Begin typing your search above and press return to search.

జగన్.. ఇలా ఇంకెన్నాళ్లు?

By:  Tupaki Desk   |   11 Nov 2022 5:00 AM IST
జగన్.. ఇలా ఇంకెన్నాళ్లు?
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం.. మూణ్నాలుగేళ్ల పాటు విరామం లేకుండా చేసిన పాదయాత్ర. 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక పూర్తిగా జనంలోనే ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ.. వారిలో ఒకడిలా మారాడు జగన్. ఈ విషయంలో జగన్ ఒక రోల్ మోడల్‌ కనిపించాడు జగన్.

పాదయాత్రతో తండ్రిని మించి మైలేజీ పొంది.. 2019 ఎన్నికల్లో పార్టీకి ఘనవిజయాన్ని అందించాడు. సగర్వంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. కానీ అధికారంలోకి వచ్చాక అంచనాలను అందుకోలేక, అనాలోచిత నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుండడం తెలిసిందే. పాలకుడిగా ఆయన నిర్ణయాలను పక్కన పెడితే.. అధికారంలోకి రావడానికి ముందు తనకు ప్లస్ అయిన విషయాన్ని ఆయన పూర్తిగా విస్మరిస్తుండడం.. జనాలకు దూరం అయిపోతుండడం గమనార్హం.

ముఖ్యమంత్రి అన్నాక ఆయన చుట్టూ భద్రతా వలయం ఉండడం మామూలే. భద్రతా చర్యల్లో భాగంగా ఆయన చుట్టూ ఒక వ్యవస్థ పని చేయడం సాధారణమే. అలా అని సీఎం ఎక్కడ పర్యటిస్తే అక్కడ కిలోమీటర్ల కొద్దీ బారికేడ్లు కట్టేయడం.. కొన్ని చోట్ల పరదాలు ఏర్పాటు చేయడం మరీ విడ్డూరం. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇంతకుముందెప్పుడూ చూడని విడ్డూరం ఇది. ఇన్నాళ్లూ అయితే నడిచింది కానీ.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ సామాన్యులకూ జగన్ అంతకంతకూ దూరం అయిపోతుండడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ముఖ్యమంత్రి ఎక్కడైనా జనాలతో మాట్లాడినా.. వాళ్లు సామాన్యులు అయి ఉండడం లేదు. ముందే సెట్ చేసిన ప్రభుత్వ, పార్టీ మద్దతుదారులే ఉంటున్నారు. వారికి ముందే స్క్రిప్ట్ ఇచ్చి జగన్‌తో మాట్లాడిస్తున్నారు. ఇలాంటి సెటప్‌లు ఎంతో కాలం వర్కవుట్ కావు. తాజాగా గుంటూరు పర్యటన నేపథ్యంలోనూ జగన్ పర్యటించే రోడ్లలో బారికేడ్లు, పరదాలు కనిపిస్తున్నాయి. ఇలా ఆయన ఎంత కాలం మేనేజ్ చేస్తారన్నది అర్థం కావడం లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.