్నికల అనంతరం ఆయన మాయమయ్యారు. ఏపీ నేపథ్యం, 2019 ఎన్నికల్లో అక్కడే పోటీ చేసిన నేపథ్యం ఉన్న పాల్.. ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణ తెరపైకి వచ్చారు. పాల్ వ్యవహార శైలి, ఆయన మాటలు, చేష్టలు కొంత నవ్వు తెప్పించినా.. పాల్ ను రంగప్రవేశం చేయించడం వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోంది.

ఏమిటీ వ్యూహం..? ఎవరిదా వ్యూహం..?

తెలంగాణ ఎస్సీ జనాభా దాదాపు 20 శాతం ఉంటుంది. బీసీ జనాభా 60-70 శాతం ఉంటుంది. దళితుల్లో క్రైస్తవాన్ని ఆచరించేవారు ఎక్కువే. బీసీల్లోనూ పెద్ద సంఖ్యలోనే ఆకర్షితులయ్యారు. ఎవరి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు వారివి. అయితే, వీరంతా ఎక్కువ శాతం మారిన పరిణామాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పక్షాన్నే ఉన్నారు. కారణాలేమైనా.. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు దూరమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలు వీరి ఆదరణను చూరగొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీన్ని పక్కనబెడితే.. వచ్చే ఎన్నికలకు టీఆర్ఎస్ కు పలు అడ్డంకులు ఉన్నాయి. గెలుపును చేరాలంటే వీటిని అధిగమించాల్సి వస్తోంది.

రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్, షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ, ప్రవీణ్ కుమార్ ప్రాతినిధ్యంతో ఉనికిలోకి వచ్చిన బీఎస్సీ కాగా, ప్రభుత్వ వ్యతిరేకత. అన్నింటికీ మించి బండి సంజయ్ పగ్గాలతో దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీని నిలువరిస్తేనే మళ్లీ గెలుపు సాధ్యం. కాగా, సంస్థాగతంగా, తెలంగాణ వాదంతో టీఆర్ఎస్ ఏ స్థాయిలో బలపడిందో చూసిన ప్రత్యర్థులు.. ఆ పార్టీని ఓట్ల పరంగా బలహీనపర్చే ఉద్దేశంతో వైఎస్సారీపీ, ప్రవీణ్ కుమార్ (బీఎస్పీ)లను తెరపైకి తెచ్చారనే వాదన ఉంది. క్రైస్తవుల ఓట్లను షర్మిల, మిగిలిన దళితుల ఓట్లను ప్రవీణ్.. టీఆర్ఎస్ కు పడకుండా చీల్చుతారని భావన. ఇందులో వాస్తవం ఏమిటో తెలియదు కానీ.. ఇదే బలంగా ప్రజల్లోకి వెళ్తోంది. వీరి పార్టీల ప్రధాన గురి దళితులు, ఆ తర్వాత బీసీల్లో కింది తరగతుల వారు. దళితబంధు ఇతర కార్యక్రమాల ద్వారా ఈ ఓట్లు టీఆర్ఎస్ కే అనుకుంటున్న తరుణంలో వైఎస్సార్టీపీ, ప్రవీణ్ కుమార్ గండికొట్టే ప్రమాదం ఏర్పడింది.

టీఆర్ఎస్ విరుగుడు మంత్రం పాల్..

షర్మిల, ప్రవీణ్ వెనుక ఎవరున్నదీ వదిలేస్తే.. కేఏ పాల్ ను వారికి విరుగుడు మంత్రంగా టీఆర్ఎస్ ప్రవేశపెట్టిందా? అనిపిస్తోంది. ఆశ్చర్యకరంగా పాల్ కు పట్టున్నది దళితులు, బీసీల్లో కింది తరగతుల వారిలోనే. ఎంతలేదన్నా.. ఆయన చెప్పే మాటలు కొంతయినా ప్రభావం చూపుతాయి. షర్మిల, ప్రవీణ్ వైపు మొగ్గకుండా తనవైపు (ప్రజాశాంతి పార్టీ) వేసుకునేలా చేస్తాయి. అది ఒక శాతమా? రెండు శాతమా? అనేది చెప్పలేం. రాజకీయాల్లో ఒక్క ఓటు చాలు కదా? గెలుపోటములకు..? పాల్ తో ఏమీ కాదనుకోవడానికి కూడా లేదు. ఆయన పాత్ర ద్వారా గందోరగోళం రేపి.. అందరికంటే కేసీఆర్ నయమనుకునేలా చేయడమూ టీఆర్ఎస్ వ్యూహం కావొచ్చు. పైగా.. కేఏ పాల్ వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థని తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ప్రకటించడం గమనార్హం. అంటే.. షర్మిల పార్టీ, ప్రవీణ్ కుమార్ మధ్య పాల్ ను ప్రవేశపెట్టి గందరగోళం రేపే ఉద్దేశం టీఆర్ఎస్ ప్రణాళికల్లో ఉన్నట్లు కనిపిస్తోంది.

పాల్ అడుగులు అటే.. మరి దాడులెందుకో?

వ్యూహ ప్రకారం వెళ్తున్నారా? లేదా అడుగులు వాటంతటవే పడుతున్నాయా? తెలియదు కానీ.. పాల్ చర్యలు టీఆర్ఎస్ పథకానికి దగ్గరగానే ఉన్నట్లు అనిపిస్తోంది. వరంగల్ లో రాహుల్ గాంధీ హాజరుతో కాంగ్రెస్ తలపెట్టిన భారీ బహిరంగ సభకు పోటీగానా అన్నట్లు పాల్ అదే రోజు ప్రజా శాంతి సభ పెడతానంటూ హల్ చల్ చేశారు. తన సభకు అనుమతి నిరాకరణతో రాహుల్ మీద తనదైన శైలిలో పంచ్ లు వేశారు. ఇక ఇటీవల పాల్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా కొంత టీఆర్ఎస్ ఎత్తుగడల ఆలోచనలోనే ఉన్నాయి. కాగా, టీఆర్ఎస్ పెద్దల ఆలోచనలు ఇలా ఉంటే.. కేఏ పాల్ పై సోమవారం సిరిసిల్ల పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తల దాడి సంగతేమిటనే ప్రశ్న వస్తోంది. ఆ చర్య అనూహ్యంగా జరిగిందా? లేక అందులోనూ ఏమైనా స్క్రిప్ట్ ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.