Begin typing your search above and press return to search.

ఐపీఎల్ కొత్త జట్లకు వారే యజమానులు కానున్నారా?

By:  Tupaki Desk   |   25 Oct 2021 5:03 AM GMT
ఐపీఎల్ కొత్త జట్లకు వారే యజమానులు కానున్నారా?
X
ఐపీఎల్ సీజన్ ముగిసింది. టీ 20 వరల్డ్ కప్ టోర్నీ షురూ అయ్యింది. సీజన్ వేళలో.. పెద్ద ఎత్తున వినిపించే ఐపీఎల్.. అందుకు భిన్నంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం ఐపీఎల్ లో ఇప్పటికే ఉన్న జట్లకు అదనంగా రెండు కొత్త జట్లను తీసుకోవాలని డిసైడ్ చేయటం తెలిసిందే. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించింది బీసీసీఐ. రెండు జట్లను సొంతం చేసుకోవటానికి ఇప్పటికే 22 జట్లు ఆసక్తిని చూపించాయి. రూ.10లక్షలు పోసి మరీ టెండర్ దరఖాస్తుల్ని కొనుగోలు చేసి.. తమ బిడ్డింగ్ లు వేశారు.

రేసులో 22 సంస్థలు ఉన్నప్పటికీ.. చివరికి వాటిని సొంతం చేసుకునే ఆ ఇద్దరు ఎవరన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు వినిపిస్తున్న అంచనా ప్రకారం.. ఐపీఎల్ కొత్త జట్లను సొంతం చేసుకునే సత్తా ఇద్దరికే ఉందన్న మాట వినిపిస్తోంది. వారిలో ఒకరు.. ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజం అదానీ అయితే.. రెండో ఫ్రాంఛైజీని గోయెంకా గ్రూపు సొంతం చేసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది. కొత్త జట్ల యాజమాన్య హక్కుల కోసం వేసిన టెండర్లను ఈ రోజున తెరుస్తారని చెబుతున్నారు.

కొత్త జట్ల ద్వారా బీసీసీఐకు భారీ ఆదాయం రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల అంచనా ప్రకారం ఒక్కో జట్టు నుంచి రూ.7-10 వేల కోట్ల వరకు వచ్చే వీలుందని అంటున్నారు. ఐపీఎల్ ఇమేజ్ అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. కొత్త జట్ల నుంచి భారీగా సొమ్ములు రావటం ఖాయమంటున్నారు. తాజా అంచనాలు చూస్తుంటే.. ఐపీఎల్ బ్రాండ్ విలువ ఎంతలా పెరిగిందనటానికి ఇదో నిదర్శనంగా చెబుతున్నారు.

బ్రాడ్ కాస్టింగ్ హక్కుల మార్కెట్ ఏకంగా రూ.36 వేల కోట్లకు చేరుకోవటం చూస్తూ.. ఐపీఎల్ కు ఉన్న జనాదరణ ఏమిటన్నది అర్థమవుతుంది. ఇక.. కొత్తగా వచ్చన జట్ల విషయానికి వస్తే.. పలు పేర్లు వినిపిస్తున్నా.. గుజరాత్ కు చెందిన అహ్మదాబాద్.. యూపీకి చెందిన లక్నో పేర్ల మీదనే తదుపరి జట్లు ఉంటాయని అంటున్నారు. వీటిల్లో అహ్మదాబాద్ జట్టును అదానీ సొంతం చేసుకుంటుందని.. లక్నో జట్టును గోయంకా గ్రూపు సొంతం చేసుకోవటం ఖాయమని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి. ఏమైనా.. కొత్త జట్ల ఏర్పాటు ఐపీఎల్ మరింత రసవత్తరంగా మారటమే కాదు.. బీసీసీఐకు కాసుల వర్షాన్ని కురిపిస్తుందని చెప్పక తప్పదు.