Begin typing your search above and press return to search.

రష్యాతో యుద్ధం: మోదీ మధ్యవర్తిత్వం చేయాలని ఉక్రెయిన్ కోరిక

By:  Tupaki Desk   |   31 March 2022 6:30 AM GMT
రష్యాతో యుద్ధం: మోదీ  మధ్యవర్తిత్వం చేయాలని ఉక్రెయిన్ కోరిక
X
రష్యాతో ఉన్న స్నేహాన్ని ఉపయోగించుకుని యుద్ధానికి ముగింపు పలకాలని భారత్‌ను ఉక్రెయిన్ కోరింది. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండు నెలలైంది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా భారత మీడియాతో మాట్లాడుతూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలిన్స్కీ -రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య మధ్యవర్తిగా ప్రధాని నరేంద్ర మోడీని చూడాలనుకుంటున్నామని తెలిపారు.

"ప్రధాని మోడీ ఆ పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉంటే, మేము ఆయన ప్రయత్నాలను స్వాగతిస్తాము," అని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి అన్నారు, ఉక్రెయిన్ ఎల్లప్పుడూ భారతీయ ఉత్పత్తుల నమ్మకమైన వినియోగదారు అని అన్నారు. “మేము ఎల్లప్పుడూ భారతీయ ఆహార భద్రతకు హామీ ఇచ్చేవారిలో ఒకరిగా ఉన్నాము. భారత్ కు పొద్దుతిరుగుడు నూనె, ధాన్యాలు మరియు ఇతర ఉత్పత్తులను సరఫరా చేస్తాము. ఇది అసాధారణంగా ప్రయోజనకరమైన సంబంధం.మాకు భారత్ అండగా నిలవాలని" ఉక్రెయిన్ మంత్రి విన్నవించారు.

భారత్ తో రష్యా సంబంధాలను సద్వినియోగం చేసుకోవాలని.. యుద్ధాన్ని ఆపడానికి అధ్యక్షుడు పుతిన్‌ను ఒప్పించాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి భారతదేశాన్ని అభ్యర్థించారు. “రష్యాలో నిర్ణయాలు తీసుకునే ఏకైక వ్యక్తి అధ్యక్షుడు పుతిన్. కాబట్టి ఈ యుద్ధాన్ని ఎలా ముగించాలో మీరు అతనితో నేరుగా మాట్లాడాలి, ” అని మోడీని కోరారు. ఈ గ్రహం మీద ఈ యుద్ధాన్ని కోరుకునే ఏకైక వ్యక్తి పుతిన్ అని ఆయన విమర్శించాడు.

ఉక్రెయిన్ దురదృష్టకర స్థితిలో ఉందని.. రష్యా దూకుడును అడ్డుకట్టవేయాలంటే భారత్ కు మాత్రమే సాధ్యమన్నారు. ఉక్రెయిన్‌కు భారత్‌ మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఖార్కివ్‌లో రష్యా బాంబు దాడిలో భారతీయ విద్యార్థి మరణించినందుకు ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. "రష్యా తన ట్యాంకులు మరియు విమానాలతో వచ్చే వరకు, ఉక్రెయిన్ భారతీయులకు నిలయంగా ఉంది. విద్యార్థులు తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాము, ”అని ఉక్రెయిన్ మంత్రి అన్నారు.