Begin typing your search above and press return to search.

కొత్త మలుపు: యాక్సిడెంట్ చేసిన కారులో బోధన్ ఎమ్మెల్యే కొడుకు?

By:  Tupaki Desk   |   19 March 2022 7:41 AM GMT
కొత్త మలుపు: యాక్సిడెంట్ చేసిన కారులో బోధన్ ఎమ్మెల్యే కొడుకు?
X
రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 45లో జరిగిన యాక్సిడెంట్ లో రెండున్నర నెలల పసికందు మరణించటం చాలామందిని వేదనకు గురి చేసింది. అమితమైన వేగంతో దూసుకెళ్లిన కారు కారణంగా.. రోడ్డు దాటుతున్న యాచకురాలి కుమార్తె దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ దారుణ ప్రమాదానికి కారణమైన కారుకు సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎవరు ఉన్నారు? అన్న దాని మీద వినిపిస్తున్న వాదనలు అన్ని ఇన్ని కావు. ప్రమాదానికి కారణమైంది ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు కావటం.. దాన్ని నడిపిన డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవటం పెద్ద విషయం కాదన్న మాట వినిపిస్తున్నా.. వాస్తవంలో మాత్రం అలాంటి పరిస్థితి లేకపోవటం గమనార్హం. ఈ ప్రమాదానికి సంబంధించి తాజాగా బయటకు వస్తున్న సమాచారం షాకింగ్ గా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారంతో పాటు ఒక ప్రముఖ మీడియా సంస్థ పబ్లిష్ చేసిన వార్త ప్రకారం.. ఈ కారులో బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం షకీల్ కుమారుడి సెల్ ఫోన్ స్విచాఫ్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేస్తున్నారు. మరేం అయ్యిందో కానీ.. తెల్లారేసరికి.. గాయపడి ఆసుపత్రిలో చికిత్స చేసుకుంటున్న వారు పత్తా లేకుండా పోవటం.. వారి ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు ఇప్పుడు కిందా మీదా పడుతున్నట్లు చెబుతున్నారు. ఇక.. ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడ వదిలేసి పారిపోయిన నిందితుల్ని పోలీసులు పట్టుకోవటం తలనొప్పిగా మారిందంటున్నారు.

ప్రమాదం జరిగినప్పుడు కారులో ఒకరు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. తర్వాత మాత్రం కారులో ఇద్దరు ఉన్నారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏకంగా కారులో ఇద్దరు కాదు ముగ్గురు ఉన్నారని.. అందులో గులాబీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ఉన్నట్లుగా వచ్చిన వార్తలు సంచలనంగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే షకీల్ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ప్రమాదానికి కారణమైన కారు తన కజిన్ దని.. బోధన నుంచి నగరానికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఆకారును తాము వాడతామని ఆయన చెబుతున్నారు.

అందుకే ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించారని వివరణ ఇస్తున్నారు. ఎప్పుడో ఒకసారి సిటీకి వచ్చినప్పుడు వాడే కారు అయితే మాత్రం ఎమ్మెల్యే స్టిక్కర్ సదరు వాహనానికి వాడే అవకాశం ఎందుకు ఇస్తున్నారన్నది ప్రశ్న. ప్రమాదం జరిగిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్ని చూసినప్పుడు.. ఈ ప్రమాదానికి కారమైన వారిని పోలీసులు గుర్తించి.. అదుపులోకి తీసుకుంటారా? అన్నది పెద్ద ప్రశ్నగా మరాింది. ఇదిలా ఉంటే.. యాక్సిడెంట్ లో కుమార్తెను పోగొట్టుకొని.. గాయాలపాలైన మహిళకు నష్ట పరిహారం చెల్లించేలా ఒప్పందం జరిగినట్లుగా చెబుతున్నారు. ఇందులో నిజం ఏమిటన్నది బయటకురావాల్సి ఉంది.