Begin typing your search above and press return to search.

అటవీ అధికారులపై దాడిలో మరో ట్విస్ట్

By:  Tupaki Desk   |   1 July 2019 9:57 AM GMT
అటవీ అధికారులపై దాడిలో మరో ట్విస్ట్
X
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ అధికారిపై దాడి చేసిన ఎమ్మెల్యే సోదరుడు, కోనేరు కృష్ణ వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. టీఆర్ ఎస్ వైస్ జడ్పీ చైర్మన్ గా ఉండి ఫారెస్ట్ అధికారులను చితకబాదిన కోనేరు కృష్ణ ను కాపాడేందుకు ఆయన అన్న, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రయత్నించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

తాజాగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ వివాదంలో మహిళా అటవీ అధికారిపై దాడి చేసిన విషయంలో గ్రామస్థులకు విలేకరులతో ఎలా తప్పుడు సమాధానాలు చెప్పాలో నేర్పడం వివాదాస్పదమైంది. కాగజ్ నగర్ లో ఆదివారం జరిగిన ఘటనపై సీఎం కేసీఆర్ , అధికారులు సీరియస్ అయ్యి దాడి చేసిన కోనేరు కృష్ణను రాజీనామా చేయించారు. ఈ ఘటనలో పోలీసులు 16మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించారు. సీరియస్ అయిన ఈ కేసులో తన తమ్ముడిని రక్షించేందుకు కోనప్ప రంగంలోకి దిగి మేనేజ్ చేయడం వివాదాస్పదమైంది.

తాజాగా ఎమ్మెల్యే కోనప్ప దాడి చేసిన సార్సాల గ్రామస్థులతో రహస్యంగా సమావేశమయ్యారు. ఆదివారం దాడిలో తన తమ్ముడిని ఎలా తప్పించాలో స్కెచ్ గీసి వారిని పిలిపించి విలేకరులతో ఇలా చెప్పించాలని బ్రీఫింగ్ ఇచ్చాడు. విలేకరులను రప్పిస్తానని.. భూముల దగ్గరకు వెళ్లొద్దని అటవీ అధికారులే తమపై దాడి చేసారని చెప్పాలని వారికి బ్రీఫింగ్ ఇచ్చాడు. 15 రోజుల కింద అధికారులు తమను కొట్టారని.. వాళ్లు కొట్టిన తర్వాతే దున్నొద్దని వెళితే గొడవ జరిగిందని.. అధికారులదే తప్పంతా అని చెప్పాలని బ్రీఫింగ్ ఇచ్చాడు. అయితే ఈ వీడియో బయటకు రావడం.. సోషల్ మీడియాలో బయటకు రావడంతో ఎమ్మెల్యే కోనప్ప బండారం బయటపడినట్టైంది. ఇది దుమారం రేపుతోంది.

కాగా ఈ వీడియో వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ మల్లారెడ్డి స్పందించారు. ఆధారాలు తారు మారు చేస్తే ఉపేక్షించేదిలేదని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోనేరు కృష్ణ సహా 15మందిని అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచామని వారికి 15 రోజుల రిమాండ్ విధిస్తే ఆదిలాబాద్ జైలుకు తరలించామని చెప్పుకొచ్చారు.. గాయపడ్డ అనితను హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సార్సాల గ్రామంలో భారీగా పోలీసులు మోహరించి వివాదాస్పద స్థలంలో మొక్కలను అటవీ అధికారులు నాటుతున్నారు.