Begin typing your search above and press return to search.

అవును ఆయన కేసీఆర్.. ఆహ్వానాన్ని తుంగలో తొక్కేశారు

By:  Tupaki Desk   |   2 April 2022 3:44 AM GMT
అవును ఆయన కేసీఆర్.. ఆహ్వానాన్ని తుంగలో తొక్కేశారు
X
రుకుడుపడని ఎత్తులతో రాజకీయ ప్రత్యర్థుల్ని చిత్తు చేయటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతే ఎవరైనా. ఇదే విషయాన్ని ఇప్పటికే ఆయన పలుమార్లు నిరూపించారు కూడా. రాజకీయ ఎత్తుగడల విషయంలో సమకాలీన తెలుగు రాజకీయాల్లో ఆయన తర్వాతే ఎవరైనా అన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. దీనికి తోడు కాలం ఆయనకు తోడుగా నిలవటంతో.. ఆయనేం చేసినా.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తిరుగులేని రీతిలో సాగుతుందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి పవర్ ఫుల్ నేతతో పెట్టుకోవటానికి సిద్ధం కావటమే కాదు.. తగ్గేదేలే అన్నట్లుగా ప్రతి సందర్భంలో ఆయన వేస్తున్న ఎత్తులు కేంద్రంలోని మోడీషాలకు సైతం ఒక పట్టాన అర్థం కావటం లేదంటున్నారు. ఈ కారణంగానే.. కేసీఆర్ బలం మీద క్లారిటీ వచ్చే వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సైకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య నడుస్తున్న వార్ గురించి తెలిసిందే. తాను అనుకున్నది అనుకున్నట్లు జరగకుండా.. రూల్ పొజిషన్ పేరుతో తన నిర్ణయాలకు బ్రేకులు వేస్తున్న తమిళసై పై ఆయన గుర్రుగా ఉన్నారు. ఈ కారణంగానే రాజ్ భవన్ కు వెళ్లాల్సిన వేళలో డుమ్మా కొట్టటమే కాదు.. ప్రోటోకాల్ ప్రకారం.. నిబంధనలకు అనుగుణంగా గవర్నర్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాల్లో అసలు గవర్నర్ పాత్రే లేకుండా చేస్తూ సంచలన నిర్ణయాల్ని తీసుకుంటున్నారు.

ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో.. ఆ గ్యాప్ ను పూడ్చేందుకు తానే ప్రయత్నిస్తానని చెప్పటమే కాదు.. అందుకు తగ్గట్లే ఉగాదిని పురస్కరించుకొని రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. ఒకసారి తేడా వస్తే.. దూరం తగ్గటం చాలా కష్టమన్నట్లుగా కేసీఆర్ తన చేతలతో స్పష్టం చేశారు. రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమానికి హాజరు కాని ఆయన.. తన మంత్రివర్గంలోని మంత్రుల్ని సైతం పంపలేదు. ఎందుకిలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

గవర్నర్ ఆహ్వానం పంపినా సరే.. ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లకపోవటం రాజకీయంగా నష్టం వాటిల్లేలా చేస్తుందన్న మాటల్ని కొట్టిపారేస్తున్నారు. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీపై యుద్ధాన్ని ప్రకటించి..తరచూ ఘాటు విమర్శలు చేస్తున్న వేళలో.. గవర్నర్ తో దూరం పెరిగిన వేళలో.. దాన్ని తగ్గించుకోవటం కోసం రాజ్ భవన్ కు వెళితే.. ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారని చెబుతున్నారు. మంచో.. చెడో బీజేపీకి బద్ధ శత్రువుగా.. ప్రధాని మోడీ అంటే అస్సలు పడని వ్యక్తిగా.. తనను హర్ట్ చేసిన వారి విషయంలో తానెంత కఠినంగా ఉంటానన్న విషయాన్ని అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ చాటి చెప్పే కేసీఆర్.. గవర్నర్ ఆహ్వానించినంతనే రాజ్ భవన్ కు వెళ్లటం సరికాదన్న యోచన చేసినట్లుగా చెబుతారు.

కేసీఆర్ మైండ్ సెట్ ప్రకారం చూస్తే.. తేడా వచ్చిన వారిని కలుసుకోవటానికి ఆయన అస్సలు ఇష్టపడరు. అందుకు తగ్గట్లే గవర్నర్ తమిళ సైతో పెరిగిన దూరాన్ని తగ్గించుకోవటానికి వచ్చిన ఉగాది ఆహ్వానాన్ని ఆయన వదులుకున్నట్లు చెబుతున్నారు. మొండితనం.. పట్టుదల.. తాను అనుకున్నది అనుకున్నట్లు చేయటానికి అసలేమాత్రం వెనక్కి తగ్గని అధినేతగా పేరున్న కేసీఆర్.. రాజ్ భవన్ కు వెళితే ఆ ఇమేజ్ పోగొట్టుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

మోడీపై సమరాన్ని షురూ చేసిన నేపథ్యంలో.. గవర్నర్ రాజీ కోసం ఆహ్వానాన్ని పంపితే.. అందులో భాగంగా రాజ్ భవన్ కు వెళ్లటం గులాబీ బాస్ కు నష్టం వాటిల్లేలా చేస్తుందన్న వాదనను నమ్మిన కేసీఆర్.. వేడుకకు హాజరు కాలేదంటున్నారు. మరి.. ఆయన తీసుకున్న నిర్ణయంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది మాత్రం కాలమే సరైన తీర్పు ఇవ్వగలదు.