Begin typing your search above and press return to search.

మాయ చేసి.. మచ్చిక చేసుకుని.. రూ. 13కోట్లు నొక్కేసిన దంపతులు

By:  Tupaki Desk   |   22 Aug 2020 11:00 AM IST
మాయ చేసి.. మచ్చిక చేసుకుని.. రూ. 13కోట్లు నొక్కేసిన దంపతులు
X
వాళ్లు మామూలు దంపతులు కాదు.. కాస్త డబ్బునోళ్లు కనిపిస్తే ఆప్యాయంగా పలకరిస్తారు. కమ్మని విందులిస్తారు. పబ్ లంటూ.. పార్టీ లంటూ భలే తిప్పేస్తారు. ఆ తర్వాత మాకు వడ్డీకి డబ్బులిస్తే పర్సన్ టేజీ ఎక్కువ ఇస్తామంటూ చెబుతారు. నమ్మి ఇస్తే మాత్రం ఇక చుక్కలు చూపిస్తారు. ప్రజలను మోసగించి రూ. 13కోట్లు వసూలు చేసిన దంపతులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన దంపతులు పద్మజ, వెంకట సుబ్రహ్మణ్య వర ప్రసాద్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్ లో స్థిర పడ్డారు. వీరు స్వధాత్రీ ఇన్ ఫ్రా సంస్థలో పని చేశారు. ఆ సంస్థ రూ.156కోట్ల స్కామ్ చేయడంతో పోలీసులు కేసులు పెట్టారు.అయితే ఈ తతంగానికి ముందే పద్మజ, వర ప్రసాద్ ఉద్యోగం మానేసి శ్రీనగర్ కాలనీలో రణధీర ఫైనాన్సియల్ సర్వీసెస్ అనే సంస్థ ప్రారంభించారు.

డబ్బు ఉన్నోళ్ళతో స్నేహంగా మెలగడం, వారి ద్వారా పరిచయం అయిన వారికి దగ్గరయ్యేవారు. వాళ్ళతో సన్నిహితంగా మెలిగి పార్టీల విపరీతంగా ఖర్చు పెట్టేవారు. ఆ తర్వాత తమ సంస్థలో పెట్టుబడి పెడితే 5 నుంచి పది శాతం వడ్డీ అధికంగా ఇస్తామంటూ వసూళ్లకు దిగుతారు.ఒకటి రెండు నెలలు వడ్డీ బాగా చెల్లిస్తారు. ఆ తర్వాత డబ్బు లివ్వకుండా మోసగిస్తారు. ఇలా మోసపోయిన బాధితుల్లో ఒకరైన సోమాజిగూడకు చెందిన విజయలక్ష్మి ఫిర్యాదుతో సీసీఎస్ లో కేసు నమోదైంది. ఇన్ స్పెక్టర్ సూర్య ప్రకాష్ దర్యాప్తు చేసి ఏడాదిలో ఆ దంపతులు రూ.13 కోట్లు మోసగించారని నిర్ధారించారు. వారిని అరెస్టు చేశారు.