Begin typing your search above and press return to search.

జగన్... బాబుల కంటే ఎక్కువ కాదా....?

By:  Tupaki Desk   |   4 May 2022 5:30 PM GMT
జగన్... బాబుల కంటే ఎక్కువ కాదా....?
X
ఏపీలో అధికారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారు. విపక్షంలో ఉన్న చంద్రబాబు అనేక యుద్ధాలలో ఆరితేరిన రాజకీయ యోధుడు. ఆయన అటు నుంచి ఇటు వరకూ అన్నీ చూసిన వారు. ఆయన రాజకీయ జీవితం అర్ధ శతాబ్ద కాలం ఉంటుంది. అదొక చరిత్ర. ఇక జగన్ రాజకీయ జీవితం పుష్కర కాలం పూర్తి అయినా ఆయన ఎదుర్కొన్న అవమానాలు, తిన్న దెబ్బలూ అన్నీ కూడా ఆయనకు ఎన్నో గుణపాఠాలు చెప్పాయి. ఒక విధంగా రాటుదేలా చేశాయి.

ఇవే కాదు జగన్ చంద్రబాబూ ఇద్దరూ ప్రజలలో ఉన్న వారే. ఇద్దరూ మైళ్లకు మైళ్ళు పాతయాత్ర చేసిన వారే. వారికి తెలియని ప్రజా సమస్యలు ఏవీ లేవు. వారు జన హృదయాలను దగ్గరగా చూసి వాటి తలుపు తట్టారు. అంటే వారి కంటే ఎవరికీ ఏపీ గురించి పెద్దగా తెలియదు అనుకోఅవాలి. అయితే కొన్ని సార్లు తమ కంటే ఇతరులు తెలివైన వారు అని భావిస్తూ ఉంటారు.

అలా జగన్ ప్రశాంత్ కిశోర్ అనే వ్యూహకర్తను పెట్టుకుని 2019 ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. నిజానికి పీకే లేకపోతే జగన్ గెలవరా అంటే అపుడు కూడా గెలుస్తారు. కాకపోతే ఇంత పెద్ద ఎత్తున సీట్లు అయితే రాకపోవచ్చు. ఇక వ్యూహాలు ఏవైనా కూడా జనాదరణ ఉంటే పనిచేస్తాయి.

ఇలా ఎన్నికల్లో విజయానికి చాలా అంశాలు కలసిరావాలి. కేవలం వ్యూహకర్తల వల్లనే ఏమీ అయిపోదు. ఈ విషయం ఆలస్యంగా అయినా ఏపీకి చెందిన ఇద్దరు ప్రముఖ నాయకులూ గుర్తించారు అంటున్నారు. అందుకే జగన్ తనతో నాలుగైదేళ్ళుగా ఉన్న ప్రశాంత్ కిశోర్ అనబడే వ్యూహకర్త బంధాన్ని పుటుక్కున తెంచేసుకున్నారు. ఇక అంతా తన వ్యూహాలే అని జగన్ చెప్పేస్తున్నారు.

జనాల పల్స్ తమకు తెలుసని, దాని ప్రకారమే వచ్చే ఎన్నికలను ఫేస్ చేద్దామని జగన్ డిసైడ్ అయిపోయారు. పీకేలను పెట్టుకున్నా వారు ఇంతకంటే ఏమీ చెప్పేది కూడా లేదని కూడా వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. ఇక పీకే లాంటి వారు వ్యూహాలతో పాటు సంధాన కర్తలుగా అవతారం ఎత్తడం, పైగా తమ చిరకాల శతృవు అయిన కాంగ్రెస్ తో పొత్తు అంటూ ఒక కొత్త బంధాన్ని తెర మీదకు తీసుకురావడంతో వైసీపీ పెద్దలకు చిర్రెత్తుకుని వచ్చిందని అంటున్నారు. సో ఇక మీదట వైసీపీకి ఎవరూ వ్యూహకర్తలు ఉండరన్న మాట.

సేమ్ టూ సేమ్ అదే సీన్ విపక్ష టీడీపీలో కూడా ఉందిట. చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన మంచి వ్యూహకర్త. 2014 ఎన్నికల్లో అటు మోడీతో ఇటు పవన్ తో బంధం బాబు వ్యూహం కాక మరెవరిది. 2019లో కాలం కలసిరాక ఓడినా బాబు వ్యూహలను తప్పుపట్టలేరు కదా. అయినా సరే బాబు తమకంటే గొప్పగా ఏమైనా చెబుతారు అని పీకే శిష్యుడు రాబిన్ శర్మను తెచ్చి లోకల్ బాడీ ఎన్నికలతో పాటు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వేళ ఉపయోగించుకున్నారు.

అయితే ఆ రిజల్ట్స్ దారుణంగా ఉన్నాయి. పైగా హిందూత్వ నినాదాలతో టీడీపీని నడిపిద్దామనుకున్న శర్మ బ్యాచ్ బోల్తా కొట్టింది. ఆ తరువాత ఆయన్ని పంపించేసిన టీడీపీ మధ్యలో సునీల్ అనే మరో వ్యూహకర్తను ఎంగేజ్ చేద్దామనుకున్నా అది కూడా ఇపుడు వద్దు అనుకుంటున్నారుట. అంటే ఇక మీదట చంద్రబాబు రాజకీయ చాణక్యంతోనే ఏపీలో టీడీపీ తలపడుతుంది అంటున్నారు. మొత్తానికి సొంత బుర్రలనే పదును పెట్టి ఢీ అంటే ఢీ కొట్టాలని జగన్, బాబు డిసైడ్ అయ్యారన్న మాట. 2024 ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు విజయం సాధిస్తారో చూడాల్సిందే.