రాజాం వైసీపీ టికెట్ ఆయనకేనా...?

Fri Aug 05 2022 22:00:01 GMT+0530 (IST)

news on Kondru Murali Mohana Rao

వైసీపీ ఉత్తరాంధ్రాలో ఈ రోజు బలంగా ఉంది కానీ 2014 ఎన్నికల్లో బాగా దెబ్బతింది. ఏకంగా 34 సీట్లకు గానూ కేవలం 9 సీట్లు మాత్రమే గెలిచి చతికిలపడింది. అలా గెలిచిన వాటిలో రాజాం ఒకటి. ఎస్సీ రిజర్వుడ్ సీట్లో కంబాల జోగులు తొలిసారి నెగ్గి ఎమ్మెల్యే అయ్యారు. 2019 నాటికి మరోమారు ఆయనే గెలిచారు. అయితే ఈసారి అంతా ఈజీ కాదని అంటున్నారు.మరో వైపు ఆయన్ని తప్పించి వేరే వారికి టికెట్ ఇస్తారని కూడా ప్రచారం సాగుతోంది. జోగులు స్పీడ్ పెద్దగా లేకపోవడంతో పాటు పార్టీలో కూడా ఆయన పట్ల అసంతృప్తి ఉందని వార్తలు ఉన్నాయి. ఇక విపక్ష టీడీపీ చూస్తే బాగా పుంజుకుంది. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి కోండ్రు మురళీమోహనరావు అయితే రాజాం ని చుట్టేస్తున్నారు.

ఆయన ఈ మధ్య లోకేష్ వచ్చినపుడు రోడ్ షో పెడితే జనాలు ఇసుక వేస్తే రానంతంగా తరలివచ్చారు. మరో వైపు మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ కూడా ఇక్కడ టికెట్ కోరుకుంటోంది. ఆమె కూడా తన జోరు చూపిస్తోంది. ఈసారి టీడీపీ గెలిచే సీట్లలో రాజాం కూడా ఉందని ఆ పార్టీ గట్టిగా చెబుతోంది. ఈ నేపధ్యంలో జోగులుని ఈసారి మారుస్తారు అన్న టాక్ అయితే ఉంది.

కానీ జగన్ రాజాం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈసారి కూడా జోగులుని గెలిపించండి అని పిలుపు ఇచ్చారు. ఆయన్ని మళ్లీ ఎమ్మెల్యే చేసే బాధ్యత మీదే అంటూ జగన్ చెప్పిన విషయం చూస్తే జోగులకే టికెట్ దక్కుతుందా అన్న చర్చ మొదలైంది. ఆయనకు టికెట్ ఇస్తే పార్టీలో వ్యతిరేకత వస్తుంది అన్న ప్రచారం ఉన్నా కూడా జగన్ ఆయననే ఫైనల్ చేస్తున్నారు అంటే పార్టీ అధిష్టానం వద్ద ఉన్న నివేదికల్లో జోగులే బెటర్ క్యాండిడేట్ అన్న విషయం ఉందా అని కూడా అంటున్నారు.

అయితే టీడీపీ హయాంలో ఏ రకమైన ప్రలోభాలు పెట్టినా జోగులు పార్టీని వీడలేదు. బహుశా దాని వల్ల కూడా జగన్ ఆయనకే మళ్ళీ టికెట్ అని చెప్పి ఉంటారని అంటున్నారు. అయితే ఈ రోజున క్యాడర్ తో మీటింగ్ జరిగే వేళ జోగులు ఎమ్మెల్యే కాబట్టి ఆయన్నే గెలిపించండి అని జగన్ చెప్పారని దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సింది లేదని ఎన్నికల వేళకు పరిణామాలు మారితే కొత్త క్యాండిడేట్ కి ఇక్కడ టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు అని వైసీపీలో ఆశావహులు అంటున్నారు. చూడాలి మరి రాజాం వైసీపీలో ఏ రకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయో.