Begin typing your search above and press return to search.

నయా పొలిటికల్ ట్రెండ్.. గన్ మెన్ వాపస్

By:  Tupaki Desk   |   15 Feb 2016 7:30 AM GMT
నయా పొలిటికల్ ట్రెండ్.. గన్ మెన్ వాపస్
X
ఏపీ రాజకీయాల్లో.. అందులోనూ అధికార పక్ష రాజకీయాల్లో కొత్త ట్రెండు కనిపిస్తోంది. ప్రభుత్వం తమ పట్ల అన్యాయంగా వ్యవహరించింది అని భావించిన ప్రజాప్రతినిధులు... మంత్రులు కూడా తమ నిరసన తెలపడానికి కొత్త మార్గం ఎంచుకుంటున్నారు. ధర్నాలు - రాస్తారోకోలు - నిరాహార దీక్షలు వంటివి చేయడానికి కుదరదు కాబట్టి తమ అసంతృప్తి - అలక - ఆగ్రహం - నిరసన తెలియజెప్పడానికి కొత్త మార్గం అనుసరిస్తున్నారు. తమకు ప్రభుత్వం కల్పించిన గన్ మెన్లను తిప్పి పంపించి తమ కోపం వ్యక్తంచేస్తున్నారు.

తాజాగా కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా అదే పనిచేశారు. తనపై కేసులు పెట్టిన పోలీసుల తీరును నిరసిస్తూ తన గన్‌ మెన్లను వెనక్కు పంపారు. ప్రజల తరపున ఆందోళన కార్యక్రమంలో పాల్గొనందుకు తనపై కేసు నమోదు చేయడాన్ని వల్లభనేని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.

ఇటీవల అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి కూడా తన గన్ మెన్లను వెనక్కు పంపించేశారు. తన ముఖ్య అనుచరులకు భద్రత కావాలని పోలీసు ఉన్నతాధికారులను ఆయన కోరగా వారు గన్ మెన్లను కల్పించారు. కానీ, వారి ఖర్చులన్నీ ఆయా నేతలే భరించాలని చెప్పారు. దీంతో తన అనుచరులకు పెయిడ్ గన్ మెన్లను ఇస్తారా అంటూ జేసీ తన గన్ మెన్లను తిప్పి పంపించేశారు. అంతేకాదు... కొన్నాళ్లుగా బయటకు కనిపించలేదు. దీంతో జేసీ అలకబూని అజ్ఙాతంలోకి వెళ్లారన్న ప్రచారం జరిగింది. కానీ, ప్రభుత్వ కానీ, అధికారులు కానీ పట్టించుకోలేదు. దీంతో అభాసుపాలవుతామన్న ఉద్దేశంతో ప్రభాకరరెడ్డి అన్న జేసీ దివాకరరెడ్డి దీనిపై మాట్లాడి క్లారిటీ ఇచ్చారు. తన తమ్ముడు ఆఫ్రికా దేశాల్లో పర్యటిస్తున్నారని... అజ్ఙాతంలోకి వెళ్లలేదని చెప్పారు. ఆ తరువాత చడీచప్పుడు లేకుండా సైలెంటుగా గన్ మెన్ల వ్యవహారాన్ని సర్దు బాటు చేసుకున్నారు.

అయితే.. ఇటీవల గన్ మెన్లను వెనక్కు పంపించడం ఎందుకు చేస్తున్నారంటే దీనికి నేపథ్యం చెప్పాలి. కొద్ది నెలల కిందట ఓ విషయంలో మంత్రి పరిటాల సునీత కూడా ఇలాగే ఆగ్రహించి గన్ మెన్లను వెనక్కు పంపించారు. దెబ్బకు అధికారులు - పోలీసులు - హోం మంత్రి - చివరకు చంద్రబాబు కూడా కంగారు పడిపోయారు. ఆమెను బతిమాలి ఒప్పించి మళ్లీ గన్ మెన్లను ఆమె వద్దకు పంపించారు. దీంతో తాము గన్ మెన్లను తిప్పి పంపించినా ప్రభుత్వం అలాగే పరుగులు తీస్తుందని భావించి జేసీ, వంశీ వంటివారు ఈ ఎత్తుగడ వేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే జేసీ ప్రభాకరరెడ్డి అలా చేసి భంగపడగా తాజాగా వంశీకి కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు. పరిటాల సునీత నేపథ్యం... ఆమెకు ఉన్న ప్రజాదరణ కారణంగా ఆమె గన్ మెన్లను తిప్పి పంపితే ప్రభుత్వం పరుగులు తీసింది కానీ అందరూ అదే పనిచేస్తే ఇలాగే పట్టించుకోవడం మానేస్తుందని జనం అనుకుంటున్నారు.