Begin typing your search above and press return to search.

ధాన్యంపై దగుల్బాజీ రాజ‌కీయం .. ర‌ఘునంద‌న‌రావు ఫైర్‌

By:  Tupaki Desk   |   11 April 2022 10:31 AM GMT
ధాన్యంపై దగుల్బాజీ రాజ‌కీయం .. ర‌ఘునంద‌న‌రావు ఫైర్‌
X
టీఆర్ ఎస్ మాజీ నాయ‌కుడు.. ప్ర‌స్తుతం బీజేపీ ఎమ్మెల్యే.. రాజ‌కీయ ఫైర్‌బ్రాండ్ ర‌ఘునంద‌న‌రావు.. తాజాగా త‌న మ‌న‌సులో మాట‌ను వెల్ల‌డించారు. ఓ మీడియాసంస్థ‌తో ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం ధాన్యం పై జ‌రుగుతున్న ర‌గ‌డ అంతా కూడా.. ద‌గుల్బాజీ రాజ‌కీయంగా అభివ‌ర్ణించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చి తీరుతుంద‌ని తెలిపారు. దుబ్బాక ఎమ్మెల్యే అయిన ర‌ఘునంద‌న‌రావు.. తెలంగాణ‌ ఉద్యమంలో క్రియాశీల పాత్ర‌పోషించారు. ఒకప్పుడు కేసీఆర్‌ సహా ఆయన కుటుంబంలోని వ్యక్తులతో అత్యంత సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్న నేత‌గా గుర్తింపు పొందారు.

అయితే.. టీఆర్ ఎస్‌ పార్టీ నుంచి బయటికి వచ్చి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించారు. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం మధ్య రాజకీయాలు వేడెక్కిన నేప‌థ్యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. తెలంగాణ‌లో అధికారంలోకి రావాలనే దిశగా పని చేస్తున్నామ‌ని తెలిపారు. 2014లో బీజేపీలో చేరిన ఆయ‌న కరీంనగర్‌ జిల్లాకు చెందిన త‌న నలుగురు మేనమామలు సంఘ్‌ నేపథ్యం ఉన్నవారేన‌ని తెలిపారు.

టీఆర్ ఎస్‌లో ఒక‌రిద్ద‌రు చెప్పిన మాట‌ల కార‌ణంగా.. కేసీఆర్ కు త‌న‌కు మ‌ధ్య పొలిటిక‌ల్ గ్యాప్ పెరిగింద‌ని ర‌ఘునంద‌న‌రావు చెప్పారు. ట్రేడ్‌ యూనియన్‌లో చురుకుగా ఉండటంతో జిల్లాలోని కొంత మంది పెద్దలకు ఇబ్బదయిందని వెల్ల‌డించారు.ఈ క్ర‌మంలో త‌న‌ను టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేయడం తప్పుడు నిర్ణయమ‌ని తెలిపారు. అయితే.. కేసీఆర్‌కు త‌న‌ వల్ల ముప్పు లేద‌ని చెప్పారు. 2015-16లో త‌న‌కు మ‌ళ్లీ టీఆర్ ఎస్ నుంచి ఆఫర్స్‌ వచ్చాయని, కానీ తిర‌స్క‌రించిన‌ట్టు చెప్పారు. గెలిచినా, ఓడినా బీజేపీలోనే ఉంటాన‌న్నారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాన‌ని చెప్పారు.

``సిద్దిపేటకు ఒక రింగ్‌ రోడ్‌ ఉంది. రెండోది వేసుకుంటున్నారు. ఏమీలేని దుబ్బాకకు ఒక రింగ్‌ రోడ్‌ ఇవ్వాలని నాలుగుసార్లు దరఖాస్తు ఇచ్చా. ఇదే నాకూ, మంత్రి హరీశ్‌కూ కొట్లాట. మా ఇద్దరికీ గెట్టు పంచాయితీ అయితే ఉంది.`` అని ర‌ఘునంద‌న‌రావు చెప్పారు. చట్టం ముందు ఎవరైనా సమానులే అని, కేసీఆర్ అయినా.. తానైనా తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించక తప్పదన్నారు.

కాంగ్రెస్ రాజ‌కీయాల‌పై మాట్లాడుతూ.. ప్రజల దృష్టిలోబీజేపీ మాత్ర‌మే ఉంద‌ని.. కాంగ్రెస్ లేద‌న్నారు. ఢిల్లీలో అధికారంలో బీజేపీ ఉంద‌ని.. బ‌ల‌మైన మోడీ నాయకత్వం ఉంద‌ని చెప్పారు. కేసీఆర్‌కు వయసైపోయిందన్న ఆయ‌న వారు తీసుకునే నిర్ణయాలు తప్పని వారే అంగీకరించి పీకేలను తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారి సామర్థ్యంపై వారికి విశ్వాసం ఉంటే.. పీకే ఎందుకని ప్ర‌శ్నించారు. ధాన్యం కొనుగోలు అనేది.. రాజకీయ పంచాయితీ అని తెలిపారు. దేశంలో ఎక్కడా ఇలా లేదన్నారు.

``బెంగాల్‌లో మూడోసారి అధికారంలోకి రావడానికి దీదీ అనుసరించిన వ్యూహం ఏమిటంటే.. ‘‘నువ్వే ప్రతిపక్షంలా కేంద్రంపై యుద్ధం ప్రకటించు. వాళ్లు జై శ్రీరాం అంటే.. నువ్‌ జై దుర్గ అను’’ ఇది పీకే ఇచ్చిన సలహా. అదే సూచనను ఆయన ఇప్పుడు కేసీఆర్‌కు ఇచ్చారు. వర్షాకాలం క్వింటా ధాన్యం మిల్లుకు పంపితే 65 కిలోల బియ్యం వస్తాయి. ఎండాకాలంలో 50 కిలోల బియ్యం, 15 కిలోల నూకలు వస్తాయి. మార్కెట్‌లో కిలో బియ్యం రూ.30. మిల్లర్లు నూకలను కిలో రూ.15 చొప్పున వివిధ చోట్ల అమ్ముకుంటారు. ఇక్కడ 15 కిలోల నూకలకు రూ.15 చొప్పున క్వింటాకు రూ.225 రైస్‌ మిల్లర్‌ నష్టపోతున్నాడు. పొరుగు రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే క్వింటాకు రూ.225 రైతులకు ఇస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ సీఎం రూ.500, మధ్యప్రదేశ్‌లో కూడా ఈ డబ్బులను రైతులకు ఇస్తున్నారు. తెలంగాణ సర్కారు ఇస్తే తప్పేంటి.`` అని ర‌ఘునంద‌న‌రావు ప్ర‌శ్నించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్‌లో ఎక్క‌డ నుంచి పోటీ చేసినా గెలుస్తాన‌ని ర‌ఘునంద‌న‌రావు ధీమా వ్య‌క్తం చేశౄరు. దుబ్బాకలో తాను గెలిచింది హరీశ్‌ మీదనే కదా? అని ప్ర‌శ్నించారు. సిద్దిపేటలో ఆయనపై పోటీ చేయడానికి తాను సిద్ధ‌మ‌న్నారు. అవసరమైతే హరీశ్‌నే దుబ్బాకలో పోటీకి ఆహ్వానిస్తాన‌ని చెప్పారు.