Begin typing your search above and press return to search.

కన్నడ నాట కొత్త ట్విస్ట్... సీఎంగా యడ్డీ?

By:  Tupaki Desk   |   12 July 2019 12:34 PM GMT
కన్నడ నాట కొత్త ట్విస్ట్... సీఎంగా యడ్డీ?
X
రోజుకో ట్విస్టు పేరిట గతంలో ఎన్నడూ చూడని రీతిలో అనూహ్య పరిణామాలకు కేంద్రంగా మారిన కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ.... ఇప్పుడు సరికొత్త ప్లాన్ కు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ సర్కారును కూల్చే పనిలో భాగంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి బదులుగా సంకీర్ణం నుంచి జేడీఎస్ ను లాగేసి మరో సంకీర్ణానికి శ్రీకారం చుట్టే దిశగా బీజేపీ నేతలు రచిస్తున్న ఈ కొత్త ప్లాన్ నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ప్లాన్ ను ఇప్పటికే అమలు చేసేందుకు రంగంలోకి దిగిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

అయినా ఈ ప్లాన్ ను బీజేపీ ఎందుకు ఎంచుకుందన్న విషయానికి వస్తే... పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఇతర పార్టీల టికెట్లపై గెలిచిన ఎమ్మెల్యేలను తమ శిబిరంలో చేర్చుకోవడం ద్వారా జనాల్లో పలుచన అయిపోతామని కమలనాథులు ఆలోచిస్తున్నారట. అలా కాకుండా... కాంగ్రెస్ తో జట్టు కట్టి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసిన జేడీఎస్ ను తమవైపునకు తిప్పుకుంటే... ఆ మేర ప్రజల్లో వ్యతిరేకత రాదన్నది వారి భావనగా వినిపిస్తోంది. ఇక్కడిదాకా బాగానే ఉన్నా... తమ వైపునకు వచ్చే జేడీఎస్ కు కాంగ్రెస్ మాదిరిగా సీఎం పోస్టును వదిలేందుకు బీజేపీ సిద్ధంగా లేదట. సీఎం పోస్టును తన చేతిలోనే పెట్టుకుని డిప్యూటీ సీఎం పోస్టును మాత్రమే జేడీఎస్ కు ఇచ్చేందుకు బీజేపీ నేతలు వ్యూహం రచిస్తున్నారట. అది కూడా ప్రస్తుతం సీఎంగా ఉన్న జేడీఎస్ నేత కుమారస్వామికి కాకుండా డిప్యూటీ సీఎం పోస్టును ఆయన సోదరుడు రేవణ్ణకు కట్టబెట్టేందుకే బీజేపీ నేతలు ఇష్టపడుతున్నారట.

సరికొత్తగా రచించిన ఈ ప్లాన్ ను ఇప్పటికే బీజేపీ నేతలు అమలు చేయడం ప్రారంభించారని, ఇందులో భాగంగా ఇప్పటికే ఈ వ్యూహాన్ని జేడీఎస్ నేతలకు చేరవేశారని, వారిని ఈ ప్లాన్ కు ఒప్పించేలా బీజేపీకి చెందిన కీలక నేత మురళీధరరావు ఇప్పటికే రంగంలోకి దిగిపోయారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే... త్వరలోనే సీఎం కుర్చీలోని కుమారస్వామి పదవి నుంచి దిగిపోనుండగా, ఆ పోస్టులో బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప, డిప్యూటీ సీఎం పోస్టులో రేవణ్ణ కూర్చోనున్నారన్న మాట.