Begin typing your search above and press return to search.

పెళ్లికి రండి.. భోజనాలు లేవు.. తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం చేతికి ఇస్తున్నారు

By:  Tupaki Desk   |   1 Jun 2020 6:15 AM GMT
పెళ్లికి రండి.. భోజనాలు లేవు.. తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం చేతికి ఇస్తున్నారు
X
కాలానికి తగ్గట్లు అలవాట్లు మారిపోతుంటాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న మాయదారి రోగం పుణ్యమా అని ఇప్పటివరకూ లేని మాస్కుల అలవాటు వచ్చేసింది. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడితే చాలు.. మూతికి అడ్డంగా మాస్కు పెట్టుకొని బయటకు రావాల్సిందే. అంతేనా.. ఇంతకాలం సెల్ ఫోన్.. పర్సు స్థానంలో ఇప్పుడో చిన్న శానిటైజర్ ను పెట్టుకోవటం అలవాటుగా మారింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటివరకూ అనుసరించిన విధానాల్ని మార్చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్రిష్ణా జిల్లా కొండపల్లి పట్టణంలో చోటు చేసుకున్న తాజా ఉదంతం ఆసక్తికరంగా మారింది. స్థానిక ఇందిరమ్మ కాలనీలో ఉండే షేక్ కాలేషా తన కుమార్తెను విజయవాడకు చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. వాస్తవానికి వీరి పెళ్లి మార్చిలో జరగాల్సి ఉంది.

లాక్ డౌన్ నేపథ్యంలో పెళ్లిని వాయిదా వేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించటంతో ఇప్పటికి ఉన్న రూల్స్ ప్రకారం పెళ్లి చేద్దామని డిసైడ్ చేశారు. ఈ విషయంలో ఇరు వర్గాల వారు ఒప్పుకోవటంతో తాజాగా వారి వివాహం జరిగింది. ఈ పెళ్లిలో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. పెళ్లికి వచ్చిన అతిధులకు భోజనాలు ఏర్పాటు చేయకుండా.. వారందరి చేతికి భోజనాల్ని డబ్బాల్లో పార్సిళ్లు చేసి చేతికి అందించారు. ఈ కొత్త ట్రెండ్ పలువురిని ఆకర్షించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి.. ఇతర శుభకార్యాలకు వచ్చే అతిధులకు భోజనాలు పెట్టకుండా.. వారి చేతికి పార్సిల్స్ ఇచ్చే కొత్త సంప్రదాయం షురూ అవుతుందని చెప్పక తప్పదు.