Begin typing your search above and press return to search.

కూతురు పుట్టాక పెళ్లి చేసుకుంటున్న మ‌హిళా ప్ర‌ధాని!

By:  Tupaki Desk   |   3 May 2019 2:57 PM IST
కూతురు పుట్టాక పెళ్లి చేసుకుంటున్న మ‌హిళా ప్ర‌ధాని!
X
న్యూజిలాండ్ ప్ర‌ధాని జెసిండా ఆర్డ‌ర్న్ గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చ‌ర్యానికి గురి కావాల్సిందే. ఆమె రాజ‌కీయాల్లోకి రావ‌టం.. ఆ త‌ర్వాత ఒక వ్య‌క్తితో లివింగ్ రిలేష‌న్ షిప్.. దాంతో ఒక పాప‌కు జ‌న్మ‌నివ్వ‌టం.. తాజాగా పెళ్లి చేసుకోవ‌టం లాంటి అంశాలు సినిమాటిక్ గా ఉంటాయి. ఇక‌.. వారి ల‌వ్ ట్రాక్ కూడా బాలీవుడ్ మూవీకి స‌రిపోయేలా ఉంటుంది మ‌రి.

వ్య‌క్తిగ‌త జీవితం ఎంత ఆస‌క్తిక‌రంగా ఉంటుందో.. దేశ ప్ర‌ధానిగా ఆమె పాల‌న మీదా మంచిపేరే ఉంది. విప‌త్క‌ర స‌మ‌యాల్లో ఆమె వ్య‌వ‌హ‌రించిన వైఖ‌రి పలువురు ప్ర‌శంస‌లు అందుకుంది. మార్చి 15న న్యూజిలాండ్ లోని రెండు మ‌సీదుల‌పై శ్వేత‌జాతీయులు కాల్పులు జ‌రిపిన‌ప్పుడు.. ఆమె స్పందించిన తీరు ప‌లువురు ప్ర‌శంస‌ల్ని అందుకుంది. అంతేకాదు.. ఆ విప‌త్క‌ర స‌మ‌యంలో దేశంలోని ముస్లింల ప‌క్షాన నిలిచిన వైనానికి కృతజ్ఞతగా యూఏఈ స‌ర్కారు ఆమె ఫోటోను బుర్జ్ ఖ‌లీఫాపై ప్ర‌ద‌ర్శించి గౌర‌వించిన వైనం ప్ర‌పంచ వ్యాప్తంగా ఆమెను స‌రికొత్త గుర్తింపును తెచ్చి పెట్టింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె వివాహం త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న‌ట్లు ఆమె కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇంత‌కాలం తాను లివింగ్ రిలేష‌న్ షిఫ్ లో ఉన్న స‌హ‌చ‌రుడు క్లార్క్ గేఫోర్డ్ తో ఆమె వివాహ‌మాడ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. అయితే.. పెళ్లి డేట్ ను మాత్రం వెల్ల‌డించ‌లేదు.
కొంత‌కాలంగా క‌లిసి ఉంటున్న వారికి పండంటి పాప పుట్ట‌టం తెలిసిందే. ఈస్ట‌ర్ ఆదివారం ప్ర‌ధాని.. క్లార్క్ ల ఎంగేజ్ మెంట్ జ‌రిగిన‌ట్లుగా ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉంటే.. జెసిండాకు క్లార్క్ ప‌రిచ‌యం సినిమాటిక్ గా జ‌రిగింద‌ని చెబుతారు. న్యూజిలాండ్ లో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టంలో మార్పులు తీసుకువ‌స్తుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో.. ఆ విష‌యం మీద కంప్లైంట్ చేసే స‌మ‌యంలో అక్క‌డ క్లార్క్ జెసిండాను క‌లుసుకున్నారు.

త‌ర్వాత వారి ప‌రిచ‌యం పెర‌గ‌టం.. వారిద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ స్టార్ట్ అయ్యింది. గ‌త ఏడాది జూలైలో ఆమె ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చారు. దేశాధినేత హోదాలో ఉండి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన రెండో మ‌హిళ‌గా జెసిండా రికార్డుల్లోకి ఎక్కారు. ఇదిలా ఉంటే.. త‌న పార్ట‌న‌ర్ దేశాధినేత కావ‌టంతో.. క్లార్క్ త‌న ఉద్యోగానికి సెల‌వు పెట్టి పాప బాధ్య‌త‌ల్ని నిర్వ‌హిస్తున్నారు. భ‌లే ఉంది కదూ వీరి స్టోరీ.