Begin typing your search above and press return to search.

పాతికేళ్ల రాజకీయం కోసం అయిదేళ్ళు ఆగలేవా పవనూ...?

By:  Tupaki Desk   |   21 Oct 2022 5:00 AM IST
పాతికేళ్ల రాజకీయం కోసం అయిదేళ్ళు ఆగలేవా పవనూ...?
X
పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అన్నది టీడీపీకి ఆనందకరం అయితే జనసేనలో మాత్రం నాయకులకు పూర్తి నిరుత్సాహం కలిగించింది అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీలో పొత్తు అంటే చంద్రబాబే సీఎం అయి తీరుతారు అన్నది జనసేన క్యాడర్ కి బాగా అర్ధమైంది అని కూడా అంటున్నారు. అందుకోసమేనా జనసేన తరఫున ఇన్నేళ్ల పాటు రాజకీయాలు చేసేది అన్న నిర్వేదం కూడా వారిలో కనిపిస్తోంది.

పవన్ ఇగోను జగన్ రెచ్చగొడితే బాబు వచ్చిన అవకాశాన్ని బాగా వాడుకున్నారని, మధ్యలో పవన్ కళ్యాణ్ ఆవేశమే ఆయన్ని రాజకీయంగా పరమపధ సోపానానికి దూరం చేస్తోంది అన్నది బయట వారు కాదు, సొంత పార్టీ వారిలోనే చర్చకు వస్తున్న విషయమని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు. ఆయనకు ఉన్న క్రేజ్ ఎవరికీ లేదు అంటే అతిశయోక్తి లేదు. పవన్ వస్తే చాలు అలా నేల ఈనుతుంది. ఇక ఆయనకు ఉన్న మరో బలం బలమైన సమాజికవర్గం దన్ను.

ఆ సామాజికవర్గానికి రాష్ట్రం పుట్టాక ముఖ్యమంత్రి పదవి దక్కింది లేదు. దాంతో వారంతా పవన్ లో తమ ఆశలు తీరుతాయని ఎదురుచూస్తున్నారు. దానికి తగినట్లుగా పవన్ అడుగులు పడుతున్నాయనుకుంటే విశాఖలో జరిగిన కొన్ని సంఘటలను పవన్ లో అగ్ని కణాన్ని రగిలించాయి. ఆ వెలుగుల్లో టీడీపీకి దీపావళిని చంద్రబాబు చూసుకున్నారని అంటున్నారు. టైమ్లీగా చంద్రబాబు పవన్ని కలసి తన వైపు మళ్ళించుకున్నారని చెబుతున్నారు.

ఇక ఏపీలో 2024లో టీడీపీ జనసేన మరికొన్ని పార్టీలు కలిస్తే సీఎం అయ్యేది ఎవరు అంటే ఠక్కున ఎవరైనా చెప్పేది చంద్రబాబే అని. చంద్రబాబు సైతం పవన్ తో కలసి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఒక మాట అన్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా తాము ఉన్నామని, రెండవ ప్రతిపక్షంగా జనసేన ఉందని. అంటే జనసేన తమ తరువాతే అని బాబు అంటున్నారు. ఇప్పటికి ఇది నిజమే. కానీ ఏపీలో జనసేన ఎదుగుతున్న పార్టీ.

ఆ పార్టీ ఓటు బ్యాంక్ 2019 నాటి ఆరు శాతమే అని అనుకుంటే పొరపాటే అని కూడా అంటున్నారు. 2024 ఎన్నికలు జనసేనకు ఒక విధంగా బంగారు అవకాశమని అంటున్నారు. బీజేపీతో పోటీ చేసినా లేక ఒంటరిగా బరిలోకి దిగినా జనసేన బలం ఏంటి అన్నది కచ్చితంగా తేలుతుంది. అంతే కాదు 2019 నాటి నాసిరకం ఫలితాలు అయితే అసలు రావు అని జనసేన వారే కాదు రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతారు.

అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయంగా రిస్క్ చేయాలనుకోవడం లేదా అన్న చర్చ ముందుకు వస్తోంది. విజయం కావాలంటే సాహసం చేయాల్సిందే అని కూడా అంటున్నారు. జగన్ అయినా అప్పట్లో ఎన్టీయార్ అయినా ఒంటరిగా పోటీ చేయడం వల్లనే వారు సీఎం లు కాగలిగారు అని అంటున్నారు. పొత్తులు పెట్టుకుంటే ఎప్పటికీ బీజేపీ వామపక్షాల మాదిరిగా పక్క వాయిద్యాలుగా ఉండిపోతారు అని అంటున్నారు.

