Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కొత్త ప్రెసిడెంట్ ఎవరో తెలుసా... ?

By:  Tupaki Desk   |   31 Dec 2021 5:00 AM IST
కాంగ్రెస్ కొత్త ప్రెసిడెంట్ ఎవరో తెలుసా... ?
X
కాంగ్రెస్ పార్టీ దేశంలో శతాధిక వృద్ధ పార్టీ. ఆ పార్టీకి ఉన్న చరిత్ర దేశంలో మరే దానికీ లేదు. ఇక దేశంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కూడా కాంగ్రెస్. అలాగే అనేక రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పాలించిన రికార్డుని ఈ రోజుకీ మరే పార్టీ బద్ధలు కొట్టలేకపోయింది. చిత్రమేంటి అంటే ఈ రోజుకీ ఆసేతు హిమాచలం తెలిసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే. మిగిలిన పార్టీలు జాతీయ ట్యాగ్ తగిలించినా ఇంకా వాటి చేతికి చిక్కని రాష్ట్రాలు ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.

అలాంటి కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల నుంచి ఓడిపోతూ వస్తోంది. ఇక కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా ఒక సమస్యగా మారుతోంది. వయోభారంతో పాటు, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా సోనియా గాంధీయే ఈ రోజుకీ తాత్కాలిక హోదాలో ప్రెసిడెంట్ గా ఉన్నారు. రాహుల్ కేవలం ఆరు నెలలు మాత్రమే ప్రెసిడెంట్ గా చేసి 2019 ఎన్నికల తరువాత ఓటమికి బాధ్యత వహిస్తూ తప్పుకున్నారు.

ఇక కాంగ్రెస్ కి కొత్త ప్రెసిడెంట్ కావాలని ఆ పార్టీ సీనియర్లు ఎంతో కాలంగా కోరుతూ వస్తున్నారు. అయితే అదిగో ఇదిగో అంటూ పుణ్యకాలమంతా గడిపేశారు. కాంగ్రెస్ బాధ్యతలు సోనియాగాంధీ నుంచి ఎవరికీ చిక్కడంలేదు. ఇక రాహుల్ గాంధీ కొత్త ప్రెసిడెంట్ కావాలని ఒక వర్గం పార్టీలో గట్టిగా డిమాండ్ చేస్తూండగా, ప్రియాంకా గాంధీని చేయాలని మరో వర్గం పట్టుపడుతోంది. రాహుల్ ని ప్రెసిడెంట్ గా ఉంచి ప్రియాంకకు కూడా సముచితమైన బాధ్యతలు అప్పగించాలని మధ్యేవాదులు కోరుతున్నారు.

కాంగ్రెస్ ప్రెసిడెంట్ విషయంలో రాహుల్ అయితే ఈ రోజుకీ ఆసక్తి కనబరచడంలేదు, అలాగని ప్రియాంకాగాంధీకి ఇస్తే ఆయన స్పందన ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలియడంలేదు. రాహుల్ గాంధీ ప్రెసిడెంట్ కావాలీ అంటే కొన్ని కండిషన్లు పెడుతున్నారని కూడా ప్రచారంలో ఉంది. పార్టీని సీనియర్ల నుంచి తప్పించి తాను కోరుకున్న యువ నాయకులతో కొత్తవారితో నింపాలని ఆయన చూస్తున్నారు. అయితే పార్టీలో సుదీర్ఘకాలంగా పాతుకుపోయిన సీనియర్లను ఉన్న ఉదుటన తప్పించడం అంటే అది కుదిరే వ్యవహారం కాదు, వారి సేవలను వాడుకుంటూనే కొత్త వారికి కూడా చోటివ్వాలని సూచనలు ఉన్నాయి.

కానీ రాహుల్ గాంధీ మాత్రం తాను కోరుకున్నట్లుగా పార్టీని నడిపించే స్వేచ్చ ఉంటేనే పగ్గాలు స్వీకరిస్తాను అంటున్నారు. మరి రాహుల్ కోరిన మేరకు అలా చేయడానికి సోనియా గాంధీ సిద్ధంగా ఉన్నారా అన్నదే చర్చగా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే గాంధీ ఫ్యాంలీని కాదని వేరే వారిని తెచ్చిపెట్టినా పార్టీ నిలిచి గెలవదు అన్నది తెలిసిందే. అయితే రాహుల్ మాత్రం గాంధీ ఫ్యామిలీ కాకుండా ఎవరైకైనా కిరీటం పెట్టేందుకు రెడీ అంటున్నారు.

సోనియా గాంధీ మనసు మాత్రం రాహులే ప్రెసిడెంట్ గా ఉండాలని ఉంది. ఇలా అనేక చర్చోపచర్చలు జరుగుతుండగానే 2021 వెళ్ళిపోయింది. 2022లో కాంగ్రెస్ కి కొత్త ప్రెసిడెంట్ వస్తారని అంటున్నారు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల అధారిటీ అధ్యక్షుడు మధుసూదన్. 2022 సెప్టెంబర్ నాటికి అధ్యక్ష ఎన్నికలు పూర్తి అవుతాయని చెబుతున్నరు. అక్టోబర్ నాటికి కాంగ్రెస్ కి కొత్త ప్రెసిడెంట్ వచ్చేది ఖాయమని చెబుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ కొత్త ప్రెసిడెంట్ ఎవరు అవుతారో చూడాలి