Begin typing your search above and press return to search.

ఐపీఎల్ లో కొత్త రూల్.. ‘సాఫ్ట్ సిగ్న‌ల్’కు బీసీసీఐ రెడ్ సిగ్న‌ల్‌!

By:  Tupaki Desk   |   28 March 2021 11:30 PM GMT
ఐపీఎల్ లో కొత్త రూల్.. ‘సాఫ్ట్ సిగ్న‌ల్’కు బీసీసీఐ రెడ్ సిగ్న‌ల్‌!
X
‘సాఫ్ట్ సిగ్నల్..’ బహుశా చాలా మంది క్రికెట్ ప్రేమికులకు ఈ నిబంధన తెలియకపోవచ్చు. కొన్నిసార్లు బ్యాట్స్ మెన్ బంతిని గాల్లోకి లేపుతాడు. క్యాచ్ పట్టడానికి ఫీల్డర్ తీవ్ర ప్రయత్నం చేస్తాడు. చివరకు బంతిని పట్టుకుంటాడు కూడా. కానీ.. అది నేలకు తాకిన త‌ర్వాత ప‌ట్టుకున్నాడా? తాకకుండా పట్టుకున్నా? అనేది అర్థంకాదు.

ఇలాంటి స‌మ‌యంలో ఫీల్డ్ అంపైర్.. థ‌ర్డ్ అంపైర్ ను ఆశ్ర‌యిస్తాడు. ఆయ‌న టీవీలో రీప్లే చేసి, ప‌లు కోణాల్లో ప‌రిశీలించి ఔటా? క‌దా? అన్న‌ది తేలుస్తాడు. అయితే.. ఈ స‌మ‌యంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద త‌న నిర్ణ‌యం ఏంటో చెబుతాడు ఫీల్డ్ అంపైర్ చెబుతాడు. ఇలా చెప్ప‌డాన్నే ‘సాఫ్ట్ సిగ్న‌ల్‌’ అంటారు. అది ఔట్ కావొచ్చు.. నాటౌట్ కావొచ్చు. కానీ.. ఫీల్డ్ లో ఉండి చూశాడు కాబట్టి.. తన నిర్ణయం ఇదీ అని థర్డ్ అంపైర్ కు వివరిస్తాడు.

అప్పుడు థర్డ్ అంపైర్ రీప్లేను పరిశీలించి, ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకొని ఫైనల్ డెసిషన్ చెప్తాడు. అయితే.. చాలా సందర్భాల్లో నిర్ణయం తీసుకోవడం క్లిష్టంగా ఉంటుంది. దీంతో.. రిస్క్ తీసుకోవ‌డం ఎందుక‌ని.. ఫీల్డ్ అంపైర్ ప్ర‌క‌టించిన సాఫ్ట్ సిగ్న‌ల్ నిర్ణ‌యాన్నే ఫైన‌ల్ నిర్ణ‌యంగా ప్ర‌క‌టిస్తారు కొంద‌రు థ‌ర్డ్ అంపైర్లు.

తాజాగా ఇంగ్లండ్ తో ముగిసిన‌ నాలుగో టీ20లో ఇదే జ‌రిగింది. సూర్య‌కుమార్ ఇచ్చిన క్యాచ్ ను దేవిడ్ మ‌లాన్ డైవ్ చేసి అందుకున్నాడు. కానీ..ఆ త‌ర్వాత నేల‌ను తాకిన‌ట్టు రిప్లేలో క‌నిపించింది. అయిన‌ప్ప‌టికీ.. ఫీల్డ్ అంపైర్ చెప్పిన సాఫ్ట్ సిగ్న‌ల్ ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ఔట్ గా ప్ర‌క‌టించాడు థ‌ర్డ్ అంపైర్‌. దీంతో.. విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని ప‌రిశీలించిన బీసీసీఐ.. ఐపీఎల్ లో సాఫ్ట్ సిగ్న‌ల్ నిబంధ‌న‌ను తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. 2021 ఐపీఎల్ సీజ‌న్ నుంచే అమ‌లు చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. దీని ప్ర‌కారం.. థ‌ర్డ్ అంపైర్ సొంతంగానే నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తారు.