Begin typing your search above and press return to search.

నిరీక్షణకు ఫలితం.. మంత్రి లాటరీ కొట్టేయనున్న అంబటి

By:  Tupaki Desk   |   10 April 2022 4:23 AM GMT
నిరీక్షణకు ఫలితం.. మంత్రి లాటరీ కొట్టేయనున్న అంబటి
X
పదవులు దక్కనంతనే అధినేత మీద ఆగ్రహం వ్యక్తం చేయటం.. చిర్రుబుర్రులాడటం లాంటివి రాజకీయాల్లో కామన్. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అదృష్టం అంతా ఇంతా కాదు. అద్భుతమైన మెజార్టీతో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన వేళ ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఆయనకు వీర విధేయులు.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్డు మీదకు వచ్చినోళ్లు.. తమ వాక్ చాతుర్యంతో నిత్యం ఏదోలా పార్టీ నానేల చేసిన పలువురు నేతలకు మంత్రి పదవులు దక్కలేదు. అయినప్పటికి తమ బాధను.. ఫస్ట్రేషన్ ను కించిత్ కూడా బయటపడకుండా జాగ్రత్తలు తీసుకొని గుండెల్లోనే దాచుకోవటం కనిపిస్తుంది. విధేయతకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పే వైసీపీ నేతల్లో సీనియర్ నేత అంబటి రాంబాబు ఒకరు.

తనకు మంత్రి పదవి గ్యారెంటీ అని చాలామంది వద్ద ఆయన చెప్పుకున్నా.. జగన్ మాత్రం ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదు. అయినప్పటికీ నిరాశ చెందనట్లుగా కనిపించని ఆయన.. తన వేదనను గుండెల్లోనే పదిలంగా దాచుకున్నారే కానీ.. బయటపెట్టలేదు. అధినేతకు ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ విధేయత.. కమిట్ మెంట్.. విశ్వాసం.. ఇప్పుడు ఆయన్ను మంత్రి కుర్చీలో కూర్చునేలా చేస్తుందని చెబుతున్నారు.

సత్తెన పల్లె ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన.. తాజా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో చోటు లభించటం ఖాయమంటున్నారు. కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లా మొట్టమొదటి మంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోనున్నట్లుగా చెబుతున్నారు. ఎప్పటిలానే అన్ని జిల్లాల మాదిరి పల్నాడు జిల్లా నుంచి కూడా మంత్రి పదవుల్ని ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువే. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీతో పాటు.. కమ్మ సామాజిక వర్గం నుంచి పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. కాపు సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న అంబటికి పదవీ యోగం ఉన్నట్లుగా చెబుతున్నారు. సామాజిక సమీకరణాలు తేడా కొడితే తప్పించి ఆయనే మంత్రి అవుతారని చెబుతున్నారు. అంబటికి తేడా కొడితే తర్వాతి స్థానంలో విడుదల రజనీ ఉంటారంటున్నారు. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు.. నాటి అధికారపక్షాన్ని ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవరించి.. పలు అంశాల్లో పార్టీ స్టాండ్ ఏమిటని చెప్పిన అతి కొద్ది మందిలో అంబటి ఒకరు.

గడిచిన ఆర్నెల్ల కాలంలో ఎమ్మెల్యేల పని తీరు.. వారిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటన్న దాని ఆధారంగా మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే పీకే టీం పూర్తి చేసి.. తన తదుపరి జాబితాను ఎప్పుడో ఇచ్చేసినట్లు చెబుతున్నారు. కాలం అంబటికి కలిసి వచ్చే అవకాశం ఉన్నా.. ఆఖరులో ఏదైనా తేడా కొడితే తప్పించి ఆయనకే మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే.. సుదీర్ఘ నిరీక్షణకు తెర పడి.. మంత్రి కుర్చీలో కూర్చునే యోగం అంబటికి దక్కుతుందని చెప్పక తప్పదు.