Begin typing your search above and press return to search.

ట్విస్ట్ ఇచ్చిన వివేక్..

By:  Tupaki Desk   |   29 July 2019 4:46 AM GMT
ట్విస్ట్ ఇచ్చిన వివేక్..
X
టీఆర్ ఎస్ మాజీ ఎంపీ, బడా పారిశ్రామికవేత్త అయిన జి. వివేక్ ఎపిసోడ్ లో ట్విస్ట్ నెలకొంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు టీఆర్ ఎస్ టికెట్ నిరాకరించడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి గులాబీ పార్టీపైనే పోరుకు రెడీ అయ్యారు. కేసీఆర్ చేపట్టిన ఎర్రమంజిల్, సచివాలయ కూల్చివేతలను ప్రజాసంఘాలతో కలిసి అడ్డుకునే ప్రయత్నం చేశారు.

టీఆర్ ఎస్ పై ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న వివేక్.. ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి కేసీఆర్ కొత్త భవనాల నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నాలను జోరుగా చేస్తున్నారు. అంతేకాదు.. వివేక్ బీజేపీలో చేరబోతున్నట్టు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ వినతిపత్రం ఇచ్చి వచ్చిన వివేక్ ఆషాఢం తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నట్టు ప్రకటించారు.

అయితే ఇప్పుడు సడన్ గా టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ ఎంపీ వివేక్ నివాసానికి స్వయంగా వెళ్లారు. హైదరాబాద్ లో చర్చలు జరిపారు. దీంతో వివేక్ ఎపిసోడ్ లో భారీ ట్విస్ట్ నెలకొంది.

వివేక్, ఆయన తండ్రి వెంకటస్వామి కాంగ్రెస్ లోనే పుట్టారు. ఎదిగారు. వివేక్ కూడా కాంగ్రెస్ ఎంపీగా గెలిచి అనంతరం టీఆర్ ఎస్ లో చేరారు. ఇప్పుడా పార్టీ కాలదన్నడంతో బీజేపీ వైపు అడుగులు వేస్తున్నాయి. అయితే బలమైన రాజకీయ కుటుంబం.. పైగా వివేక్ చేతిలో ఒక పత్రిక, ఒక బలమైన టీవీ చానెల్ ఉండడంతో ఈయనకు కాంగ్రెస్ గాలం వేసింది.

బీజేపీకి తెలంగాణలో అధికారంలోకి వచ్చే సామర్థ్యం లేదని.. కాంగ్రెస్ అయితేనే బెటర్ అని టీపీసీసీ చీఫ్ చర్చలు జరిపినట్టు తెలిసింది. దీంతో ఆషాఢం తర్వాత బీజేపీలోకి వెళ్లడానికి రెడీ అయిన వివేక్ ఇప్పుడు కాంగ్రెస్ వైపు మనసు మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది.