Begin typing your search above and press return to search.

పీకేకు పోటీగా సునీల్: తెలంగాణలో రాజకీయ వేడి

By:  Tupaki Desk   |   2 April 2022 5:07 AM GMT
పీకేకు పోటీగా సునీల్: తెలంగాణలో రాజకీయ వేడి
X
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేందుకు వ్యూహం పన్నుతోంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పరిస్థితి తెలుసుకునేందుకు ప్రశాంత్ కిశోర్ అనే రాజకీయ వ్యూహకర్తతో సర్వే చేయించారు. రెండేళ్ల పాలనలో పార్టీ, ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని గ్రహించిన కేసీఆర్ పీకే వ్యూహకర్త సలహాలతో ముందుకు వెళ్లనున్నారు. అయితే అటు ప్రతిపక్ష పార్టీలు సైతం అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ప్రశాంత్ కిశోర్(పీకే) కు పోటీగా సునీల్ ను రంగంలోకి దించనుంది. ఆయన సలహాలతో పార్టీ వ్యవహరాలు నడిపించనున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి హోంశాఖ మంత్రి అమిత్ షా నేరుగా రంగంలోకి దిగనున్నారు. ఇలా రాష్ట్రంలో మూడు పార్టీలు ఇప్పటి నుంచే ఎవరి వ్యూహాలు వారు పన్నుతుండడంతో రాజకీయ వేడి సంతరిచుకుంది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి నుంచే రాజకీయ వేడి సంతరించుకుంది. 2014 నుంచి అధికారంలో ఉంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహం పన్నుతోంది. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత ఏర్పడింది. ఈ విషయం దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో తెలిసింది. ఇక ప్రభుత్వం నుంచి వైదొలగిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరినా ఆయనను పట్టుబట్టి ప్రజలు గెలిపించడం చూస్తే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైంది. దీంతో పార్టీ అధినేత కేసీఆర్ అప్రమత్తమయ్యారు. ఈ ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికలపై పడకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇప్పటి వరకు పార్టీ నాయకులు, ఇంటెలిజెన్స్ తో సర్వే చేయించిన ఆయన రాజకీయ వ్యూహకర్తల ప్రశాంత్ కిశోర్ ను నియమించుకున్నారు. ఇప్పటికే పీకే టీం రెండు సార్లు రాష్ట్రంలో సర్వే చేసి పలు నివేదికలు అందించింది.

నిరుద్యోగుల్లో అసంతృప్తి, ఉద్యమకారులపై వివక్ష కారణంగానే పార్టీని ఆదరించడం లేదనే విషయాన్ని పీకే టీం కేసీఆర్ ముందు ఉంచింది. దీంతో కేసీఆర్ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. ఇక హుజూరాబాద్ ఎన్నికల్లో దళిత బంధు అనే పథకం తీసుకొచ్చిన ఆయన ఆ పథకం సక్సెస్ కు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ప్రశాంత్ కిశోర్ నివేదిక ప్రకారం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక ధాన్యంకొనుగోలు విషయంలో కేంద్రంపై పోరాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో భాగంగానే కేసీఆర్ ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతున్నారని పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది.

ఇక రాష్ట్రంలో దారుణ పరిస్థితి ఎదుర్కొంటున్న కాంగ్రెస్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తరువాత పార్టీ అభివృద్ధి చెందుతుందని భావించిన కిందిస్థాయి కేడర్ కు నిరాశే ఎదురవుతోంది. పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలను సెట్ చేయడానికే టైం పోతుంది. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ రంగంలోకి దిగనున్నారు. ప్రశాంత్ కిశోర్ కు పోటీగా సునీల్ అనే రాజకీయ వ్యూహ కర్తను రంగంలోకి దించనున్నారు. సునీల్ గతంలో పీకే టీంలో పనిచేశారు. రాజకీయ సర్వే గురించి పూర్తిగా అవగాహన ఉన్న ఆయనను తమ పార్టీ తరుపున పనిచేయాలని రాహుల్ సంప్రదించగా ఆయన ఒకే చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన ఈనెల 4న రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

అధికార టీఆర్ఎస్ కు గట్టి పోటీనిస్తున్న బీజేపీ సైతం సార్వత్రిక ఎన్నికల కోసం పావులు కదుపుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం నాయకులు రాజకీయ వ్యూహకర్తలపై ఆధారపడకుండా నేరుగా వారే రంగంలోకి దిగనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో పాగా వేసేందుకు హోంమత్రి అమిత్ షా కేర్ తీసుకోనున్నారు. త్వరలో తెలంగాణలో కొన్ని రోజుల పాటు పర్యటించి రాష్ట్రానికి ప్రత్యేక నాయకులను నియమించనున్నారు. వారే ఎన్నికల వ్యవహారాలను చూసుకునే అవకాశం ఉంది. అమిత్ షా వేసిన స్కెచ్ లు దాదాపు సక్సెస్ అయ్యాయి. దీంతో దక్షిణాదిన ఉన్న తెలంగాణలోనూ తనదైన ముద్ర వేయాలని ప్లాన్ వేస్తున్నారు.