Begin typing your search above and press return to search.

బయటపడిన ప్రాణాంతక వైరస్

By:  Tupaki Desk   |   9 July 2022 7:34 AM GMT
బయటపడిన ప్రాణాంతక వైరస్
X
ప్రపంచాన్ని ప్రాణాంతక వైరస్ లు వదిలిపెట్టేట్లు లేవు. ఒకవైపు కరోనా, ఎబోలా, ఒమిక్రాన్ లాంటి వైరస్ లను ఎదుర్కోవటానికే ప్రపంచం తల్లకిందులైపోతోంది. కరోనా, ఎబోలా వల్ల ఇప్పటికే కొన్ని లక్షలమంది చనిపోయారు. ఈ వైరస్ ల నుండి ఎలా బయటపడాలో అర్ధం కాక నానా అవస్థలు పడుతుంటే కొత్తగా దక్షిణాఫ్రికాలో మార్బర్గ్ అనే వైరస్ కొత్తగా బయటపడింది.

తాజాగా బయటపడిన మార్బర్గ్ వైరస్ చాలా ప్రాణాంతకమని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని ఘనాలో ఈ డెడ్లీ వైరస్ బయటపడింది. గడచిన రెండు వారాల్లో ఈ వైరస్ సోకిన ఇద్దరు పేషంట్లు కూడా మరణించారు. ఈ ఇద్దరు బాధితులతో సన్నిహితులుగా మెలిగిన 34 మందిని గుర్తించారు. వాళ్ళందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించి ఆరోగ్య పరిస్ధితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.

చనిపోయిన, సన్నిహితులుగా మెలిగిన వాళ్ళ ప్రాంతాల్లో ఈ వైరస్ ఎక్కువగా ప్రబలే ప్రమాదముందని వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతాలన్నింటినీ శానిటైజ్ చేస్తున్నారు.

ముందుజాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లోని కొందరు వైద్య నిపుణులను అర్జంటుగా ఘనాకు పంపుతున్నట్లు ప్రపంచ ఆరోగ్యం సంస్థ ప్రకటించింది. ఆసుపత్రిలో చనిపోయిన ఇద్దరు బాధితుల్లో డయేరియా, జ్వరం, వికారం, వాంతుల వంటి లక్షణాలను డాక్టర్లు గుర్తించారు.

మార్బర్గ్ గబ్బిలాల నుండి మనుషులకు సోకుతుందని పరిశోధనల్లో తేలింది. గబ్బిలాల నుండి మనుషులకు సోకిన తర్వాత మనుషుల నుండి మనుషులకు ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుందట. వైరస్ సోకిన 21 రోజుల్లో ఇది బయటపడుతుంది.

జ్వరం, తలనొప్పి, వాంతుల్లలాంటి లక్షణాలతో పాటు 7 రోజుల్లో రక్తస్రావం కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వైరస్ సోకినవారిలో మరణాల రేటు కూడా 88 శాతం ఉంటుందన్నారు. మరణాల రేటు 88 శాతమంటే చాలా ఎక్కువనే చెప్పాలి. మొత్తానికి ఏదో ఒక వైరస్ ప్రపంచాన్ని వణికించేస్తోంది.