Begin typing your search above and press return to search.

ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ .. మారే ఆ ఐదు అంశాలు ఏవంటే !

By:  Tupaki Desk   |   31 July 2021 7:47 AM GMT
ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ .. మారే ఆ ఐదు అంశాలు ఏవంటే !
X
ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. జీతం, పెన్షన్, ఈఎంఐ పేమెంట్ల వంటి ముఖ్యమైన లావాదేవీల కోసం బ్యాంకుల వర్కింగ్ డే కోసం ఎదురుచూడాల్సిన పనిలేదు. వర్కింగ్ డే తో సంబంధం లేకుండా మీ నెల జీతం లేదా పెన్షన్ అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH) రూల్స్ మార్చేసింది. ఈ కొత్త రూల్స్ ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్ ఏసిహెచ్ సర్వీసులు ఇప్పుడు వారానికి ఏడు రోజులు అందుబాటులో ఉంటాయి. గ్యాస్ సిలిండర్, బ్యాంక్ చార్జీలు దగ్గరి నుంచి ఏటిఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్ వరకు పలు అంశాలు మారబోతున్నాయి. అందువల్ల ఆగస్ట్ 1 నుంచి మారే అంశాలు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం, సోమవారం నుంచి శుక్రవారం వరకు బ్యాంకులు తెరిచినప్పుడు మాత్రమే సౌకర్యాలు అందుబాటులో ఉండేవి. ఇకపై అలా కాదు.. వారమంతా ఈ సర్వీసులను పొందవచ్చు. NACH సౌకర్యాలను ఏ రోజైనా పొందవచ్చు. కొన్నిసార్లు, నెలలో మొదటి తేదీ వీకెండ్ లలో వస్తుంటుంది. అలాంటప్పుడు జీతం లేదా పెన్షన్, ఈఎంఐ పేమెంట్ల కోసం సోమవారం వరకు వేచి చూడాల్సి వస్తోంది. అప్పుడు మాత్రమే జీతాలు అకౌంట్లో క్రెడిట్ అవుతున్నాయి. ఇప్పటినుంచి వారాలతో సంబంధం లేదు. ఎప్పుడైనా మీ అకౌంట్లో నగదు క్రెడిట్ అయిపోతాయి. అంతేకాదు.. విద్యుత్ బిల్లు, గ్యాస్, టెలిఫోన్, నీరు, లోన్ ఈఎంఐ, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌ మెంట్, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల సదుపాయం కూడా ఉంది. ఈ సదుపాయాలన్నింటినీ పొందడానికి మీరు సోమవారం నుంచి శుక్రవారం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు మీ లావాదేవీలను వారాంతాల్లో కూడా పొందవచ్చు.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కొత్త రూల్ తీసుకువచ్చింది. ఆగస్ట్ 1 నుంచి డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులకు చార్జీలు పడతాయి. ప్రస్తుతం ఈ సేవలు ఉచితంగానే లభిస్తున్నాయి. రూ.20 చార్జీ పడుతుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్‌ కు సంబంధించి కొన్ని మార్పులు చేసింది. వచ్చే నెల నుంచి బ్యాంకులు ఇంటర్‌ ఛేంజ్ ఫీజును రూ.15 నుంచి రూ.17కు పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ఇది వర్తిస్తుంది. అదే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌ కు చార్జీలు రూ.5 నుంచి రూ.6కు పెరగనున్నాయి.

ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ చార్జీలను సవరించింది. హోమ్ బ్రాంచులో నెలకు రూ.లక్ష వరకు చార్జీలు లేకుండా తీసుకోవచ్చు. రూ.లక్ష దాటితే రూ.1000కి రూ.5 చార్జీ పడుతుంది. గరిష్టంగా రూ.150 చార్జీ చెల్లించాలి. అదే నాన్ హోమ్ బ్రాంచులో అయితే రోజుకు రూ.25 వేల వరకు క్యాష్ ట్రాన్సాక్షన్ల కు చార్జీలు ఉండవు. రూ25 వేలు పైన అయితే రూ.1000కి రూ.5 చార్జీ పడుతుంది. గరిష్టంగా రూ.150 చెల్లించాలి. ఏడాదిలో 25 చెక్కుల వరకు చార్జీలు ఉండవు. అదే లిమిట్ దాటితే 10 చెక్కులు కలిగిన ప్రతి చెక్ బుక్‌ కు రూ.20 కట్టాలి. ఇకపోతే ప్రతి నెలా ఆరంభంలో ఎల్‌ పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మారుతూ ఉండొచ్చు. ఈ నెలలో కూడా ధరలు పెరగొచ్చు. లేదంటే తగ్గొచ్చు. కొన్ని సందర్భాల్లో స్థిరంగా కూడా కొనసాగవచ్చు.