Begin typing your search above and press return to search.

కార్డును గీసేటోళ్ల కోసం కేంద్రం కొత్త ఆఫర్?

By:  Tupaki Desk   |   8 Dec 2016 8:57 AM GMT
కార్డును గీసేటోళ్ల కోసం కేంద్రం కొత్త ఆఫర్?
X
పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెనుక చాలా పెద్ద ప్లాన్ ఉందన్న విషయం కేంద్రం అనుసరిస్తున్న విధానాల్ని చూస్తుంటే సందేహం కలగక మానదు. నల్లధనంపై యుద్ధం అన్న ట్యాగ్ లైన్ తో పెద్దనోట్లను రద్దు చేసినప్పటికీ.. దాని అంతిమ లక్ష్యం.. దేశ ప్రజలందరిని పన్ను చట్టంలోకి తీసుకురావటం..ప్రతి పైసా ఖర్చును మిస్ కాకుండా డిజిటలైజ్ చేయటంగా తెలుస్తోంది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూస్తే.. దేశం మొత్తంలో ఆదాయపన్ను కడుతున్న వారు ఐదు శాతం కంటే తక్కువ.

అంతేనా.. అమ్మకాల పన్నును ఎగవేయటం.. వీలైనంతవరకూ జీరో బిజినెస్ (పన్ను కట్టకుండా లావాదేవీలు జరపటం) లాంటివి ఎక్కువగా సాగేవి. పెద్దనోట్లను రద్దు చేయటం.. కరెన్సీ నోట్ల మీద పట్టుబిగించటం.. కరెన్సీ కొరత ఉండేలా చూస్తూ.. డిజిటల్ లావాదేవీల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యేలా చేయటం చూస్తుంటే.. నగదు కొరత అన్నది కొంతకాలం పాటు సాగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నిన్నటి వరకూ జేబులో డబ్బులు పెట్టుకొని వెళ్లి కొనుగోలు చేసే దానికి భిన్నంగా కార్డుల్ని గీకేసి కొనటం కాస్త కష్టంగా మారిన వేళ.. అలా మార్చటానికి కొత్త తాయిలాన్ని కేంద్రం ప్రకటించాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. డెబిట్.. క్రెడిట్ కార్డులతో లావాదేవీలు జరిపే వారికి సేవా పన్నును మినహాయింపు ఇవ్వాలన్న దిశగా అడుగులు పడుతున్నట్లు చెబుతున్నారు. రూ.2వేల పరిమితి లోపు కొనుగోలు చేసిన వారి నుంచి సేవా పన్నును మినహాయించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. కార్డుల గీకేస్తే వచ్చే పన్నురాయితీ ప్రజల్లోని రద్దు ఆగ్రహాన్ని కొంతమేర తగ్గిస్తుందనటంలో సందేహం లేదు.