Begin typing your search above and press return to search.

కొత్తగా; నాలుగు ట్రాకుల్లో ‘కేసులు’

By:  Tupaki Desk   |   10 July 2016 7:06 AM GMT
కొత్తగా; నాలుగు ట్రాకుల్లో ‘కేసులు’
X
కొండలా పెరిగిపోతున్న కేసుల లెక్క చూడటానికి.. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించే వారికి మరింత సత్వరం న్యాయం అందేలా చేయటానికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక కొత్త విధానాన్ని హైకోర్టు తెర మీదకు తీసుకొచ్చింది. సివిల్ కేసుల్ని వాయిదాల మీద వాయిదాలతో కాలయాపన చేసే విదానానికి చెక్ చెప్పేందుకు వీలుగా ఈ కొత్త విధానం అందుబాటులోకి రానుంది. అదే విధంగా.. తరచూ నోటీసులతో కాలం వెళ్లబుచ్చటం.. వాయిదాల మీద వాయిదాలతో కాలయాపన చేసేందుకు వీలు లేకుండా తాజావిధానంలో మార్పులు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా మొత్తం కేసుల్ని నాలుగు ట్రాకుల్లోకి మార్చేయనున్నారు. కేసుల తీరును అనుసరించి ఈ నాలుగు ట్రాకుల్లో ఒక విభాగంలోకి మార్చటమే కాదు.. ప్రతి ట్రాకుకు నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించే విధానాన్ని సిద్ధం చేశారు. దీంతో.. ఇప్పటివరకూ ఉన్న కేసులతో పాటు.. భవిష్యత్తులో కోర్టులకు వచ్చే కేసుల్ని ఇదే ఫార్మాట్ లోకి మార్చేస్తారు.

ఇక.. తాజాగా తీసుకొచ్చిన నాలుగు ట్రాకుల్ని చూస్తే..

ట్రాక్ 1 (9 నెలల్లో పరిష్కరించాలి)

భరణం చెల్లింపు.. పిల్లల కస్టడీ.. సంరక్షకుల నియామకం.. సందర్శన హక్కులు.. అద్దె రికవరీ.. శాశ్విత ఇంజంక్షన్.. వారసత్వ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన కేసులు.

ట్రాక్ 2 (12 నెలల్లో పరిష్కరించాలి)

తీర్పుల అమలు.. విడాకులు.. ఖాళీ చేయించటం లాంటి కేసులు

ట్రాక్ 3 (24 నెలల్లో పరిష్కరించాలి)

ఆస్తుల విభజన.. ఆస్తులపై హక్కుల ప్రకటన.. స్వాధీనం.. తప్పనిసరి ఇంజంక్షన్.. అప్పీళ్లు.. ఖర్చులు..అనుభవ హక్కు.. ట్రేడ్ మార్కులు.. కాపీరైట్లు.. పేటెంట్లు.. మేథోసంపత్తి హక్కుల లాంటి కేసులు

ట్రాక్ 4 (24 నెలల్లో పరిష్కరించాలి)

ట్రాక్ 1.. ట్రాక్ 2.. ట్రాక్ 3 పరిధిలోకి రాని కేసులు ఈ విభాగం కిందకు వస్తాయి.