Begin typing your search above and press return to search.

కేంద్రంలో కొత్త మంత్రులెవరు?

By:  Tupaki Desk   |   18 May 2016 11:05 AM GMT
కేంద్రంలో కొత్త మంత్రులెవరు?
X
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రావడానికి గట్టిగా 24 గంటల సమయం ఉందనగా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయనే ఊహాగానాలు ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. చాలాకాలంగా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై వార్తలొస్తున్నా అది కార్యరూపం దాల్చలేదు. అయితే... ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మార్పులు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్సు బలంగా చెబుతుండడంతో మార్పులు అనివార్యమనిపిస్తున్నాయి. ప్రస్తుత కేంద్ర క్రీడలు - యువజన వ్యవహారాల మంత్రి శర్వానంద్ సోనోవాల్ ను బీజేపీ తన అస్సాం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటించడం... ఇప్పుడు అస్సాంలో బీజేపీ విజయావకాశాలు మెండుగా ఉండడంతో ఆయన ముఖ్యమంత్రి పదవి చేపడితే కేంద్ర మంత్రివర్గంలో ఒక బెర్తు ఖాళీ అవుతుంది. దాన్ని పూరించడంతో పాటు మిగతా మార్పులూ చేస్తారని తెలుస్తోంది.

మంత్రివర్గంలో మార్పుల్లో భాగంగా ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా - పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌.. మైక్రో - స్మాల్‌ - మీడియం ఎంటర్‌ ప్రైజెస్‌ సహాయ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ లను మంత్రి పదవులనుంచి తప్పిస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ముగ్గురికి తిరిగి పార్టీ పని అప్పగించే అవకాశాలున్నట్లు తెలిసింది. వీరితో పాటు ఆర్థిక వ్యవహారాల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎంపీ - కేంద్ర మంత్రి సుజనా చౌదరికి కూడా ఊస్టింగ్ తప్పదని తెలుస్తోంది. ఆ లెక్క ప్రకారం కచ్చితంగా అయిదుగురు మంత్రులకు ఉద్వాసన ఉంటుందని భావిస్తున్నారు. వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాల్సి ఉంటుంది.

ఇదే సమయంలో వివిధ రాష్ర్టాలనుంచి కొత్తగా రాజ్యసభ సభ్యులు బీజేపీ నుంచి ఎంపిక కానున్నారు. వారిలో కొందరికి పదవీ యోగం పడుతుందని భావిస్తున్నారు. ఇక టీడీపీ నుంచి ఖాళీ కానున్న సుజనా స్థానంలో ఎవరిని తీసుకుంటారన్నది తేలలేదు. కాపుల కోటాలో కాకినాడ ఎంపీ తోట నరసింహానికి అవకాశముందని కొద్దికాలంగా ఊహాగానాలు వస్తున్నా ఆయనపై తాజాగా తీవ్ర ఆరోపణలు రావడంతో ఆయన పేరు పరిశీలించకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు టీఆరెస్ కేంద్రంలో చేరుతుందన్న అంచనాల నేపథ్యంలో ఆ పార్టీ నుంచి ఒకరిద్దరికి స్థానం దొరకొచ్చని తెలుస్తోంది.