Begin typing your search above and press return to search.

అమెరికా చేసినట్లే న్యూజిలాండూ చేసింది

By:  Tupaki Desk   |   9 July 2016 6:47 AM GMT
అమెరికా చేసినట్లే న్యూజిలాండూ చేసింది
X
కొద్ది నెలల కిందట భారత విద్యార్థుల వీసాలను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరస్కరించిన ఉదంతం తెలిసిందే. అప్పట్లో వివాదాస్పదమైన ఆ విషయంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. చదువుకోవడానికి అని చెప్పి అమెరికా వెళ్తున్న విద్యార్థుల్లో చాలామంది అందుకోసం వెళ్లడం లేదని.. అసలు వారు వెళ్తున్న కాలేజిలో ఫీజెంతో కూడా వారికి తెలియదని.. వారే కోర్సులో చేరుతున్నారో కూడా చెప్పలేకపోతున్నారని.. అలాంటప్పుడు వారు చదువుకోవడానికి వెళ్తున్నారని ఎలా నమ్ముతామని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రశ్నించారు. అంతేకాదు.. సరైన ఆర్థిక ఏర్పాట్లు లేకుండా వెళ్తున్నవారంతా చదువుల పేరుతో మాయ చేస్తున్నారంటూ వీసాలను తిరస్కరించారు. తాజాగా న్యూజిలాండ్ నుంచి కూడా అలాంటి తిరస్కరణే ఎదురైంది. వేలాది భారతీయ విద్యార్థుల వీసాలను న్యూజిలాండ్ తిరస్కరించింది. వీసాకు దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యధికులు చదువుల కోసం రావడంలేదని ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు.

న్యూజిలాండ్ అధికారిక సమాచార చట్టం ప్రకారం 2015 డిసెంబర్- 2016 మే మధ్య ఆ దేశంలోని సగానికిపైగా పాలిటెక్నిక్ కళాశాల్లో వీసా తిరస్కరణ శాతం 30 శాతానికిపైగా ఉంది. సగానికిపైగా విద్యాసంస్థలు వీసాల్ని తిరస్కరిస్తున్నాయి. అందులో ఎక్కువగా భారతీయుల వీసాలే ఉంటున్నాయట. ఇటీవల భారత విద్యార్థులకు సంబంధించి 3,864 వీసాలు తిరస్కరణకు గురికాగా 3,176 వీసాలకు అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు ఓకే చెప్పారు.

కాగా వీసా తిరస్కరణకు గల కారణాల విషయంలో అమెరికా అధికారులు - న్యూజిలాండ్ అధికారులు ఒకేలాంటి అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. వీసా దరఖాస్తుదారుల్లో అత్యధికులు చదువుల కోసం వస్తున్నారనే నమ్మకంలేదని, వారి పోషణకు సరిపడా ఆర్థిక వనరులు లేవని న్యూజిలాండ్ అధికారులు చెబుతున్నారు. తిరస్కరణకు గురైన వీసాల్లో అత్యధికం తప్పుడు పత్రాలని చెప్పలేమని, అయితే ఇమ్మిగ్రేషన్ నియమనిబంధనలకు తగినవిధంగా సమాచారం వాటిల్లో ఉండడంలేదని ఆక్లాండ్ ఇంటర్నేషన్ ఎడ్యుకేషన్ గ్రూపు చెబుతోంది. సో... వీసా కోసం విదేశీ విద్య పేరుతో భారతీయ విద్యార్థులు తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారని ప్రపంచ దేశాల్లో ముద్ర పడుతోంది.