Begin typing your search above and press return to search.

కాబోయే మంత్రికి క్వారీ పితలాటకం...?

By:  Tupaki Desk   |   9 April 2022 1:30 PM GMT
కాబోయే మంత్రికి క్వారీ పితలాటకం...?
X
డ్యామ్ ష్యూర్ గా ఆయనే మంత్రి. ఎపుడు విస్తరణ జరిగినా ఆయనకే చాన్స్. ఇది గత రెండేళ్ళుగా వినిపిస్తున్న మాట. సరిగ్గా ముహూర్తం ముంచుకొస్తున్న వేళ ఆయన మీద  అక్రమ క్వారీ పేరుతో ప్రత్యర్ధులు స్వారీ చేస్తున్నారు. ఆయనే అనకాపల్లి జిల్లా కేంద్రంలోని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్.

ఉమ్మడి విశాఖ జిల్లాలో పెద్ద  రాజకీయ కుటుంబానికి చెందిన అమరనాధ్ తండ్రి గురునాధరావు మంత్రిగా చేశారు. ఇక తాత పెందుర్తి నియోజకవర్గం తొలి ఎమ్మెల్యే. ఇలా మూడవతరం వారసుడిగా, బలమైన కాపు సామాజికవర్గం నుంచి వచ్చిన గుడివాడ టీడీపీ సహా ఇతర ప్రత్యర్ధులతో చెడుగుడు ఆడడంతో మేటి. ఘనాపాఠి.

ఆయన అంటే జగన్ బాగా ఇష్టపడతారు అని అంటారు. యువకుడు అయిన గుడివాడకు బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వడానికి వైసీపీ హై కమాండ్ సిద్ధపడుతున్న వేళ సడెన్ గా అనకాపల్లిలోని అక్రమ క్వారీ వ్యవహారం ముందుకు వచ్చింది. దాన్ని సొంత పార్టీలో ప్రత్యర్ధులు ఎగదోస్తున్నరా లేక బయట వారా అన్నది తెలియదు కానీ మొత్తం చూస్తూంటే గుడివాడను రాజకీయంగా బదనాం చేసేందుకే  అని అనుచరులు మదన పడుతున్నారు.

ఆ క్వారీ ఆయనదేనని, తన పలుకుబడిని మొత్తం ఉపయోగించి క్వారీని బలవంతపు ప్రజాభిప్రాయ సేకరణతో గుడివాడ దక్కించుకోవాలని చూస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. మొత్తానికి గుడివాడ మీద ఏ రకమైన ఆరోపణలు లేవు. కానీ ఈ క్వారీ వ్యవహరామే ఆయన రాజకీయ జాతకాన్ని తారు మారు చేస్తుందా అన్న బెంగ అయితే అనుచరుల్లో ఉంది. అయితే సొంత పార్టీలో ఆయనకు మంత్రి పదవి దక్కడం ఇష్టం లేనివారే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు.

హై కమాండ్ కి వారు ఎవరో తెలుసు కాబట్టి తమ నాయకుడు ఈ నెల 11న మంత్రిగా ప్రమాణం చేయడం ఖాయమని కూడా వారు అంటున్నారు. మొత్తానికి గుడివాడను కిందకు  దిగలాగుతున్న వారు గెలుస్తారా. లేక‌ మిష్టర్ గుడివాడ మినిస్టర్ గుడివాడ అవుతారా అన్నది చూడాల్సిందే.