Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్: ఎల్బీ నగర్ రోడ్డు పై ఈత కొడుతూ వెళ్లాడు

By:  Tupaki Desk   |   18 Oct 2020 10:00 AM IST
హైదరాబాద్ లో కొత్త ట్రెండ్: ఎల్బీ నగర్ రోడ్డు పై ఈత కొడుతూ వెళ్లాడు
X
మీరు ఇంటికి వెళ్లాలనుకోండి.. ఇప్పటివరకు నడుచుకుంటూనో.. సైకిల్ లేదంటే బైక్.. కాదంటే కారు.. కుదరదంటే ఆటో.. ఇవేమీ అక్కర్లేదనుకుంటే ప్రజా రవాణాను వాడేస్తాం. కానీ.. ఇప్పుడు హైదరాబాదీయులు కొత్త ట్రెండ్ ను తీసుకొచ్చేస్తున్నరు. అనుకోని అతిధిలా..పిలవని పేరంటానికి వచ్చేసినట్లుగా వస్తున్న వర్షం.. హైదరాబాదీయులకు చుక్కలు చూపిస్తోంది. వర్షం పడుతుందంటే.. కాస్త కురిస్తే నీళ్ల కష్టాలు తొలుగుతాయన్న భావన ఉండేది. ఇప్పుడు ఆ స్థానంలో.. దండం పెడతా సామీ.. వర్షం మాత్రం వద్దనే వరకు నగర ప్రజలు వచ్చేశారు.

గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఈ అక్టోబరులో కురిసిన వర్షాలు హైదరాబాదీయులకు వర్షం మీద ఉండే మోజు మొత్తం తీరిపోయింది. ఈ నెల 14న కురిసిన వానతో లక్షలాది మందికి చుక్కలు కనిపించటమే కాదు.. నాలుగైదు రోజులు గడుస్తున్నా.. దాని తాలుకూ షాక్ నుంచి బయటకు రాని పరిస్థితి. ఇలాంటివేళ.. శనివారం సాయంత్రం ఐదు గంటలకు మొదలైన వర్షం.. సాయంత్రం ఏడు గంటలు అయ్యేసరికి భారీ వర్షంగా మారిపోయింది. ఆకాశానికి చిల్లులు పడినట్లుగా కురిసిన వానతో హైదరాబాదీయులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

మొన్నటి వర్షం తాలుకూ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే బయటకువస్తున్న నగర ప్రజలు.. తాజా వర్షం దిమ్మ తిరిగిపోయేలా చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అనుకోని రీతిలో కురిసిన వర్షంతో.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం చోటు చేసుకుంది. కీలోమీటర్ల కొద్దీ సాగిన ట్రాఫిక్ జాంతో విసిగిపోయిన ఒక యువకుడు.. ఎంచక్కా.. చెరువులా మారిన రోడ్డు మీదకు దబ్బుకున దూకేసి.. ఈత కొట్టుకుంటూ ఇంటికి వెళ్లాడు. ఈ సిత్రాన్ని చాలామంది తమ కెమేరాలతో వీడియోలు.. ఫోటోలు తీశారు. వర్షం ఎపిసోడ్ లో హైలెట్ సీన్ రా మామా అన్న మాటలు పలువురి నోట వినిపించాయి. ఎల్బీ నగర్ - చింతకుంట మధ్యలో చోటు చేసుకున్న ఈ పరిణామం చూస్తే.. హైదరాబాద్ రోడ్ల మీద ఇలా ఈత కొట్టే పరిస్థితిని ఇప్పటివరకు ఊహించలేనిది. ఈ మధ్యనే కురిసిన వర్షాల వేళ.. షేక్ పేట ప్రాంతంలో కూడా ఇదే రీతిలో ఈత కొట్టిన వీడియో వైరల్ అయ్యింది. చూస్తుంటే.. ఇదే స్థాయిలో వర్షం కంటిన్యూ అయితే.. హైదరాబాద్ రోడ్ల మీద ఈత కొట్టుకుంటూ ఇంటికి వెళ్లే వైనాలు చోటు చేసుకోవటం ఖాయం.