Begin typing your search above and press return to search.

వివేకా హత్య: నలుగురికి నార్కో అనాలసిస్

By:  Tupaki Desk   |   31 July 2019 6:50 AM GMT
వివేకా హత్య: నలుగురికి నార్కో అనాలసిస్
X
ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ ప్రతిపక్షంలో ఉండగా.. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో వైఎస్ వివేకా హత్య జరిగింది. పులివెందులలోని వివేకా సొంత ఇంట్లోనే అతి దారుణంగా, కిరాతకంగా నరికిచంపారు. అయితే ఇప్పటికీ వివేకాను చంపిన వారిని కనిపెట్టలేకపోయారు.

జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా వివేకానంద ముఖ్య అనుచరుడు గంగిరెడ్డి, వాచ్ మెన్ రంగయ్య, కిరాయి హంతకుడు శేఖర్ రెడ్డితోపాటు కనిపించకుండా పోయి అరెస్ట్ అయిన వివేక ముఖ్య అనుచరుడు పరమేశ్వరరెడ్డిని సిట్ అనుమానిస్తోంది. వీరిని విచారించిన పెద్దగా క్లూలు రాబట్టలేకపోయింది.

వివేకానంద హత్య తర్వాత వెంటనే పరమేశ్వరరెడ్డి మాయమయ్యారు. అదే రోజు రాత్రి ఆస్పత్రిలో గుండెపోటుతో చేరారు. వివేకానందకు ముఖ్య అనుచరుడైన పరమేశ్వరరెడ్డి వ్యవహారశైలిపై పోలీసులకు అనుమానం వచ్చి విచారించినా అతడు నోరు మెదపలేదు. ఇక మిగతా ముగ్గురు కూడా ఏం చెప్పలేదు. ఈ నేపథ్యంలో సిట్ బృందం కోర్టులో వీరికి నార్కో అనాలసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలకు అనుమతి కోరింది.

తాజాగా సిట్ కోరికను మన్నించిన పులివెందుల సివిల్ కోర్టు నార్కో పరీక్షలు చేయడానికి అనుమతిని ఇచ్చింది. గుజరాత్ లో మాత్రమే ఈ నార్కో టెస్ట్ లకు సాంకేతిక పరికరాలు ఉండడంతో వీరిని ఆ రాష్ట్రానికి తరలించారు. అక్కడ రిపోర్ట్ ను బట్టి వివేకా హత్య కేసు మిస్టరీ వీడే అవకాశం కనిపిస్తోంది.