Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ సార్‌.. ప్లీజ్‌.. ప్లీజ్‌.. నాకూ ప‌ద‌వివ్వండి.. నెల్లూరు ఎమ్మెల్యే పాట్లు!

By:  Tupaki Desk   |   10 April 2022 1:30 AM GMT
జ‌గ‌న్ సార్‌.. ప్లీజ్‌.. ప్లీజ్‌.. నాకూ ప‌ద‌వివ్వండి.. నెల్లూరు ఎమ్మెల్యే పాట్లు!
X
మంత్రి వ‌ర్గ కూర్పు విష‌యం తెర‌మీదికి రాగానే.. అధికార‌ వైసీపీలో ఉన్న ఆశావ‌హులు అంద‌రూ.. తాడేప‌ల్లికి క్యూక‌ట్టారు.. త‌మ కూడా ప‌ద‌వులు ద‌క్కించుకునేందుకు.. తంటాలు ప‌డుతున్నారు. ఇలాంటి వారిలో .. నెల్లూరు నాయ‌కుడు.. రూర‌ల్ ఎమ్మెల్యే.. ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి కూడా ఉన్నారు.

ఈయ‌న వైఎస్ కుటుంబానికి, ముఖ్యంగా జ‌గ‌న్‌కు అత్యంత ఆత్మీయుడుగా పేరు తెచ్చుకున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్షంపై నిప్పులు చెర‌గ‌డంలోనూ ముందుంటారు. పార్టీ త‌ర‌ఫున కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు గ‌ట్టి వాయిస్ వినిపించారు. అయితే.. ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న తెర‌మీదికి వ‌చ్చారు. త‌న‌కు కూడా ప‌ద‌వి కావాలంటూ.. అభ్య‌ర్థిస్తున్నారు. తాడేప‌ల్లి ప్యాలెస్‌ను ప‌దే ప‌దే త‌పిస్తున్నారు.

ఇక‌, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి వైసీపీ స్థాపించిన‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్ వెంట న‌డుస్తున్నారు. గ‌తంలో ఆయ‌న కాంగ్రెస్‌లో ఉన్నారు. జ‌గ‌న్ పార్టీ పెట్టిన వెంట‌నే వైసీపీ కండువా క‌ప్పుకొన్నారు. ఏ ప‌ద‌వీ లేక‌పోయినా వైసీపీ వాయిస్‌ను వివిధ మీడియా సంస్థ‌ల వేదిక‌గా బ‌లంగా వినిపిస్తూ వ‌స్తున్నారు. 2014, 2019ల‌లో వ‌రుస‌గా నెల్లూరు రూర‌ల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మంత్రిప‌దివిని ఆశిస్తున్నారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఎందుకు ఇవ్వొచ్చు.. అనే విష‌యంపై అర్హ‌త‌ల‌ను కూడా వెల్ల‌డిస్తున్నారు. త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట పెట్టుకున్నారు.

జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. అయితే కొత్త కేబినెట్ జాబితాలో త‌న పేరు వుందో, లేదో తెలియ ద‌న్నారు. 150 మంది ఎమ్మెల్యేల‌కూ మంత్రి కావాల‌నే ఆశ వుంటుంద‌ని కోటంరెడ్డి చెప్ప‌డం విశేషం. అయితే.. అంతిమంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నిర్ణ‌యానికి అంద‌రూ క‌ట్టుబ‌డి ఉంటార‌న్నారు. తిరిగి నియోజ‌క‌వ‌ర్గంలో ``జ‌గ‌న‌న్న మాట‌, గ‌డ‌ప‌గ‌డ ప‌కి కోటంరెడ్డి బాట`` కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తాన‌న్నారు. ఇదిలావుంటే, నెల్లూరు నుంచి.. సీనియ‌ర్ నాయ‌కుడు.. ప్ర‌స్తుతం అసెంబ్లీ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం చైర్మన్ కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డికి ప‌ద‌వి ఖాయ‌మైన‌ట్టు నెల్లూరులో చ‌ర్చ జ‌రుగుతోంది.

మ‌రో వైపు.. ఈ జిల్లా నుంచి న‌లుగురు రెడ్లు మంత్రి ప‌ద‌వుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో మాజీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు.. ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు సొంత పార్టీపై క‌త్తులు నూరిన ఆయ‌న ఆక‌స్మికంగా.. త‌న మ‌న‌సు మార్చుకుని.. జ‌గ‌న్‌ను కొనియాడుతున్నారు.

దీనిని బ‌ట్టి.. ఆయ‌న కూడా మంత్రి రేసులో ఉన్నార‌ని.. నెల్లూరు పెద్దారెడ్లు అంచ‌నా వేస్తున్నారు. ఇక‌, మ‌రో నేత‌ కోవూరు ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డిని పిలిపించుకుని మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేన‌ని చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీకి నెల్లూరు జిల్లా కంచుకోట‌. రెడ్డి సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉన్న ఆ జిల్లాలో వారికి ప్రాధాన్యం ఇవ్వ‌డం స‌ముచితమ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.