Begin typing your search above and press return to search.

నాలుగు స్థంభాలాట : బీజేపీలో కొత్త ప్రధానులు...?

By:  Tupaki Desk   |   15 July 2022 4:30 PM GMT
నాలుగు స్థంభాలాట : బీజేపీలో కొత్త ప్రధానులు...?
X
బీజేపీ అంటే మోడీ అన్నట్లుగా గత ఎనిమిదేళ్ళుగా కధ మొత్తం మార్చేశారు. 2013లో గుజరాత్ నుంచి మోడీ ఢిల్లీ వచ్చి ఏ ముహూర్తాన బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా ఆ పార్టీ జాతీయ కార్యవర్గం చేత ప్రతిపాదించబడ్డారో తెలియదు కానీ నాటి నుంచి బీజేపీకి ఆయనే మూల పురుషుడు అయిపోయారు. కాషాయం పార్టీ మొత్తాన్ని తన కంట్రోల్ లో పెట్టుకుని మరీ మోడీ తానే ఫుల్ ఫోకస్ అవుతున్నారు. ఇప్పటికి రెండు సార్వత్రిక ఎన్నికలు జరిగితే రెండు సార్లూ ఫుల్ మెజారిటీతో బీజేపీని అధికారంలోకి తెచ్చిన మోడీ దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా నిండుగా పొందారు.

ఆయన మరో రెండేళ్లలో పదేళ్ల ప్రధానిగా కొత్త రికార్డుని క్రియేట్ చేయనున్నారు. కాంగ్రేసేతర ప్రధానులలో ఇకా వరసగా రెండు ఫుల్ టెర్ములను పూర్తి చేసిన వారు ఎవరూ లేరు. ఇక ముచ్చటగా మొడవసారి కూడా మోడీ నెగ్గితే ఇందిరాగాంధీ రికార్డుని కూడా అధిగమిస్తారు అని అంటున్నారు. ఆ దిశగానే ఆయన ఆలోచనలు ఉన్నాయని చెబుతున్నారు.

చూడబోతే దేశంలో ఈ రోజుకు ఉన్న వాతావరణం బట్టి చూస్తే బీజేపీ ఏదో విధంగా మూడవసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం అయితే కచ్చితంగా ఉంది. అయితే మోడీ హ్యాట్రిక్ ప్రధానిగా రికార్డు తిరిగి రాయాలనుకుంటే అదే పార్టీలో ఆయనకు మామూలు పోటీ లేదని అంటున్నారు.

మోడీకి పక్కనే ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని రేసులో చాలా మంది కంటే ముందే ఉన్నారని అంటున్నారు. ఆయన మోడీకి కుడిభుజంగా ఉంటూ వస్తున్నారు. ఈ ఇద్దరే పార్టీ అంటే ఈ ఇద్దరే ప్రభుత్వం అంటే అన్నట్లుగా కధ ఇప్పటిదాకా సాగుతూ వచ్చింది. కానీ దానికి ఒక చిన్న చేంజ్ అని యూపీ ఎన్నికల్లో వరసగా రెండవసారి గెలిచి వచ్చిన యోగీ ఆదిత్యనాధ్ అంటున్నారు. ఆయన దేశంలో అతి పెద్ద రాష్ట్రం నుంచి రెండు టెర్ములుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఆయన కూడా కరడుకట్టిన హిందూత్వ వాది. పైగా ఆయనకు ఆరెస్సెస్ మద్దతు దండీగా ఉంది అంటున్నారు. ఆయన ఇమేజ్ కూడా మెల్లగా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఎక్కడ ఏ రాష్ట్రాన ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా యోగీని పిలవడం అలవాటుగా మారిపోయింది. ఇక యూపీ నుంచే ఎక్కువగా ప్రధానులు వస్తారు. ఆ సెంటిమెంట్ చూసుకున్నా యోగీకి ప్రధాని పీఠం చేరువే అంటున్నారు.

ఆయన కూడా మరో రెండేళ్ళు సీఎం గా ఉండి ఆ తరువాత ప్రమోషన్ మీద ప్రధాని పీఠం ఎక్కేయాలని ఉబలాటపడుతున్నారు అని చెబుతున్నారు. ఇక మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రధాని పదవి మీద మోజు పెంచుకుని ఉన్నారు. నాగపూర్ ఆఫీస్ కి ఆయన చాలా దగ్గరివాడు అని చెబుతారు. నాగపూర్ లో ఆరెస్సెస్ కేంద్ర కార్యాలయం ఉంది. ఇక గడ్కరీని ప్రధాని చేయాలన్న ప్రతిపాదన 2019 నుంచే ఉంది. అప్పట్లో రెండవసారి బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోతే మోడీ ప్లేస్ లో గడ్కరీ వస్తారని అంతా భావించారు.

కానీ ఫుల్ మెజారిటీతో మోడీ ఇంటా బయటా చాలా మంది నోళ్ళు మూయించేసి ప్రాధాని తానే అనిపించుకున్నారు. ఇపుడు మాత్రం బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోతే ఆరెస్సెస్ రంగంలోకి దిగడం ఖాయమని అంటున్నారు. ఇక ఆరెస్సెస్ చేతిలో యోగి, గడ్కరీ ఇద్దరు ఉన్నారు. అమిత్ షా అత్యంత శక్తిసంపన్నుడు, వ్యూహకర్త. అయితే గుజరాత్ నుంచి మోడీ వస్తే మళ్లీ వెంటనే మరో ప్రధాని అక్కడ నుంచి వస్తారా, అది సంప్రదాయమేనా అన్న చర్చ ఉంది.

కానీ మోడీ నూటికి రెండు వందల శాతం తానే ప్రధాని కావాలని చూస్తారు. ఒక వేళ అది పడకపోతే ఆయన ప్రతిపాదించేది అమిత్ షానే అని అంటున్నారు. ఇప్పటికే పార్టీ మీద ప్రభుత్వం మీద గట్టి పట్టున్న మోడీ షాలు ఇద్దరూ ప్రధాని పీఠాన్ని తమ చేతుల నుంచి తప్పిపోకుండా చూసుకోగలరు అని అంటున్నారు. ఏది ఏమైనా రెండేళ్ళ వ్యవధిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయనగానే దేశంలో హడావుడి మొదలైంది.

మరీ ముఖ్యంగా బీజేపీలో ప్రధాని పదవి కోసం నాలుగు స్థంభాలాట కూడా స్టార్ట్ అయిపోయింది. మరీ దేశ జనాలు బీజేపీకి పూర్తి మద్దతు ఇచ్చి ఎవరి ప్రమేయం లేకుండా కేంద్రంలో ఆ పార్టీకి అవసరమైన సీట్లు ఇస్తే మాత్రం మోడీ మూడవసారి ప్రధాని అయిపోవడం ఖాయం. మెజారిటీ రాకపోతేనే కాషాయ దళంలో అసలైన రాజకీయం అపుడు పురుడుపోసుకుంటుంది.