Begin typing your search above and press return to search.

కాకానిలో కొత్త టాలెంట్.. తెలుగు తిట్ల డిక్షనరీ రాయాల్సిందే

By:  Tupaki Desk   |   6 Jun 2021 9:04 AM IST
కాకానిలో కొత్త టాలెంట్.. తెలుగు తిట్ల డిక్షనరీ రాయాల్సిందే
X
నెల్లూరు జిల్లాలో సుపరిచితమైన రాజకీయ నేతగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకరు. వైసీపీ ఎమ్మెల్యేగా.. ఫైర్ బ్రాండ్ గా ఆయనకున్న పేరుకు తోడుగా ఆయనకు మరో టాలెంట్ కూడా ఉంది. తన రాజకీయ ప్రత్యర్థి కమ్ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ పేరు విన్నంతనే ఆవేశంతో ఊగిపోతారు. సాధారణంగా ఒక రాజకీయ నాయకుడ్ని.. మరో రాజకీయ నాయకుడు ఏమైనా తిట్టొచ్చు కానీ.. నీ పుట్టుక సరైనదా? లాంటి తీవ్రమైన వ్యాఖ్యలు అస్సలు చేయకూడదు. కానీ.. కాకానికి అదేమీ పట్టదు. ఆయన అడ్డూ ఆపూ లేకుండా తిట్టేస్తారు. అస్సలు మొహమాటానికి గురి కారు.

తాజాగా ఆనందయ్య మందు ఎపిసోడ్ తో ఆయన ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ సుపరిచితులయ్యారు. తెలియని వారు కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కాకాని.. ఆనందయ్యకు దన్నుగా నిలిచారన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అడ్డుకున్నారన్న వాదనలు వినిపించాయి.అయితే అవన్ని ఉత్త మాటలుగా తేలాయి. మొత్తంగా.. ఆనందయ్య మందుకు ఓకే చెప్పే విషయంలో కాకాని పాత్ర కీలకమన్న మాట పలువురి నోట వినిపించింది. ఇదిలా ఉంటే.. ఆనందయ్య మందును అక్రమంగా అమ్మేందుకు వైసీపీ ఎమ్మెల్యే ప్లాన్ చేస్తున్నారంటూ సోమిరెడ్డి తీవ్రస్తాయిలో ఆరోపణలు చేశారు.

ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో రంగంలోకి దిగిన కాకాని.. గతంలో ఎప్పుడూ లేనంత తీవ్ర పదజాలంతో సోమిరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆయనకు సంబంధించిన రాజకీయ.. వ్యక్తిగత వ్యాఖ్యలతో పాటు కుటుంబ అంశాలు కూడా తన ప్రెస్ మీట్ లో ఏకరువు పెట్టటం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన 20 నిమిషాలకు పైనే వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది. ఇందులో కాకాని వాడిన భాష.. వార్తల్లో ఎంత మాత్రం రాయలేని భాష. ఆయన ప్రస్తావించిన అంశాలు సైతం మీడియా ప్రమాణాలకు ఏ మాత్రం సరిపోనివి. అసలు ఇలాంటి మాటలు మాట్లాడతారా? అన్న భావన కలిగేలా కాకాని మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు.

తెలుగులో తిట్ల దండకం మీద పుస్తకం రాయాల్సి వస్తే.. కాకాని చేత రాయిస్తే.. అద్బుతంగా ఉంటుందన్న మాట కాకాని ప్రెస్ మీట్ వీడియోను చూసినోళ్లంతా వ్యాఖ్యానిస్తున్నారు. ఉండేకొద్దీ రాజకీయాల్లో మర్యాద తగ్గిపోతుందన్న దానికి నిలువెత్తు రూపంగా కాకానినిలుస్తారని చెప్పక తప్పదు. ప్రత్యర్థుల మీద విరుచుకుపడటం తప్పు కాదు. కానీ.. ఆ సందర్భంలో వాడే భాష చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు సుద్దపూసగా చెప్పుకోవటం ఓకే. కానీ.. ఆ క్రమంలో రాజకీయ ప్రత్యర్థిని తిట్టేందుకు మరీ ఇంతలా మాట్లాడాలా? అన్నది ప్రశ్న.