Begin typing your search above and press return to search.

జగన్ ఎస్ అంటే పంట పండినట్లే..!

By:  Tupaki Desk   |   6 Jan 2023 11:00 PM IST
జగన్ ఎస్ అంటే పంట పండినట్లే..!
X
వైసీపీలో పదవుల పండుగ ముందర ఉంది. నిజానికి కొత్త ఏడాదిలో అతి పెద్ద పండుగ సంక్రాంతిగా ఉంది. కానీ వైసీపీ వారికి మాత్రం మార్చి తరువాత వరస పండుగలే. దానికి కారణం ఒకేసారి ఏకంగా 23 ఎమ్మెల్సీ పదవులు భర్తీ కానున్నాయి. మొత్తం 58 మంది ఎమ్మెల్సీలలో నలభై అయిదు శాతం పదవుల భర్తీ అన్న మాట.

ఈ మొత్తం పదవులలో అత్యధిక భాగం వైసీపీకే దక్కనున్నాయి. 23 ఎమ్మెల్సీలు వివిధ కేటగిరీల ద్వారా భర్తీ చేస్తారు. ఎమ్మెల్యే కోటా. గవర్నర్ కోటా స్థానిక కోటాలలతో పాటు నేరుగా పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోటా నుంచి ఎన్నికలు జరిగేవి ఏడు ఎమ్మెల్సీలు ఉన్నాయి.

ఆ విధంగా తీసుకుంటే కేవలం ఏడు సీట్లు తప్ప మిగిలినవి అన్నీ డౌటే లేకుండా వైసీపీ ఖాతాలో పడడం ఖాయం. ఎమ్మెల్యేల కోటాలో ఏడు పదవులు భర్తీ అవుతాయి. పూర్తి స్థాయిలో వైసీపీకి మద్దతు ఉంది కాబట్టి ఆ ఏడు ఎమ్మెల్సీలు ఫ్యాన్ పార్టీవే. అలాగే లోకల్ బాడీస్ కోటాలో తొమ్మిది ఎమ్మెల్సీ పదవులు భర్తీ అవుతాయి. ఇక్కడ కూడా వైసీపీదే ఆధిక్యత పూర్తిగా ఉంది.

అలాగే గవర్నర్ కోటాలో రెండు పోస్టులను నామినేట్ చేయనున్నారు. ఆ పోస్టులు కూడా వైసీపీ ఖాతాలోకే వస్తాయని అంటునారు. ఇక పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. అక్కడ వైసీపీ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అవి ఏడు పదవులు ఉంటాయి.

ఆ పదవుల విషయంలో ఇప్పటికే అభ్యర్ధులను వైసీపీ ప్రకటించింది. దాంతో ఈ పద్దెనిమిది ఎమ్మెల్సీ పోస్టుల విషయంలో తీవ్రమైన పోటీ నెలకొని ఉంది అంటున్నారు. మార్చి లో 14 పోస్టులు, మే నాటికి మరో ఏడు, జూలై నాటికి రెండు ఎమ్మెల్సీ పోస్టులు భర్తీ అవుతాయి.

ఈ పదవులు దక్కించుకునేందుకు వైసీపీ నేతలు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2023లో కనుక ఈ పదవులు అందుకుంటే 2029 దాకా అంటే వచ్చే ఎన్నికల దాకా హాయిగా నిబ్బరంగా నిశ్చింగతా పదవులలో కొనసాగవచ్చు. 2029 ఎన్నికల సందర్భంగానే సీటు కోసం చూసుకోవాల్సి ఉంటుంది. దాంతో వైసీపీలో ముందు చూపు ఉన్న వారు అంతా ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీనే బెటర్ అని ఆ వైపుగా చూస్తున్నారుట. మరి ఈ విషయంలో జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఏపీలో హోరాహోరీ పోరు సాగనుంది అన్నది తెలుస్తోంది. దాంతో సామాజిక సమతూల్యతతో పాటు అన్ని అంశాలను బేరీజు వేసుకుని మరీ జగన్ పదవుల భర్తీని చేపడతారు అని అంటున్నారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సగం పదవులు కచ్చితనా ఇస్తారని అంటున్నారు. మొత్తానికి జగన్ దయ ఎవరి మీద ఉంటే వారే పెద్ద మనుషులు అవుతారు అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.