ఇక పవన్ విషయం తీసుకుంటే ఆయన కూడా విశాఖ వెళ్లనంతవరకూ ఒక కఛ్చితమైనా రాజకీయ అజెండాతోనే ఉన్నారని అంటున్నారు. పొత్తుల విషయం ఎన్నికల ముందరే అని భావిస్తూ జనసేన సొంత బలం ఏంటో చూసుకోవాలని ఆయన బస్సు యాత్రను కూడా పెట్టుకున్నారు. అయితే ఇంతలో జగన్ ఆయనలోని ఇగోని రెచ్చగొట్టడం, విశాఖలోని ఒక గదిలో రెండు రోజుల పాటు ఆయన్ని కట్టడి చేయడంతో పవన్ బరస్ట్ అయిపోయారు.

అంతే ఆయన విజయవాడ వస్తూనే అగ్ని పర్వతం మాదిరిగా నిండా ఫైర్ తో కనిపించారు. ఆయన ఎపుడూ ఎంత ఆవేశం వచ్చినా అనుచిత కామెంట్స్ పెద్దగా చేసింది లేదు. కానీ మంగళగిరిలో కార్యకర్తల సమావేశంలో అయితే చాలా దారుణంగా మాట్లాడారు. ఇది పవన్ పొలిటికల్ ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేసింది.

దీనికి మించి చంద్రబాబుతో భేటీ కూడా ఆయన విశ్వసనీయతను ప్రశ్నార్ధకం చేసింది అంటున్నారు. నన్ను ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతా అన్న పవనే కొద్ది గంటలు తిరగకముందే చంద్రబాబుతో భేటీ కావడం ద్వారా వైసీపీ ఆరోపణలకు ఊతమిచ్చారని అంటున్నారు. మొత్తానికి చూస్తే పవన్ ఎపిసోడ్ తో అటు అధికార వైసీపీ ఇటు టీడీపీ రెండూ రాజకీయంగా బాగా సర్దుకున్నాయని అంటున్నారు. చంద్రబాబు అందివచ్చిన అవకాశం అన్నట్లుగా పవన్ తో మీడియా మీట్ పెట్టిసి తన పావులు చకచకా కదిపితే వైసీపీ ప్యాకేజీ స్టార్ అన్న అంశాన్ని జనసేన వారికి జనాలకు తెలిసేటట్టుగా ఎలుగెత్తి చాటుతోంది.

ఈ మొత్తం ఎపిసోడ్ లో కేవలం ఆవేశం మూలంగా పవన్ రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అని అంటున్నారు. పొత్తుల విషయంలో పవన్ టీడీపీ ట్రాప్ లో పడిపోతున్నారు అని అంటున్నారు. దీంతో జనసేనలో నిరాశాపూరిత వాతావరణం కనిపిస్తోంది అంటున్నారు. రానున్న రోజుల్లో కొంత మంది నాయకులు కూడా బయటకు వచ్చేందుకు రెడీ అవుతున్నారుట.

ఇక బలమైన సామాజికవర్గం కూడా హోల్ సేల్ గా పవన్ కే వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇడ్డామని చూసింది. కానీ తాజా పరిణామాలు టీడీపీ తో పవన్ అంటకాగితే మాత్రం ఏ రాజకీయ పార్టీకి ఆ బలం బట్టి ఓట్లు అన్నట్లుగానే కాపుల్లో చీలిక ఉంటుందని అంటున్నారు. దీంతోనే వైసీపీలో మళ్లీ కొండంత ధైర్యం వచ్చిందని, తమ ఓట్లు తమకు కాపుల్లో ఉంటాయని వైసీపీ కూడా వ్యూహాలు మార్చుకుంటూ అడుగులు వేస్తోంది అంటున్నారు.

టోటల్ గా చూస్తే వినిపించే ఒకే ఒక్క మాట ఉంది. పాతికేళ్ళు రాజకీయం చేద్దామని వచ్చిన పవన్ ఒక్క అయిదేళ్ల పాటు ఆగి ఉండే సీఎం కుర్చీ దక్కేదని, కేవలం జగన్ మీద ద్వేషంతో తన అవకాశాలను జారవిడుచుకుంటున్నారు అని అంటున్నారు. మరి పవన్ ఈ పరిణామాలు అన్నింటి మీద పోస్ట్ మార్టం చేసుకుని ఏమైనా రిపేర్లు చేసుకుంటారా లేదా అన్నదే చర్చగా ఉంది .

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.