Begin typing your search above and press return to search.

హైదరాబాద్ పోలీసులకు వణుకు పుట్టిస్తున్న మాయదారి రోగం

By:  Tupaki Desk   |   23 May 2020 6:30 AM GMT
హైదరాబాద్ పోలీసులకు వణుకు పుట్టిస్తున్న మాయదారి రోగం
X
దయ.. దాక్షిణ్యం లేకుండా తనకు దగ్గరగా వచ్చినోళ్లను ఏ మాత్రం వదలని వహమ్మారి దెబ్బతో ప్రపంచం ఎంతలా విలవిలలాడుతుందో తెలిసిందే. మిగిలిన చోట్ల సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణ రాష్ట్ర పోలీసులు మాత్రం ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు అహోరాత్రాలు కష్టపడుతున్నారు. విపరీతంగా శ్రమిస్తున్నారు. ఈ కారణంతోనే మరెవరికీ రానంత పేరు ప్రఖ్యాతులు వారికి దక్కాయి. విపత్తు వేళ.. విరుచుకుపడే ముప్పుకు అడ్డుగా నిలిచి డ్యూటీ చేస్తున్న హైదరాబాద్ పోలీసులకు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది.

గడిచిన కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాలు మాయదారి రోగం నుంచి పూర్తిగా బయయటపడ్డాయి. ఇప్పుడు నమోదవుతున్నకేసుల్లో 95 శాతానికి పైనే హైదరాబాద్ మహానగరంలోనివే. తాజాగా వస్తున్న వలస కార్మికులతో కొన్ని పాజిటివ్ కేసులు తెర మీదకు వస్తున్నాయి. .ఇదిలా ఉంటే.. గడిచిన నాలుగైదు రోజులుగా హైదరాబాద్ పోలీసులు ఈ మహమ్మారి బారిన పడటం ఆందోళనకు గురి చేస్తుంది.

తాజాగా ఒకే రోజులో ముగ్గురు పోలీసులకు పాజిటివ్ రావటం ఒకటైతే.. అందులో ఇద్దరు అధికారులు ఉండటం ఉలిక్కి పడేలా చేస్తోంది. శుక్రవారం పాజిటివ్ గా నమోదైన కేసుల్లో ముగ్గురు హైదరాబాద్ పోలీసులు ఉన్నారు. వారిలో ఒకరు ఇన్ స్పెక్టర్ స్థాయిలో ఒకరుంటే.. మరొకరు ఎస్ఐ స్థాయిలో ఉన్నారు. ఇంకొకరు కానిస్టేబుల్. ఈ ముగ్గురు మాయదారి రోగాన్ని కట్టడి చేసే డ్యూటీలోనే ఉన్నారు.

ఈ ముగ్గురిలో ఇద్దరు గాంధీ వద్దే విధులు నిర్వర్తిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రక్షకులుగా నిలుస్తున్న పోలీసులకు పాజిటివ్ గా తేలటం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. దీనికి రెండు రోజులు ముందు (బుధవారం) రాత్రి పోలీస్ కానిస్టేబుల్ ఒకరు మరణించటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో మరెక్కడా లేని రీతిలో హైదరాబాద్ మహానగరంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న వేళ.. అనూహ్యంగా పోలీసులు బాధితులుగా మారటం ఇప్పుడు కొత్త తలనొప్పిగా మారింది.