Begin typing your search above and press return to search.

జగన్ ను కలిసిన చిత్తూరు జిల్లా నేత కొడుకు జగన్ ను అలా అడిగేశారా?

By:  Tupaki Desk   |   10 April 2022 4:18 AM GMT
జగన్ ను కలిసిన చిత్తూరు జిల్లా నేత కొడుకు జగన్ ను అలా అడిగేశారా?
X
తాము కోరుకున్నది దక్కకుంటే చిన్న పిల్లాడు సైతం మారం చేస్తాడు. అలాంటిది కొమ్ములు తిరిగిన రాజకీయ నేతలు.. తాము అనుకున్నది అనుకున్నట్లు జరగాలని పట్టుదలతో ఉండే వారి పరిస్థితి ఇంకెలా ఉంటుంది. అందులోనూ ఇంతకాలం తమకు ఆభరణంగా మారి.. మిగిలిన వారికి భిన్నమైన అధికార దర్పంతో వెలిగిపోయిన నేతలు.. ఈరోజున సీఎం జగన్ కారణంగా తమ పదవులకు రాజీనామా చేయాల్సి రావటం తెలిసిందే.

ఈ అంశాన్ని సదరు నేతలు తీసుకునే దానికి.. వారి కుటుంబ సభ్యుల మైండ్ సెట్ కు కాస్త తేడా ఉంటుందని చెప్పాలి. ఇక.. తండ్రి చేతిలో ఉన్న అధికారం చేజారిపోయే వేళలో.. నేతల పుత్రరత్నాలు చూస్తూ ఊరుకోరు కదా? తాజాగా సీఎం జగన్ తీసుకున్న మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నిర్ణయంపై నేతలు పలువురు లోలోన నలిగిపోతున్నారు. ఇక.. వారి పుత్రరత్నాలు అయితే రగిలిపోతున్నారని చెబుతున్నారు.

అలా అని.. అత్యంత శక్తివంతుడైన జగన్ తో పెట్టుకునే ధైర్యం.. సత్తా వారికి లేదు. ఆ మాటకు వస్తే మనసులోని వేదనను సైతం పంచుకోలేని పరిస్థితి. ఇలాంటి వేళ.. ఒక సీనియర్ నేత కొడుకు జగన్ ను కలిసి ఆయనతోమాట్లాడినట్లుగా చెబుతున్న మాటలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మామూలుగా మంత్రులకే జగన్ దర్శనం దక్కటం కష్టమని చెబుతారు. అలాంటిది నేతల కొడుకులకు అపాయింట్ మెంట్ ఇవ్వటం చాలా అరుదు. అలాంటిది తనను కలిసేందుకు ఒక సీనియర్ నేత కొడుక్కి టైం ఇచ్చారంటే.. సదరు నేత ఎంత కీలకమన్నది ఇట్టే అర్థమవుతుంది.

సీఎం జగన్ ను కలిసిన సదరు నేత కొడుకు.. తన మనసులోని మాటను ఎలాంటి మొహమాటం లేకుండా సీఎం జగన్ కు చెప్పేశారంటున్నారు. మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలనుకుంటే అందరిని కొత్త వారితో నింపేయండి. లేదంటే పాత వారిలో కీలక నేతల్ని కొనసాగించండి. అంతేకాదు.. నలుగురిని ఉంచుతాం.. నలుగురిని తీస్తామంటూ కుదరదు.

ఇలా అయితే రాజకీయాలు చేయలేమని సూటిగా చెప్పేసినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు ఇలాంటి సీన్ సీఎం జగన్ కు ఎదురు కాలేదని చెబుతున్నారు. తనకు ఎదురైన ఈ అనుభవం జగన్ ను ఆలోచనల్లో పడేసినట్లు చెబుతున్నారు. తొలగింపుపై మంత్రులు.. వారి కుటుంబాల్లో ఈ అంశం ఎంతలా నలుగుతుందన్నది తాజా ఉదంతంతో స్పష్టమైందంటున్నారు. మరి.. ఇందులో నిజం ఎంతన్న ప్రశ్నకు సమాధానం రానున్న రోజుల్లో బయటకు వచ్చే వీలుందని మాత్రం చెప్పక తప్పదు.