Begin typing your search above and press return to search.

చండీగఢ్ పై మొదలైన కొత్త వివాదం

By:  Tupaki Desk   |   2 April 2022 9:12 AM GMT
చండీగఢ్ పై మొదలైన కొత్త వివాదం
X
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం-పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వానికి మధ్య వివాదం మొదలైంది. ఈమధ్యనే జరిగిన పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) క్లీన్ గా ఊడ్చేసిన విషయం తెలిసిందే. 117 అసెంబ్లీల్లో ఆప్ కు 92 సీట్లొచ్చాయి. ఆప్ ఇంతటి ఘన విజయం సాధించటాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ తట్టుకోలేకపోతున్నది. అందుకనే పంజాబ్-హర్యానా ఉమ్మడి రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ విషయంలో వేలు పెట్టడం మొదలుపెట్టింది.

చండీగఢ్ పాలనా విషయాల్లో కేంద్రం తలదూర్చటం మొదలుపెట్టింది. ఢిల్లోలో కూడా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఇబ్బంది పెట్టడానికి మోడీ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఏదో రూపంలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని గబ్బుపట్టించటమే టార్గెట్ గా కేంద్రం పావులు కదుపుతునే ఉంది. ఇదే పద్ధతిలో ఇపుడు పంజాబ్ లో గెలిచిన ఆప్ పై తన అక్కసును చూపుతోంది. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతమన్న ఏకైక కారణంతో పంజాబ్ విషయంలో జోక్యం చేసుకుంటోంది.

ఈ విషయాలన్నింటినీ గమనించిన తర్వాతే తాజాగా పంజాబ్ అసెంబ్లీ చండీగఢ్ ని పూర్తిగా తమ రాష్ట్రానికే బదిలీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఉమ్మడి రాజధానిగా, కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న చండీగఢ్ ను పంజాబ్ కు మాత్రమే రాజధానిగా చేయాలంటు కేంద్రాన్ని పంజాబ్ అసెంబ్లీ డిమాండ్ చేయటంతో కొత్త వివాదం మొదలైంది. హర్యానాలో బీజేపీ ప్రభుత్వమే ఉన్న కారణంగా కేంద్రం యధేచ్చగా తనిష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటోంది.

దీన్ని గమనించిన తర్వాతే ఉమ్మడి రాజధానిగా చండీగఢ్ ను కంటిన్యూ చేయటం వల్ల ఎదురయ్యే సమస్యలు పంజాబ్ అసెంబ్లీ ప్రస్తావించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బీజేపీ మినహా కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ ఎంఎల్ఏలు కూడా మద్దతు పలికారు. మొత్తానికి పంజాబ్-హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్ పై ఆప్ ప్రభుత్వం లేవనెత్తిన కొత్త వివాదం భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాల్సిందే.