Begin typing your search above and press return to search.

పేషీలు ఖాళీ చేస్తున్న మంత్రులు ?

By:  Tupaki Desk   |   7 April 2022 11:04 AM IST
పేషీలు ఖాళీ చేస్తున్న మంత్రులు ?
X
రాజీనామాలు తప్పవని అర్ధమైపోయిన మంత్రుల్లో కొందరు తమ పేషీలను ఖాళీ చేస్తున్నారట. 7వ తేదీన మధ్యాహ్నం క్యాబినెట్ సమావేశం జరగబోతోంది. ఇదే తమలో చాలామందికి చివరి క్యాబినెట్ భేటీ అని చాలామంది మంత్రులకు సిగ్నల్స్ అందాయట. అందుకనే రాజీనామాలు చేసేంతవరకు వెయిట్ చేయటం అనవసరమని కొందరు మంత్రులు ఇప్పటికే డిసైడ్ అయిపోయారట. ఇందులో భాగంగానే తమ పేషీలను ఖాళీ చేసేశారట.

తమ కార్యాలయాల్లో పనిచేసిన స్టాఫ్ అడిగిన విభాగాలకు వాళ్ళకు పోస్టింగులు ఇవ్వాలంటు రికమెండేషన్ లెటర్లు కూడా ఇచ్చేశారట. అలాగే తమ వ్యక్తిగత ఫర్నీచర్ ను ఆఫీసుల నుండి తీసుకుని వెళిపోయినట్లు సమాచారం. అలాగే తమ ఇళ్ళల్లో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్ ను కూడా తీసుకుని వెళ్లిపోవాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు చెప్పేశారట.

అంటే క్షేత్రస్థాయిలో జరుగుతన్నది చూస్తుంటే చాలా మంది మంత్రులు క్యాబినెట్ లో నుండి బయటకు వెళ్ళిపోవటానికి మానసికంగా సిద్ధమైపోయినట్లు అర్థమవుతోంది. క్యాబినెట్లో ఉండేదెవరు, వెళ్ళిపోయెదెవరనే విషయంలో జగన్మోహన్ రెడ్డికి తప్ప రెండో వ్యక్తికి తెలిసే అవకాశం లేనే లేదు. కేబినెట్ కూర్పులో జగన్ అనేక కాంబినేషన్లను లెక్కేసుకుంటున్నారు. తన లెక్కల్లో సరిపోయేవారిని మాత్రమే జగన్ మంత్రివర్గంలోకి తీసుకుంటారనటంలో సందేహంలేదు.

మొహమాటాలకు పోయి లేకపోతే ఒత్తిళ్ళకు లొంగిపోయే అవకాశం లేదని అందరికీ తెలుసు. ఎందుకంటే ఇపుడు ఏర్పాటవబోయే మంత్రివర్గంతోనే రాబోయే ఎన్నికలను జగన్ ఎదుర్కోవాలి. అందుకనే మొహమాటాలు, ఒత్తిళ్ళకు జగన్ లొంగే అవకాశం లేదు.

సీనియర్ మంత్రులు బొత్సా సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసులరెడ్డి లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. నిజానికి మార్పులు, చేర్పుల్లో ఎవరుంటారో ఎవరూడిపోతారో తెలీదు కానీ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న పేర్లతోనే అందరిలోనూ టెన్షన్ పెరిగిపోతోంది. ఈ టెన్షన్ కు జగన్ ఎంత తొందరగా తెరదించితే పార్టీ, ప్రభుత్వానికి అంతమంచిది.