Begin typing your search above and press return to search.

'భరత్ అనే నేను'ను ఫాలో అవుతున్న ప్రభుత్వాలు!

By:  Tupaki Desk   |   29 Jun 2019 9:59 AM IST
భరత్ అనే నేనును ఫాలో అవుతున్న ప్రభుత్వాలు!
X
'భరత్‌ అనే నేను' చిత్రంలో కథనాయకుడు మహేశ్‌ బాబు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ట్రాఫిక్‌ నిబంధనలను కట్టుదిట్టం చేస్తాడు. అదే తరహాలో దేశ రాజధాని న్యూఢిల్లీలో కూడా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ స్థాయలో జరిమానాలు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా ప్రస్తుతం పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా ట్రాఫిక్‌ జరిమానాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రవాణా శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

గతంలో కంటే సుమారు పది రెట్ల వరకు జరిమానా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అంతేకాకుండా పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తే కోర్టు ద్వారా ఉపశమనం లభించాల్సి ఉంటుంది. నో పార్కింగ్‌ స్థలంలో వాహనాలు నిలిపితే రూ.వెయ్యి మూల్యం చెల్లించుకోవాల్సిందే. అదేవిధంగా ఫోన్‌ లో మాట్లాడుతూ వాహనం నడిపినా సరే రూ.1,000 ఇచ్చుకోవాల్సిందే. అయితే చాలామంది ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేయకుండా తమ జేబులు నింపుకుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో రూ.100 నుంచి జరిమానా మొదలయ్యేది.. అయితే తాజాగా రూ.వెయ్యి నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్టంగా రూ.10 వేల వరకు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి.

రిజిస్ట్రేషన్‌ లేకుండా ఒకసారి పట్టుబడితే రూ.5 వేలు జరిమానా వసూలు చేస్తారు. రెండోసారి అయితే రూ.10 వేలు.. మరోసారి పట్టుబడితే కోర్టుకు వెళ్లి జరిమానా చెల్లించి వాహనం విడుదల చేయించుకోవాలి. అదేవిధంగా ఫిట్‌ నెస్‌ సర్టిఫికెట్‌ లేని వాహనం రోడ్డుపైకి వస్తే తొలిసారి రూ.2 వేలు, రెండోసారి అయితే రూ.5 వేలు జరిమానా వసూలు చేస్తారు. అదేవిధంగా నో పార్కింగ్‌ బోర్డు ఉంచిన చోట వాహనం నిలిపితే ఇక నుంచి రూ.వెయ్యి కట్టాల్సిందే. గతంలో నో పార్కింగ్‌ కు జరిమానా రూ.100 చెల్లించాల్సి ఉండేది. దీనికి తోడు టోయింగ్‌ చార్జీలు కూడా వాహనదారుడే చెల్లించాలి. ద్విచక్ర వాహనాలకు అయితే టోయింగ్‌ చార్జీ రూ.1,650 నాలుగు చక్రాల వాహనాలకు రూ.2 వేలుగా నిర్ణయించారు. అయితే బెంగళూరులో చాలా ప్రాంతాల్లో వాహనాలు నిలిపేందుకు స్థలం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని జరిమానాలు పెంచడం సరికాదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు చాలా ప్రాంతాల్లో నో పార్కింగ్‌ బోర్డులు కూడా ఉంచడం లేదని చెబుతున్నారు.