Begin typing your search above and press return to search.

పెద్ది రెడ్డి 'అవినీతి చిట్టా' విడుదల చేసిన టీడీపీ

By:  Tupaki Desk   |   12 April 2022 8:30 AM GMT
పెద్ది రెడ్డి అవినీతి చిట్టా విడుదల చేసిన టీడీపీ
X
మంత్రుల అవినీతికి సంబంధించి టీడీపీ వ‌రుస‌గా కొన్ని పోస్ట‌ర్ల‌ను రూపొందించి సోష‌ల్ మీడియా వేదిక‌గా పోరాటం చేస్తుంది. ఇదే సంద‌ర్భంలో వివిధ స్థాయిలలో చోటు చేసుకున్న అక్ర‌మాలు వాటికి సంబంధించిన వివ‌రాలు ఆధారాల‌తో స‌హా వెల్ల‌డి చేస్తోంది. ఇదే ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. మొద‌ట నిన్న‌టిదాకా దేవాదాయ శాఖ మంత్రిగా ప‌నిచేసిన వెల్లంపల్లి శ్రీ‌నివాస్ అక్ర‌మార్జ‌న విలువ 15వంద‌ల కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని తేల్చింది.

ఆ త‌రువాత నిన్న‌టిదాకా ప‌ని చేసిన కార్మిక శాఖ మంత్రి, ప్ర‌స్తుతం కూడా అదే శాఖ నిర్వ‌హ‌ణ ను కొనసాగిస్తున్న గుమ్మ‌నూరు జ‌య‌రాం అక్ర‌మార్జ‌న‌ను కూడా వెలుగులోకి తెచ్చింది. ఆయ‌న అవినీతి సంపాద‌న విలువ ఏడు వంద‌ల కోట్ల‌కుపైగానే ఉంటుంద‌ని తేల్చింది.

ఇదే క్ర‌మంలో నిన్న‌టి దాకా విద్యుత్ శాఖ మంత్రిగా ప‌నిచేసిన బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి అక్ర‌మార్జ‌న విలువ 1734కోట్లు అని వెల్ల‌డించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అదేవిధంగా నిన్న‌టి దాకా విద్యాశాఖ మంత్రిగా ప‌నిచేసిన ప్ర‌స్తుత మున్సిప‌ల్ శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ అక్ర‌మార్జ‌న చిట్టానూ వెలుగులోకి తెచ్చింది. ఆయ‌న సంపాద‌న విలువ 18వంద‌ల 46 కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని లెక్క‌గ‌ట్టింది.

ఇదే సంద‌ర్భంలో..నిన్న‌టి దాకా పంచాయ‌తీ రాజ్ శాఖ‌ను నిర్వ‌హించి తాజాగా పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా విద్యుత్ శాఖ‌ను చేప‌ట్ట‌నున్న మంత్రి పెద్దిరెడ్డి అవినీతి భాగోతంపై టీడీపీ ఓ ఛార్జిషీట్ ను ప‌బ్లిక్ డొమైన్ లో ఉంచింది. దీని ప్ర‌కారం ఆయ‌న ఇప్ప‌టిదాకా అంటే గ‌డిచిన మూడేళ్ల‌లో 6,889 కోట్ల రూపాయ‌ల మేర‌కు అవినీతికి పాల్ప‌డ్డార‌ని ఆరోపించింది.

ఇందులో ప్ర‌ధానంగా మైనింగ్ ద్వారా 1317 కోట్ల రూపాయ‌లు ఆయ‌న ఆర్జ‌న ఉంటుంద‌ని, భూ మాఫియా విలువ 2245 కోట్ల రూపాయ‌లు అని తేల్చింది. మ‌ద్యం మాఫియా విలువ 375 కోట్ల రూపాయ‌లు అని, ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ ద్వారా 1800 కోట్ల రూపాయ‌లు సంపాదించార‌ని తేల్చింది.

ముఖ్యంగా ఆయ‌న‌ను పుంగ‌నూరు వీర‌ప్ప‌న్ అని సంబోధిస్తూ తాను చేస్తున్న ఆరోప‌ణ‌లకు సంబంధించి గ‌ణాంకాల‌తో కూడిన ఓ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. ముఖ్యంగా శివ‌శ‌క్తి డైరీ నుంచి పాల కొనుగోళ్ల రూపంలో ఏడు వంద‌ల కోట్ల రూపాయ‌లు, అదేవిధంగా మామిడి కాయ‌ల కొనుగోళ్ల ద్వారా 190 కోట్ల రూపాయ‌లు ఆయ‌న ఆర్జించార‌ని కూడా ఆ పోస్ట‌ర్ లో ప్ర‌స్ఫుటంగా పేర్కొంది. మ‌రి! దీనిపై పెద్ద‌యాన ఏం అంటారో ?