Begin typing your search above and press return to search.

ఢిల్లీ సర్కారు పెట్టిన రూల్ దేశమంతా పెట్టాలి

By:  Tupaki Desk   |   9 Oct 2021 4:45 AM GMT
ఢిల్లీ సర్కారు పెట్టిన రూల్ దేశమంతా పెట్టాలి
X
మహమ్మారి కరోనాకు చెక్ పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్నికావు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. దాన్ని త్వరితగతిన అందరికి అందేలా చేయటంలో జరిగిన ఆలస్యానికి.. పలు దేశాలు అందుకు తగ్గ మూల్యాన్ని చెల్లించటం తెలిసిందే. మన దేశంలో అమలు చేస్తున్న వ్యాక్సినేషన్ విషయంలో పలు లోపాలు ఉన్నట్లుగా విమర్శలు వస్తున్నా.. ప్రపంచంలోని పలు దేశాల్ని చూసినప్పుడు మాత్రం.. మన దేశంలో అమలవుతున్న వ్యాక్సినేషన్ మెరుగ్గా ఉందన్న భావన కలుగక మానదు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ విషయంలో పలువురు ప్రదర్శిస్తున్న అలసత్వంపై కొరడా ఝుళిపించింది. తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. అక్టోబరు 16 తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు.. ఉపాధ్యాయులు కనీసం ఒక డోసు వ్యాక్సిన్ వేసుకోవటం తప్పనిసరి అని తేల్చింది. కనీసం ఒక్క డోస్ కూడా టీకా వేయించుకోని వారు.. ఆఫీసులకు రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యింది.

ఉపాధ్యాయులు.. ఫ్రంట్ లైన్ కార్యకర్తలతో సహా వ్యాక్సిన్ వేయించుకోని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. అలాంటి వారు ఒక డోసు వేయించుకునే వరకు వారి పని దినాల్ని సెలవుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. నిజానికి ఇదే విధానాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.