Begin typing your search above and press return to search.

సోనియాతో టీడీపీ నేత‌ల విందు.. పొలిటిక‌ల్ గుస‌గుస ఇదేనా?

By:  Tupaki Desk   |   4 April 2022 8:37 AM GMT
సోనియాతో టీడీపీ నేత‌ల విందు.. పొలిటిక‌ల్ గుస‌గుస ఇదేనా?
X
కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపాల‌నే వ్యూహంతో ప‌లు ప్రాంతీయ పార్టీలు దూకుడుగా ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్ప‌టి వ‌రకు ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీ ఈ కూట‌ముల‌కు దూరంగా ఉన్న విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీనికి ప్ర‌ధానంగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు వేస్తుండ‌డమే. అయితే.. కేసీఆర్ కాంగ్రెస్‌తో క‌లిసి ముందుకు వెళ్లాల‌ని కోరుకోవ‌డంలేదు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ లేకుండా.. ప్ర‌త్యామ్నాయ కూట‌మి ఏర్పాటు కాద‌ని, నిర్ణ‌యానికి వ‌స్తున్న పార్టీలు మ‌రో దిక్కు త‌మ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.

వీటిలో ఎన్సీపీ.. వంటి కీల‌క‌పార్టీ కూడా ఉంది. అంటే.. బీజేపీని వ్య‌తిరేకిస్తూనే.. కాంగ్రెస్ లేకుండా ముందుకు సాగే ప్ర‌త్యామ్నాయం లేద‌ని దృఢంగా నిర్ణ‌యించుకున్నారు. ఇదే సూత్రం.. టీడీపీ కూడా అనుస‌రించింది. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇదే ఫార్ములాతో టీడీపీ అడుగులు వేసింది. కానీ, అప్ప‌ట్లో కొంత వెన‌క‌బ‌డినా.. ఇప్పుడు టీడీపీ మ‌రోసారి ఈ వ్యూహంతోనే ముందుకు సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలానూ.. బీజేపీ త‌మ‌తో క‌లిసే ప‌రిస్థితి లేద‌ని.. ఇప్ప‌టికే ఒక అంచ‌నా కు వ‌చ్చిన‌.. టీడీపీ.. త‌మ‌కు కలిసి వ‌చ్చే పార్టీతో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకోవ‌డ‌మే.

ఈ క్ర‌మంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తివ్వ‌డం వ‌ల్ల మ‌రోసారి.. కేంద్రంలో చ‌క్రంతిప్పేందుకు టీడీపీకి అనుకూల ప‌రిస్థితి ఏర్ప‌డే ఛాన్స్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో టీడీపీ నేత‌లు.. రాసుకు పూసుకు తిరుగుతున్నారు. ఇటీవ‌ల పార్ల‌మెంటులోనూ.. కాంగ్రెస్ పిలుపున‌కు స్పందించిన టీడీపీ ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్‌.. రాజ్య‌స‌భ‌లో పెట్రోల్ నిర‌స‌న‌ల‌కు.. మ‌ద్ద‌తు తెలిపారు. అప్ప‌ట్లోనే కాంగ్రెస్‌, టీడీపీల వైఖ‌రిపై గుస‌గుస‌లు వినిపించాయి.

ఈ విష‌యం మ‌రిచిపోక‌ముందే.. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో టీడీపీ ఎంపీలు విందు భేటీ కావ‌డం మరింత‌ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కాంగ్రెస్‌తో మ‌ళ్లీ టీడీపీ జ‌త క‌డుతుందా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఢిల్లీలో శ‌నివారం త‌మిళ‌నాడు అధికార పార్టీ డీఎంకే త‌న కార్యాల‌యాన్ని ప్రారంభించింది. దీనికి సోనియా గాంధీ, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ స‌హా టీడీపీ ఎంపీలు గ‌ల్లా జ‌య‌దేవ్‌, రామ్మోహ‌న్ నాయుడు, ర‌వీంద్ర‌కుమార్ హాజ‌రయ్యారు.

చంద్ర‌బాబు కు తెలియ‌కుండా.. టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ ఏమీ చేయ‌ర‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. సో.. ఈ విందుకు హాజ‌రుకావ‌డం అంటే.. చంద్ర‌బాబు సూచ‌న‌ల‌మేర‌కే జ‌రిగి ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. అదేస‌మ‌యంలో కేంద్ర‌లో ప్ర‌త్యామ్నాయ కూట‌మి కోసం.. ఉవ్విళ్లూరుతున్న బీజేపీ వ్య‌తిరేక పార్టీల నేత‌లు అఖిలేష్ యాద‌వ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా, డీపీఐ నేత తొల్‌ తిరుమావళవన్‌, ఎండీఎంకే నేత వైగో త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

పేరుకు పార్టీ కార్యాల‌యం ప్రారంభ‌మ‌నే మాటే గానీ, బీజేపీ ప్ర‌త్యామ్నాయ కూట‌మి స‌మావేశంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా ఈ కూట‌మితో టీడీపీ జ‌త క‌ట్ట‌డంపై ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. గ‌తంలో మోడీకి వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు కాంగ్రెస్‌తో జ‌త క‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి జాతీయ స్థాయిలో యూపీఏ కూట‌మితో టీడీపీ జ‌త క‌డుతుందా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు క‌నుక‌.. ఏదైనా సాధ్య‌మే.. సో.. ఇప్పుడు కాంగ్రెస్ కూట‌మిలో టీడీపీ చేరినా ఆశ్చ‌ర్య పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.